పోలికలు చెప్పిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? | students fulfilled the goal | Sakshi
Sakshi News home page

పోలికలు చెప్పిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?

Published Sun, Sep 21 2014 11:23 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

students fulfilled the goal

బోధనా లక్ష్యాలు- స్పష్టీకరణాలు

వినియోగం: సమస్యా పరిష్కారంలో అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించడాన్ని వినియోగం అంటారు. జ్ఞానం, అవగాహన తర్వాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనలో వినియోగం అనే లక్ష్యాన్ని సాధించాలి.
 
 వినియోగం స్పష్టీకరణాలు:
 ఎత్తయిన ప్రాంతాలు చల్లగా ఉంటాయా? లేదా? అనే సమస్యను ఇచ్చినపుడు విద్యార్థి ప్రతిస్పందనలో కింది అంశాలను గమనించ వచ్చు.
 1.    సమస్యా పరిష్కారానికి నూతన జ్ఞానం ఎంపిక: ఎత్తయిన ప్రాంతాలు, అక్కడి ఉష్ణోగ్రత మొదలైన అంశాలను వార్తా పత్రికలు, పాఠ్యగ్రంథాల ద్వారా అధ్యయనం చేసి తగిన జ్ఞానాన్ని పొందుతాడు.
 2.    పరికల్పన రూపొందించుకోవడం: పరికల్పన అంటే సమస్యా పరిష్కారంలో తాత్కాలిక పరిష్కార మార్గం.
 3.    పరికల్పన పరీక్షించడం: విద్యార్థులు ఎత్తయిన ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు సేకరించడం.
 4.    దత్తాంశాలను విశ్లేషించడం: విశ్లేషించడం ఒక ఆలోచన ప్రక్రియ. విడివిడిగా పరిశీ లించడమే విశ్లేషణ. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. సమస్యా పరిష్కారంలో ఇదే మొదటిది.
ఉదా: విద్యార్థి తిరుమల, ఊటీ, సిమ్లా డార్జిలింగ్, ముస్సోరి, సింహాచలం కొండలు మొదలైన ఎత్తయిన ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలను విడివిడిగా పరిశీలిస్తారు.
 5.    సంశ్లేషణ: సంశ్లేషణ ఒక ఆలోచన ఫలితం, కలుపుకోవడం. సమస్యా పరిష్కారంలో విశ్లేషణ తర్వాత రెండోది సంశ్లేషణ.
     ఉదా: విద్యార్థి కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటాడు.
 6.    పరస్పర సంబంధాలు స్థాపించడం:
పరస్పర సంబంధాలను గుర్తించడం అనేది అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణం అయితే విద్యార్థి తనంతట తాను పరిశోధన చేసి రెండు భావనల మధ్య సంబంధాలను ఏర్పరిస్తే అది వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ.
ఉదా: విద్యార్థి ఎత్తయిన ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత తక్కువగా ఉండడానికి పరస్పర సంబంధాలను ఏర్పరచడం.
 7.    సాధారణీకరించడం: సాధారణీకరణంలో ఒక అంశం గురించి తుది నిర్ణయానికి వస్తారు. సాధారణీకరణం చేసేటపుడు సమస్యా పరిష్యార మార్గంలో రూపొందించుకున్న పరికల్పన ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ఉదా: ఎత్తయిన ప్రాంతాలు చల్లగా ఉంటాయి.
 
నైపుణ్యం: ఏదైనా ఒక పనిని సమర్థంగా చేయడాన్ని నైపుణ్యం అంటారు. విద్యార్థి సాంఘికశాస్త్ర భావనలను తన చేతితో వేగంగా, స్పష్టంగా, కచ్చితంగా చేయడాన్ని నైపుణ్యంగా చెప్పవచ్చు.ఏదైనా పనిని పలుసార్లు ఆచరించడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.
 
 నైపుణ్యం- స్పష్టీకరణాలు:
 1.    విద్యార్థి చార్టులు, మ్యాపులు గీయడం: ఉదా: వంశ వృక్ష చార్టులు, బడ్జెట్ సంబంధించిన సర్కిల్ గ్రాఫ్, భారతదేశ పటాన్ని గీయడం.
 2.    చార్టులు, గ్రాఫ్‌లు మ్యాప్‌లలో సంబంధిత సమాచారాన్ని గుర్తించడం:
     ఉదా: విద్యార్థి భారతదేశ పటంలో లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా
 నగర్ హవేలి, చండీగఢ్, డామన్ డయ్యూ మొదలైన కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించడం.
 3.    విద్యార్థి నమూనాలను తయారు చేయడం:
     ఉదా:
     సౌరకుటుంబం పాఠం విన్న తర్వాత దాని నమూనాను తయారు చేయడం.
 4.    పరికరాలను ఉపయోగించడం:
     ఉదా:
     విద్యార్థి వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలను ఉపయోగించడం.
 5.    సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారుచేసి విద్యార్థి చక్కగా ప్రదర్శించడం:
     ఉదా: సమాచారాన్ని సేకరించి చిత్రాల రూపంలో విద్యార్థి నివేదించడం.

 మాదిరి ప్రశ్నలు
 
 1.    బ్లూమ్స్ విద్యా లక్ష్యాల విలువల వర్గీకరణలో స్పష్టత, సంతృప్తి లేదని పేర్కొన్నవారు?
     1) క్రాత్‌హోల్    2) ఆర్‌‌నవెల్
     3) జాన్‌సన్    4) డివే
 2.    గాంధీజీ పాఠ్యాంశం విన్న తర్వాత ఆయన త్యాగాన్ని కొనియాడిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) అభిరుచులు    2) వైఖరులు
     3) ప్రశంస    4) వినియోగం
 3.    పత్తి, పొగాకు నగదు పంటలకు ఉదాహరణ అని పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) నైపుణ్యం    4) వైఖరులు
 4.    ప్రపంచశాంతిని పెంపొందించడంలో ఏర్పడిన ఐక్యరాజ్యసమితిని నానాజాతి సమితిలో సరిపోల్చిన విద్యార్థుల్లో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 5.    దేశ ఆదాయ పంపిణీ అసమానత్వాన్ని లారెంజ్ వక్రరేఖ ద్వారా విద్యార్థి గీయ డం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 6.    ‘కృష్ణా, గోదావరి, మహానది, కావేరి మొద లైన నదులను పరిశీలించి ద్వీపకల్ప నదులే ఎక్కువగా బంగాళాఖాతంలో కలుస్తాయి’ అని సామాన్యీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 7.    జాతీయ సమైక్యతకు కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం కారణాలని విశ్లేషించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 8.    కిందివాటిలో వైఖరులు అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణం?
     1)    ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం
     2)    భౌగోళిక, చారిత్రక స్థలాలు సందర్శించడం
     3)    ప్రజల సమస్యలను సానుభూతితో పరిశీలించడం
     4)    దేశభక్తిని కలిగిఉండటం
 9.    భారతదేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగమని వర్గీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 10.    ఆంధ్రప్రదేశ్ పటంలో అటవీ ప్రాంతం ఉన్న జిల్లాలను గుర్తించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 11.    ప్రత్యక్ష, పరోక్ష, ప్రజాస్వామ్యం మధ్య తేడాలేమిటో వివరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 12.    ఉపాధ్యాయుడు సూర్యకుటుంబం అనే పాఠ్యాంశం బోధించిన తర్వాత ‘ఎ’ అనే విద్యార్థి గ్రహానికి, నక్షత్రానికి తేడాను గ్రహించాడు. ‘బి’ అనే విద్యార్థి గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలను విశ్లేషిం చాడు. ‘సి’ అనే విద్యార్థి సమీపంలోని నక్షత్రశాలను సందర్శించాడు. ‘డి’ అనే విద్యార్థి సూర్యకుటుంబం నమూనా తయారు చేశాడు. పై విద్యార్థుల్లో నెరవేరిన లక్ష్యాలు?
     1)    ఎ- జ్ఞానం, బి- అవగాహన,
         సి- వినియోగం, డి-నైపుణ్యం
     2)    ఎ-అవగాహన,
         బి-వినియోగం,
         సి- జ్ఞానం డి- నైపుణ్యం    
     3)    ఎ-అవగాహన,
         బి-వినియోగం,
         సి- అభిరుచి, డి-నైపుణ్యం    
     4)    ఎ- వినియోగం,
         బి- అవగాహన,
         సి- అభిరుచి, డి- నైపుణ్యం
 13.    విద్యార్థులను మంచి పౌరులుగా తయారు చేయాలి అనే వాక్యం సూచించే భావన?
     1) విలువ    2) ఆశయం
     3) లక్ష్యం        4) స్పష్టీకరణం
 14.    భారత రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నిస్తే రాజు అనే విద్యార్థి డా. బి.ఆర్. అంబేద్కర్ అని పునఃస్మరణ చేసుకున్నాడు. రాజులో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 15.    జైన, బౌద్ధ మతాల మధ్య పోలికలు చెప్పిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 16.    పాఠశాలలో కురిసిన వర్షాన్ని కొలవడానికి రాహుల్ అనే విద్యార్థి వర్షమాపకం (రెయిన్ గేజ్) ఉపయోగించాడు. రాహుల్ లో నెరవేరిన లక్ష్యం?
     1) వినియోగం    2) జ్ఞానం
     3) అవగాహన    4) నైపుణ్యం
 17.    భారత దేశం ఉపఖండం అనడానికి కార ణాలు విశ్లేషించి, సంశ్లేషించి సాధారణీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) వినియోగం    2) జ్ఞానం
     3) అవగాహన    4) నైపుణ్యం
 18.    ఆదాయం, పొదుపుల మధ్య సంబంధం గుర్తించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం    2) అవగాహన
     3) వినియోగం    4) వైఖరులు
 19.    వీటిలో జ్ఞానం లక్ష్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడని ప్రశ్న?
     1)    భాటకం అంటే    ఏమిటి?
     2)    అపహేళి అంటే ఏమిటి?
     3)    చెక్, డ్రాఫ్ట్‌ల మధ్య వ్యత్యాసాన్ని వివరించండి?
     4)    విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది?
 20.    సహజ ఉద్భిజ సంపద అనే పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా సాధించే మౌలికాంశం?
     1)    శాస్త్రీయ దృక్పథం
     2)    పరిసరాల రక్షణ
     3)    భారతీయ సంస్కృతి, సంప్రదాయ పరంపర
     4)    జాతీయ భావనా వికాసం
 21.    భారతదేశం- మతసహనం పాఠ్యాంశం ద్వారా ఏ మౌలికాంశాన్ని సాధించొచ్చు?
     1)    రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలు
     2)    సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
     3)    జాతీయ భావనా వికాసం
     4)    భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర
 22.    మానవజాతి అభివృద్ధిపై వివిధ సంస్కృ తుల ప్రభావాన్ని అవగాహన చేసుకో వడం ఏ శాస్త్రం బోధనాశయం?
     1) భూగోళం    2) చరిత్ర
     3) పౌరశాస్త్రం    4) అర్థశాస్త్రం
 23.    భావి జీవన మార్గాన్ని నిర్ణయించుకోవడం ఏ శాస్త్ర బోధనాశయం?
     1) పౌరశాస్త్రం    2) అర్థశాస్త్రం
     3) చరిత్ర    4) భూగోళశాస్త్రం
 24.    భారతదేశ ఎగుమతులు-దిగుమతులు పాఠ్యాంశం ద్వారా సాధించే ఆశయం?
     1) అంతర్జాతీయ అవగాహన
     2) సామాజిక అర్హతను ఏర్పర్చడం
     3) ప్రజాస్వామ్య పౌరసత్వ నిర్మాణం
     4) నాది అనే భావన కలిగించడం
 25.    విద్యా విధానం, విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నపుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును ఏమంటారు?
     1) ఆశయం    2) లక్ష్యం
     3) స్పష్టీకరణం    4) విలువ
 26.    ధర-డిమాండ్‌ల సంబంధమేమిటి? అనే ప్రశ్నలో పరిశీలించదలచుకున్న లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం     4) నైపుణ్యం
 27.    విద్యుచ్ఛక్తి ఉపయోగాలు విశ్లేషించండి? అనే ప్రశ్నతో ఏ లక్ష్యాన్ని పరిశీలించవచ్చు?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 28.    అభిరుచి ఒక?
     1) ఆశయం    
     2) జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం
     3) లక్ష్యం        4) స్పష్టీకరణం
 29.    ప్రపంచశాంతి- భారతదేశ పాత్ర అనే పాఠ్యాంశం ద్వారా ఉపాధ్యాయుడు ఏ ఆశయాన్ని సాధించవచ్చు?
     1) నాది అనే భావన కలిగించడం
     2) అంతర్జాతీయ అవగాహన
     3) ప్రజాస్వామ్య పౌరసత్వ నిర్మాణం
     4) సాంస్కృతిక వారసత్వ అభినందన
 30.    పరస్పర సంబంధాలను స్థాపించడం అనేది?
     1)    భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం
     2)    మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన స్పష్టీకరణం
     3)    జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన స్పష్టీకరణం
     4)    జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం
 31.    దర్శనీయ ప్రదేశాలు అనే పాఠ్యాంశం విన్న తర్వాత రాజు మిత్రులతో కలిసి హైదరాబాద్ సందర్శించాడు. రాజులో నెరవేరిన లక్ష్యం?
     1) వైఖరి        2) వినియోగం
     3) అభిరుచి    4) అవగాహన
 32.    నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి ఏవి?
     1) ఆశయం-లక్ష్యం    2) లక్ష్యం-విలువ
     3) లక్ష్యం- స్పష్టీకరణ
     4) ఆశయం- స్పష్టీకరణం
 33.    ఉపన్యాస పద్ధతి ద్వారా ఎక్కువగా తరగతి గదిలో సాధించలేని లక్ష్యం?
     1) జ్ఞానం    2) నైపుణ్యం
     3) వినియోగం    
     4) అవగాహన
 
 సమాధానాలు
     1) 2    2) 3    3) 2    4) 2    5) 4    6) 3    7) 3    8) 2    9) 2    10) 4    11) 2    12) 3    13) 2    14) 1    15) 2    16) 4    17) 1    18) 2    19) 3    20) 2    21) 3    22) 2    23) 2    24) 1    25) 2    26) 2    27) 3    28) 3    29) 2    30) 3    31) 3    32) 3    33) 2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement