మెదడులో దిక్సూచి ఆవిష్కర్తలకు నోబెల్ | Shah Rukh Khan presented with Global Diversity Award | Sakshi
Sakshi News home page

మెదడులో దిక్సూచి ఆవిష్కర్తలకు నోబెల్

Published Thu, Oct 9 2014 2:32 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మెదడులో దిక్సూచి ఆవిష్కర్తలకు నోబెల్ - Sakshi

మెదడులో దిక్సూచి ఆవిష్కర్తలకు నోబెల్

అవార్డులు
 షారుక్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డు
 2014 సంవత్సరానికి గ్లోబల్ డైవర్సిటీ అవార్డు బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌కు లభించింది. భారతీయ సినీ రంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ అక్టోబర్ 4న బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో చేతుల మీదుగా షారుక్ ఈ అవార్డును అందుకున్నారు.
 
 మెదడులో దిక్సూచి ఆవిష్కర్తలకు నోబెల్
 మెదడులో దిశానిర్దేశం జరిగే తీరును వెలుగులోకి తెచ్చిన బ్రిటన్ అమెరికన్ జాన్ ఓ కీఫ్, నార్వే జంట ఎడ్వర్డ్ మోసర్,  మే-బ్రిట్ మోసర్‌లు వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన స్థితిని తెలుసుకోవడానికి దోహదపడే పొజిషనింగ్ వ్యవస్థను కనుగొన్నందుకు అవార్డు కమిటీ వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పటిదాకా ఐదు జంటలు నోబెల్ గెలుచుకోగా వీరిలో నాలుగు జంటలు సంయుక్తంగా అందుకున్నారు. అలాగే ఫిజిక్స్‌లో జపాన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సుజి నకమురాలను అకాడమీ ఎంపిక చేసింది.
 
 జాతీయం
 పాలసీరేట్లు యథాతథంగా ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో సెప్టెంబర్ 30న రిజ ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రే ట్లను మార్పు చేయకుండా కొనసాగించింది. స్వల్పకాలిక రుణ రేటు (రెపో రేటు)ను 8 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తిని(సీఆర్‌ఆర్) 4శాతంగా, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియా(ఎస్‌ఆల్‌ఆర్)- 22 శాతంగా కొనసాగించింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవడం వరుసగా ఇది నాలుగో సారి. అంచనాల స్థాయికి ద్రవ్యోల్బణం తగ్గేవరకు రేట్ల తగ్గింపు ఉండదని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 5.5శాతంగా,2015 -16లో 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
 
 40 ఏళ్లలో 52 శాతం నశించిన వన్యజీవులు
 1970 నుంచి 2010 మధ్య కాలంలో 52 శాతం వన్యప్రాణులు నశించాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యు.డబ్ల్యు. ఎఫ్)రూపొందించిన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌లో పేర్కొంది. క్షీరదాలు, పక్షులు, చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు గత 40 ఏళ్లలో 52 శాతం వరకు క్షీణించాయి.
 
 స్వచ్ఛ్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని
 స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ప్రారంభించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ పేరుతో ఐదేళ్లపాటు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. ఆరుబయట మలవిసర్జన నిర్మూలించడం, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను నిర్మించడం, సఫాయి కార్మిక వ్యవస్థను అరికట్టడం, పట్టణ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఆరోగ్యకరమైన పారిశుధ్య అలవాట్లకు సంబంధించి, పారిశుధ్యానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమానికి రూ.62,009 కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 14,623 కోట్లను అందజేస్తుంది.
 
 రాష్ట్రీయం
 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభం
 రూ. 2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో దీన్ని ప్రారంభించారు. ఈ సుజల కేంద్రాలలో 46 కేంద్రాలతో తూర్పుగోదావరి తొలిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో 36 కేంద్రాలతో పశ్చిమ గోదావరి ఉంది.
 
 రైతు సాధికారిక సంస్థ ఏర్పాటుకు ఆం.ప్ర. మంత్రి మండలి ఆమోదం
 రైతు రుణ మాఫీతో పాటు ఇతర అంశాల పర్యవేక్షణకు రైతు సాధికారిక సంస్థ (ఫార్మర్ ఎంపవర్‌మెంట్ కార్పోరేషన్) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. అక్టోబర్ 22 నుంచి ఈ సంస్థ పనిచేస్తుంది. రైతు రుణ మాఫీకి సంబంధించి కార్పోరేషన్ ద్వారా తొలి దశలో 20 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని నాలుగేళ్లలో 20 శాతం చొప్పున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనుంది. ఈ కాలానికి రైతులకు హామీ ఇస్తూ 10 శాతం వార్షిక వడ్డీతో రాయితీ సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. డ్వాక్రా రుణమాఫీ అమలుకు కూడా మరో కార్పోరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
 
 తెలంగాణ శకటానికి మొదటి బహుమతి
 మైసూర్‌లో అక్టోబర్ 4న జరిగిన దసరా ఉత్సవాల్లో తెలంగాణ శకటానికి మొదటి బహుమతి లభించింది. ఈ ఉత్సవాల్లో తొలిసారి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించింది. ఇందులో అలంపూర్ జోగులాంబ గుడి, బతుకమ్మతో పాటు వరంగల్‌కు చెందిన పేరిణి నృత్యాలు, కరీంనగర్‌కు చెందిన ఒగ్గుడోలు, డ్రమ్ముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
 
 క్రీడలు
 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఎనిమిదో స్థానం
 ఆసియా క్రీడల్లో చైనా 151 స్వర్ణపతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 79 స్వర్ణాలతో దక్షిణకొరియా రెండో స్థానం, 47తో జపాన్ మూడో స్థానం సాధించాయి. 11 బంగారు పతకాలతో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో సెప్టెంబర్ 17న ఆరంభమైన 17వ ఆసియా క్రీడలు అక్టోబర్ 4న ముగిసాయి. నాలుగు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన జపాన్ స్విమ్మర్ కొనుగో హగినో అత్యంత విలువైన ఆటగాడి అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతాయి.
 
 భారత్ సాధించిన స్వర్ణాలు-వివరాలు:
 షూటింగ్: భారత్ తరపున తొలిస్వర్ణం షూటర్ జీతూరాయ్‌కి లభించింది. ఆర్చరీ: పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్‌వర్మ, రజత్ చౌహాన్, సందీప్ కుమార్‌ల జట్టు కొరియాను ఓడించింది. స్క్వాష్: పురుషుల జట్టు మలేసియాపై గెలిచింది. రెజ్లింగ్: పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లర్ యోగేశ్వర్‌దత్ సాధించాడు. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ (కుస్తీ)లో స్వర్ణం లభించింది. 1986లో సియోల్ క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణాన్ని గెలిచాడు.  డిస్కస్‌త్రో: మహిళల విభాగంలో సీమా పూనియా విజేత. అథ్లెటిక్స్‌లో ఇది తొలి స్వర్ణం. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్: సానియామీర్జా, సాకేత్ మైనేనిల జోడి.
 
 సెయిలింగ్: ఆసియా క్రీడల్లో మహిళలు తొలిసారి సెయిలింగ్‌లో పతకం సాధించారు. బాక్సింగ్: విజేత మేరీకోమ్. కజకిస్థాన్‌కు చెందిన జైనా షెకెర్బెకోవాను ఓడించింది. హాకీ: ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో 2016 రియో డిజెనిరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారత్ అర్హత సాధించింది. చివరిగా 1998లో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం గెలిచింది.రిలే పరుగు: మహిళల 4,400 మీటర్ల పరుగులో పూవమ్మ, టింటూ లుకా, మన్‌దీప్ కౌర్, ప్రియాంక పన్వర్‌ల బృందం స్వర్ణం గెలిచింది.కబడ్డీ: పురుషుల,మహిళల విభాగాల్లో రెండు స్వర్ణాలు దక్కాయి. పురుషుల జట్టుకిది వరుసగా ఏడో విజయం కాగా మహిళల జట్టుకు రెండో వరుస విజయం.
 
 పతకాల పట్టిక:
 దేశం    స్వర్ణం    రజతం    కాంస్యం    మొత్తం
 చైనా    151    108    83    342
 దక్షిణకొరియా    79    71    84    234
 జపాన్    47    76    77    200
 భారత్    11    10    36    57

 చైనా ఓపెన్ విజేతలు షరపోవా, జొకొవిచ్
 చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో జొకొవిచ్, మహిళల సింగిల్స్‌లో షరపోవా గెలుపొందారు. ఫైనల్లో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను షరపోవా ఓడించింది. చైనా గడ్డపై తొలిసారి ఓ టోర్నీలో విజేతగా నిలవడం ఆమెకిది తొలిసారి. నొవాక్ జొకొవిచ్ వరుసగా ఐదోసారి చైనా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
 
 హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రి టైటిల్
 జపాన్‌లో జరిగిన ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు.
 
 నిషికోరికి జపాన్ ఓపెన్ టైటిల్
 జ పాన్ టెన్నిస్ స్టార్ కీ నిషికోరి జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 5న జరిగిన ఫైనల్‌లో మిలోస్ రావ్‌నిక్(కెనడా)ను ఓడించాడు.
 
 చెన్నై సూపర్ కింగ్స్‌దే చాంపియన్స్‌లీగ్ టైటిల్
 చాంపియన్స్ లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. అక్టోబర్ 4న జరిగిన ఫైనల్లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. 2010లో కూడా ఈ టైటిల్‌ను చెన్నై జట్టు గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా సురేశ్‌రైనా ఎంపికయ్యాడు.
 
  అంతర్జాతీయం  2050 నాటికి
 సౌర విద్యుత్తు ప్రధాన విద్యుత్ వనరు  సౌరవిద్యుత్ 2050 నాటికి ప్రధాన విద్యుత్ వనరు కానున్నదని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ) సెప్టెంబర్ 29న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. సోలార్ ఫోటో వోల్టాయిక్ వ్యవస్థల ద్వారా 2050 నాటికి మొత్తం ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 16 శాతం ఉత్పత్తి కాగలదని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ఇంధన సామర్థ్యంలో సౌర విద్యుత్ 1 శాతం కంటే తక్కువ. సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనాది మొదటి స్థానం. అమెరికా రెండో స్థానంలో ఉంది.
 
 ఉప్పు వినియోగాన్ని తగ్గించాలన్న
 ప్రపంచ ఆరోగ్య సంస్థ  హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలను తగ్గించేందుకు ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వరల్డ్‌హార్ట్ డే (సెప్టెంబర్ 29) సందర్భంగా కోరింది. 2025 నాటికి ఉప్పు వాడకాన్ని 30 శాతం తగ్గిస్తే మిలియన్ల సంఖ్యలో గుండెపోటు మరణాలను అరికట్టవచ్చని తెలిపింది.
 
 మోదీ-ఒబామా మధ్య శిఖరాగ్ర చర్చలు
 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అమెరికా పర్యటనలో సెప్టెంబర్ 30న వాషింగ్టన్‌లో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉగ్రవాదంపై పోరులో రాజీలేకుండా వ్యవహరించాలని తీర్మానించారు. పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాద మూకలు లష్కరే తొయిబా, అల్‌ఖైదా, హఖ్ఖానీ నెట్‌వర్క్‌లను నిర్మూలించేందుకు నిర్ణయించారు. ఆర్థిక రంగంలో సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు,దక్షిణాసియాలో ఉగ్రవాదం, పశ్చిమాసియా సమస్య వంటి పలు అంశాలపై వారు చర్చలు జరిపారు. పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు ఒబామా తెలిపారు. రక్షణ రంగంలో సహకారాన్ని మరో పదేళ్లు పొడిగించేందుకు రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. విశాఖపట్టణం, అలహాబాద్, అజ్మీర్‌లను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దేందుకు అమెరికా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు.
 
 డాంగ్ ఫెంగ్ క్షిపణిని పరీక్షించిన చైనా
 అణ్వస్త్ర సామర్థ్యం గల డాంగ్ ఫెంగ్ -31 బి అనే క్షిపణిని సెప్టెంబర్ 25న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వుఝూయ్ కేంద్రంలో పరీక్షించింది. ఇది 10వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి అమెరికా, ఐరోపాల్లోని పలు నగరాలను తాకగలదు.
 
 వార్తల్లో వ్యక్తులు
 నాటో సెక్రటరీ జనరల్‌గా స్టోలెన్‌బర్గ్  నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)సెక్రటరీ జనరల్ గా జెన్స్ స్టోలెన్‌బర్గ్(55) అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టా రు. ఈయన నార్వే మాజీప్రధాని. అండర్స్ ఫాగ్ రాస్ ముస్సేన్ స్థానంలో స్టోలెన్‌బర్గ్ బాద్యతలు చేపట్టారు. 65 ఏళ్ల నాటోకు ఆయన 13వ సెక్రటరీ జనరల్. నాటో కూటమిలో ఉత్తర అమెరికా, ఐరోపాలకు చెందిన 28 దేశాలు ఉన్నాయి.
 
 కిలిమంజారోను అధిరోహించిన విశాఖ బాలిక
 విశాఖ జిల్లా వడ్డాది గ్రామానికి చెందిన జాహ్నవి అనే పన్నెండేళ్ల బాలిక ఆఫ్రికాలో అత్యంత ఎత్తై పర్వత శిఖరం కిలిమంజారోను అక్టోబరు 2న అధిరోహించింది. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని ఎక్కిన భారతీయుల్లో అత్యంత పిన్నవయస్కురాలిగా ఆమె అరుదైన ఘనత సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement