చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి.. నవోదయం
కట్టా కవిత,
స్కూల్ అసిస్టెంట్
కోదండాపూర్, మహబూబ్‌నగర్.
చిన్నారుల్లో దాగి ఉన్న సహజమైన ప్రతిభను వెలికితీసి వారిని దేశాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినవే జవహర్ నవోదయ విద్యాలయాలు.. 1986 విద్యా విధానం మేరకు అమల్లోకి వచ్చిన ఈ విద్యాలయాలు.. ఆధునికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్న ఈ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ
సెలెక్షన్ టెస్ట్ (జేఎన్‌వీఎస్‌టీ)-2015కు నోటిఫికేషన్ వెలువడింది. వివరాలు..
జవహర్ నవోదయ సెలెక్షన్ టెస్ట్ ద్వారా ప్రతి పాఠశాలలో ఏడాదికి 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బాలికలకు 33.33 శాతం, 3 శాతం శారీరక వికలాంగులకు రిజర్వ్ చేశారు.
పరీక్ష విధానం:
పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి రెండు గంటల సమయం ఉంటుంది. విద్యార్థి దరఖాస్తులో పేర్కొన్న మాధ్యమం ఆధారంగా ప్రశ్నపత్రాన్ని ఇస్తారు.
వివరాలు..
విభాగాల వారీగా ప్రిపరేషన్:
మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో 10 విభాగాలు ఉంటాయి. అవి..ఆడ్ మ్యాన్ అవుట్: ఇందులోని నాలుగు చిత్రాల్లో భిన్నమైన దాన్ని గుర్తించాలి.ఫిగర్ మ్యాచింగ్: ఎడమ వైపు ఒక చిత్రం, కుడి వైపు నాలుగు చిత్రాలు ఇస్తారు. వాటిలో ఏ చిత్రం.. ఎడమ వైపు ఉన్న చిత్రం మాదిరిగా ఉంటుందో గుర్తించాలి.
ప్యాట్రన్ కంప్లిషన్: ఎడమ వైపు ఉన్న చిత్రంలో ఒక భాగం లోపిస్తుంది. ఇచ్చిన నాలుగు ఆప్షన్‌లలో లోపించిన భాగాన్ని కనుక్కోవాలి.
ఫిగర్ సిరీస్ కంప్లిషన్: ఎడమ వైపు ఒకే శ్రేణిలో ఉండే మూడు చిత్రాలు ఇస్తారు. నాలుగో స్థానం ఖాళీ. ఇచ్చిన నాలుగు ఆప్షన్‌లలో ఆ స్థానంలో ఉండే చిత్రాన్ని గుర్తించాలి.
అనాలజీ: ఎడమ వైపు రెండు జతల చిత్రాలు ఉంటాయి. రెండు జత చిత్రాలలో ఒక చిత్రం బదులు కొశ్చన్ మార్కు (?) ఇస్తారు. మొదటి జత చిత్రాల మధ్య ఒక సంబంధం ఉంటుంది. అదేవిధంగా రెండో జతతో సంబంధం ఉన్న చిత్రాన్ని గుర్తించాలి.
జియోమెట్రికల్ ఫిగర్ కంప్లిషన్: ఇందులో ఎడమ వైపున అసంపూర్తిగా ఉన్న చతురస్రం/త్రిభుజం/వృత్తం ఇస్తారు. వీటికి సరిపడ మిగిలిన భాగాన్ని గుర్తించాలి.
మిర్రర్ ఇమేజింగ్: ఎడమ వైపున ఇచ్చిన చిత్రం ఆధారంగా అద్దంలో దాని ప్రతిబింబ చిత్రాన్ని గుర్తించాలి.
పంచడ్ హోల్డ్ ప్యాట్రన్: సమస్య చిత్రాలలో ఒక పేపర్‌ను వివిధ రకాలుగా మడిచి, కత్తిరించిన తర్వాత తెరిస్తే ఏ విధంగా కనిపిస్తుందో, ఆ చిత్రాన్ని ఇచ్చిన నాలుగు సమాధానాల ఆధారంగా గుర్తించాలి.
స్పేస్ విజువలైజేషన్: ఎడమ వైపున ఇచ్చిన చిత్రంలో కొన్ని భాగాలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే వచ్చే భాగాన్ని గుర్తించాలి.
ఎంబెడెడ్ ఫిగర్: కుడి వైపున ఇచ్చిన నాలుగు సమాధాన చిత్రాలలో ఎడమవైపున ఇచ్చిన చిత్ర భాగం ఏదో ఒక దానిలో ఉంటుంది. దాన్ని గుర్తించాలి.
అర్థమెటిక్ టెస్ట్: సంఖ్యా వ్యవస్థ, పూర్ణాంకాలపై చతుర్విధ ప్రక్రియలు, భిన్నాలు, నాలుగు చతుర్విధ ప్రక్రియలు, కారణాంకాలు, గుణిజాలు-వాటి ధర్మాలు, సంఖ్యలు, క.సా.గు., గ.సా.భా, దశాంశ భిన్నాలు-చతుర్విధ ప్రక్రియలు, భిన్నాలను దశాంశ భిన్నాలుగా మార్చ టం, దూరమానం, తులామానం, కొలమానం, కాలమానం, ద్రవ్యం, దూరం, కాలం-వేగం, బీజీయ సమాసాలు, సంఖ్యలపై ప్రక్రియలు-సూక్ష్మీకరణ, నిష్పత్తులు, లాభనష్టాలు, బారు వడ్డీ, జ్యామితీయ పటాల చుట్టు కొలత, వైశాల్యం వంటి అంశాల నుంచి 5వ తరగతి స్థాయి ప్రశ్నలు వస్తాయి.
లాంగ్వేజ్ టెస్ట్:
ఇంగ్లిష్ భాష పరిజ్ఞానాన్ని పరీక్షించే విభాగమిది. ఇందులో మూడు కాంప్రెహెన్సివ్ ప్యాసేజ్‌లు ఇస్తారు. ఆంగ్ల వ్యాకరణం నుంచి మిగిలిన ప్రశ్నలు ఇస్తారు. ఇవి 5వ తరగి స్థాయిలో ఉంటాయి.
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి దీనికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్రాక్టీస్‌లో ఎక్కువ సమయం కేటాయించాలి. గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. 5వ తరగతి వరకు ఉన్న మ్యాథ్స్, ఇంగ్లిష్ అకడమిక్, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి.
సదుపాయాలు:
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ 12వ తరగతి వరకు విద్య, వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. కో ఎడ్యుకేషన్ విధానంలో, పూర్తిగా గురుకుల పద్ధతిలో బోధన ఉంటుంది. బాలబాలికలకు వేరు వేరుగా హాస్టల్ వసతి ఉంటుంది. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన చేస్తారు. పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకే షన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌తో రాయాలి.
నోటిఫికేషన్ సమాచారం:
అర్హత: ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
వయసు: 12 ఏళ్లు ( 2002, మే 1 నుంచి 2006, ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి).
దరఖాస్తు: వెబ్‌సైట్ లేదా డీఈఓ లేదా బీఈఓ లేదా నవోదయ విద్యాలయాల నుంచి దరఖాస్తులను పొందొచ్చు. వీటిని పూర్తిచేసి సంబంధిత బ్లాక్ విద్యా శాఖ అధికారి కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014.
రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 7, 2015.
వివరాలకు: http://navodayahyd.gov.in