యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై ప్రారంభం
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై ప్రారంభం
Published Thu, Nov 24 2016 4:44 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
గోవాలో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) గోవాలో నవంబర్ 20న ప్రారంభమైంది. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 88 దేశాలకు చెందిన 194 చిత్రాలు: గోవాలో న వంబర్ 20న ప్రారంభమైన ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకు జరుగుతుంది. ఇందులో 88 దేశాలకు చెందిన 194 చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత చిత్రం ఆఫ్టర్ ఇమేజ్ ప్రదర్శనతో చిత్రోత్సవం ప్రారంభమైంది.
పురస్కారాలు ప్రదానం: ఈ వేడుకలో దక్షిణ కొరియా దిగ్గజ దర్శకుడు ఇమ్ క్వొన్ టిక్‌కు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శత వసంత భారతీయ చలన చిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు రుయ్‌వెన్ రివ్లిన్ భారత్ పర్యటనఇజ్రాయెల్ అధ్యక్షుడు రుయ్‌వెన్ రివ్లిన్ నవంబర్ 15న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, నీటి వనరులు, విద్య, పరిశోధనలపై చర్చించారు. రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని, ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు దేశాలు వ్యవసాయం, నీటి నిర్వహణలో సహకారానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కరువు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వినియోగిస్తున్న సూక్ష్మ నీటిపారుదల పరిజ్ఞానాన్ని ప్రధాని కొనియాడారు. ఆ టెక్నాలజీని భారత్‌లోని నీటి నిర్వహణ, పరిరక్షణ, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో వినియోగించడంపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు.
నక్సల్స్‌పై పోరుకు సీఆర్‌పీఎఫ్ మహిళా కమాండోలు
జార్ఖండ్‌లో నక్సల్స్‌పై పోరాడేందుకు తొలిసారిగా మహిళా కమాండోలను సీఆర్‌పీఎఫ్ వినియోగిస్తోంది. 135 మంది మహిళా కమాండోలు రాంచీ సమీపంలోని ఖూంటి ప్రాంతంలో జరుగుతున్న నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
వాయు కాలుష్యంతో భారత్‌లో రోజుకు 3,283 మంది మృతి
వాయు కాలుష్యం వల్ల 2015లో భారత్‌లో రోజుకు 3,283 మంది మరణించినట్లు గ్రీన్ పీస్ సంస్థ నవంబర్ 16న ప్రకటించిన నివేదికలో పేర్కొంది. అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా చైనాను భారత్ అధిగమించినట్టు వెల్లడైంది. చైనాలో రోజుకు 3,233 మంది మరణించారు.
పర్యావరణ మార్పుల పనితీరు సూచీలో భారత్‌కు 20వ ర్యాంకు
పర్యావరణ మార్పుల పనితీరు సూచీ (సీసీపీఐ)లో భారత్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 20వ ర్యాంక్‌కు చేరింది. జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్ యూరప్ సంస్థ ఈ ఏడాది (2016)కి 58 దేశాలకు నవంబర్ 17న ర్యాంకులు ప్రకటించింది. ఇందులో వర్ధమాన దేశాలు.. పారిశ్రామిక దేశాల విధానాలను అనుకరించకుండా సొంత పర్యావరణ హిత మార్గాలను పాటించాలని సూచించింది. ఉద్గారాల విషయంలో భారత్ పనితీరు బాగుందని, పునరుత్పాదక ఇంధన వినియోగంలో మెరుగుపడిందని పేర్కొంది.
సంతోషానికి కేరాఫ్ డెన్మార్క్
ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితాలో 2016కు డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ‘వర్డ్ హ్యాపీనెస్ లెవల్స్’ నవంబర్ 16న విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2015లో మూడో స్థానంలో ఉన్న డెన్మార్క్.. ఈ ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, ఫిన్‌లాండ్‌లు నిలిచాయి. భారత్‌కు ఈ జాబితాలో 118వ స్థానం దక్కింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, వారి ఆరోగ్య ఆయుర్దాయాన్ని, తదితర అంశాల ఆధారంగా 156 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు.
అవినీతి ఆరోపణలపై రష్యా ఆర్థిక మంత్రి అరెస్ట్
రష్యా ఆర్థిక మంత్రి అలెక్సీ ఉల్యుకేవ్‌ను అవినీతి ఆరోపణలపై ఆ దేశ అధికారులు నవంబర్ 13న అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ రాస్నెట్.. మరో కంపెనీ బాష్నెట్‌ను కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చినందుకు రెండు మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఉల్యుకేవ్ దోషిగా తేలితే 15 ఏళ్ల వరకు జైలుశిక్ష పడొచ్చు.
సౌర కూటమి ముసాయిదా ఒప్పందం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించిన అంతర్జాతీయ సౌర కూటమి
(ఐఎస్‌ఐ) ముసాయిదా ఒప్పందంపై 20కి పైగా దేశాలు మారకేష్ (మొరాకో)లో నవంబర్ 15న సంతకాలు చేశాయి. ఇది ఆమోదం పొందితే ఐఎస్‌ఏ ఒక ప్రధాన అంతర్జాతీయ సంస్థగా ఏర్పడుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తెలిపారు. ఐఎస్‌ఐ భారత్ కేంద్రంగా పనిచేస్తుంది.
ఇంటర్నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా పోస్ట్-ట్రూత్
ఇంటర్నేషనల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ‘పోస్ట్-ట్రూత్’ పదాన్ని నవంబర్ 16న ప్రకటించింది. పోస్ట్-ట్రూత్.. ఆల్ట్-రైట్, బ్రెక్సిటీర్ పదాలను అధిగమించి తొలి స్థానంలో నిలిచింది. ఈ పదాన్ని 2015తో పోల్చితే 2016లో ఎక్కువగా వాడారని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తెలిపింది. ప్రజాభిప్రాయ నిర్ణయంలో వాస్తవాల కంటే భావోద్వేగం, వ్యక్తిగత నమ్మకాలే అధికంగా ప్రభావితం చూపడాన్ని పోస్ట్-ట్రూత్‌గా పేర్కొంటున్నారు.
పారిస్ ఒప్పందం అమలుకు తుది గడువు 2018
పర్యావరణ మార్పులపై పోరాటానికి ఉన్నత స్థాయి రాజకీయ నిబద్ధత కావాలని మారకేష్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో 200 దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ సందర్భంగా నవంబర్ 18న 196 దేశాలు, ఐరోపా సమాజం సహా అన్ని పక్షాలు అంగీకారం తెలిపిన మారకేష్ చర్యల ప్రకటనను విడుదల చేశారు. పారిస్ ఒప్పందం అమలుకు సంబంధించిన నిబంధనలకు తుది రూపం ఇచ్చేందుకు 2018ను గడువుగా నిర్ణయించారు. 2015, డిసెంబర్‌లో తీసుకువచ్చిన పారిస్ ఒప్పందం అమలు కోసం ఆచరణాత్మక చర్యల ముసాయిదా రూపకల్పనకు మారకేష్ సదస్సు జరిగింది. పారిస్ ఒప్పందానికి ఇప్పటి వరకు 111 దేశాలు అంగీకారం తెలిపాయి.
అక్టోబర్‌లో తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) 3.39 శాతంగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెల్లోనూ డబ్ల్యూపీఐ తగ్గుముఖం పట్టింది. ఇది సెప్టెంబర్‌లో 3.57 శాతంగా నమోదైంది. కూరగాయలతోపాటు పలు ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది. ఇది 2015, అక్టోబర్‌లో -3.70 శాతంగా నమోదైంది.
రైతు నెలసరి సగటు ఆదాయం రూ.6,426
దేశంలో ఒక వ్యవసాయ కుటుంబానికి నెలకు సగటున రూ.6,426 ఆదాయం వస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ నవంబర్ 18న లోక్‌సభకు తెలిపారు. 2012-13 వ్యవసాయ లెక్కల ప్రకారం ఇది ఏపీలో రూ.5,979, తెలంగాణలో రూ.6,311 ఉన్నట్లు వెల్లడించారు. పంజాబ్‌లోని వ్యవసాయ కుటుంబాలు దేశంలోనే అత్యధికంగా ప్రతి నెలా రూ.18,059 ఆదాయం పొందుతున్నాయి. ఇది పశ్చిమ బెంగాల్‌లో అత్యల్పంగా రూ.3,980 ఉంది. 2012 జూలై నుంచి
2013 జూన్ వరకు నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
యూఏవీ రుస్తుం-2 తొలి పరీక్షలు విజయవంతం: దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ) రుస్తుం-2 (తపస్-201) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పరీక్షలను నవంబర్ 16న కర్నాటకలోని చిత్రదుర్గ వైమానిక పరీక్ష వేదిక (ఏటీఆర్) నుంచి నిర్వహించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తోం మధ్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు. దీన్ని నిఘాకు కూడా వినియోగించవచ్చు.
డీఆర్‌డీవో (బెంగళూరు), హెచ్‌ఏఎల్-బీఈఎల్‌లు సంయుక్తంగా రుస్తోంను అభివృద్ధి చేశాయి. చైనా షెంజావు-11 యాత్ర విజయవంతం సొంత అంతరిక్ష కేంద్రం కోసం చైనా అక్టోబర్ 17న ప్రయోగించిన షెంజావు-11 వ్యోమనౌక నవంబర్ 18న భూమికి చేరుకుంది. చైనా వ్యోమగాములు జింగ్ హయ్‌పెంగ్, చెన్‌డాంగ్‌లను అంతరిక్షానికి తీసుకెళ్లిన ఈ నౌక మంగోలియాలో దిగింది.
చర్మ వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణం
మన దేశంలో మనుషుల చర్మ రంగు వైవిధ్యానికి ప్రత్యేక జన్యువులే కారణమని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో తేలింది. సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ నేతృత్వంలో వేర్వేరు దేశాల్లో ఐదు ఇతర సంస్థలతో కలిసి దీనిపై చేసిన తాజా పరిశోధన పత్రం.. ది జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ ఆన్‌లైన్ ఎడిషన్‌లో ఈ నెల 17న ప్రచురితమైంది. ఆఫ్రికా దేశాల్లో నలుపు, ఐరోపా దేశాల్లో తెల్ల వాళ్లు ఎక్కువగా ఉంటే భారత్‌లో నలుపు, తెలుపు, ఎరుపు ఇలా వేర్వేరు వర్ణాల్లో ఉన్నారు. మన దేశంలో వేర్వేరు చర్మ రంగులు ఉండటానికి ప్రత్యేక జన్యువు ఆర్‌ఎస్2470102 కారణమని పరిశోధకులు తెలిపారు.
విజయవంతమైన పృథ్వీ-2 పరీక్ష: దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి నవంబర్ 21న ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. 500, 1000 కిలోల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్తుంది.
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై ప్రారంభం: కోల్‌కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నైని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 21న ముంబైలో ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ నౌక పొడవు 164 మీటర్లు, బరువు 7,500 టన్నులు. దీనిపై సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8 దీర్ఘ శ్రేణి క్షిపణులను మోహరించొచ్చు.
Advertisement