జంతుశాస్త్రం
మానవ శరీర నిర్మాణ శాస్త్రం - శరీర ధర్మశాస్త్రం-1
జీర్ణక్రియ, శోషణం, శ్వాసించడం, వాయువుల వినిమయం
సిలబస్-పరిచయం:
* ఇంటర్ ద్వితీయ సంవత్సరం జంతుశాస్త్ర పాఠ్య ప్రణాళికలో మొత్తం 8 యూనిట్లు ఉన్నాయి. వాటిలో 5 మానవుడి శరీర నిర్మాణ వ్యవస్థలకు సంబంధించినవే. అంటే ఇంటర్ వార్షిక పరీక్షలకు, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకు ఈ యూనిట్లు ఎంతో కీలక మని పేర్కొనవచ్చు.
* ఈ యూనిట్‌లో జీర్ణక్రియ, శోషణం, శ్వాసించడం, వాయువుల వినిమయం వంటి పాఠ్యాంశాలు ఉన్నాయి.
* వైద్యవృత్తిలో చేరాలని ఆకాంక్షించేవారు... పై అంశాలపై ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
సన్నద్ధతా ప్రణాళిక:
* ఈ యూనిట్‌లోని రెండు వ్యవస్థలు మానవుడికి సంబంధించి కీలకమైనవి కాబట్టి విద్యార్థులు వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
* ఈ వ్యవస్థలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం గురించి తెలుసుకొని సన్నద్ధం కావాలి.
* పటాలను పెన్సిల్‌తోనే గీయాలి.
* ఈ వ్యవస్థల గురించి విద్యార్థులు కచ్చితమైన ప్రణాళికతో సన్నద్ధం అయితే ఎంబీబీఎస్‌లో వారికి ఎంతో ఉపయుక్తం అవుతుంది.
* అకాడమీ పాఠ్య పుస్తకంలో ప్రతి పాఠ్యాంశం చివర పారిభాషిక పదకోశాన్ని ఇచ్చారు. దీనిలో వివిధ ముఖ్యమైన పదాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. దీన్ని విద్యార్థులు కచ్చితంగా అధ్యయనం చేయాలి. దీనివల్ల పాఠ్యాంశంపై స్పష్టమైన అవగాహన వస్తుంది.
* ఇలాంటి అధ్యయన విధానం వల్ల విద్యార్థులు... అకడమిక్ పరీక్షలతో పాటు జాతీయస్థాయి పోటీపరీక్షల్లో మంచి ప్రతిభ ప్రదర్శించగలరు.
* ఇంటర్ వార్షిక పరీక్షలకు సమయపాలన పాటిస్తూ అభ్యాసం చేయాలి.
* పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు విశ్లేషణా సామర్థ్యాన్ని అలవర్చుకోవాలి.
* కేవలం పాఠ్యాంశాలను నేర్చుకోవడం వరకే పరిమితం కాకుండా నేర్చుకొన్న విషయాన్ని సాధన చేయాలి. మాదిరి ప్రశ్నల నిధిని విరివిగా అభ్యాసం చేస్తే పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
* అకాడమీ పుస్తకంలో ప్రతి పాఠ్యాంశంలో ఇచ్చిన అన్ని వివరణలను విశ్లేషణాత్మకంగా చదవడం ప్రయోజనకరం.
ఇంటర్ వార్షిక పరీక్షలకు:
* ఈ యూనిట్ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలో 8 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో సాధారణంగా 2 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు, 1 స్వల్ప సమాధాన ప్రశ్న ఉంటాయి.
* అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను అభ్యసనం చేసేటప్పుడు విద్యార్థులు నిశితంగా పరిశీలించి నేర్చుకోవాలి. దీనివల్ల ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది.
* స్వల్ప సమాధాన ప్రశ్నల అభ్యసనంలో శరీర భాగాలను గుర్తించిన పటాలను నిశితంగా అధ్యయనం చేయాలి.
అధ్యయనంలో గమనించాల్సిన అంశాలు:
ఆహార నాళం:
* తాలువు భాగాలు, దాని ప్రాముఖ్యత
* గర్తదంతి, ద్వివార దంత విన్యాసం, విషమ దంత విన్యాసం.
* ప్రౌఢ మానవుడిలో దంత విన్యాసం.
* పాల దంత విన్యాసం
* దంతంలోని మూడుభాగాలు కిరీటం, గ్రీవం, మూలం.
* డెంటిన్‌ను మధ్యస్త్వచం నుంచి ఏర్పడే దంతోద్పాదక కణాలు స్రవిస్తాయి.
* అతి దృఢ పదార్థమైన పింగాణి పొరను బహిస్త్వచం నుంచి ఏర్పడే ఎమిలోబ్లాస్టులు స్రవిస్తాయి.
* దంతం నిలువుకోత పటం.
* నాలికపై ఉండే రుచి గుళికలతో కూడిన సూక్ష్మాంకురాల రకాలు.
* గ్రసనిలోని భాగాలు, గవదబిళ్లల రకాలు.
* కంఠబిలం, ఉపజిహ్వికల ప్రాముఖ్యత.
* జీర్ణాశయంలోని భాగాలు హార్థిక భాగం, ఫండిక్ భాగం, పర జఠర నిర్గమ భాగం.
* చిన్నపేగులోని మూడు భాగాలు... ఆంత్రమూలం, జెజునం, శేషాంత్రికం.
* పెద్ద పేగులో అంధనాళం, కొలాన్, పురీషనాళం ఉంటాయి.
* కిమిరూప ఉండూకాన్ని ఉదర గవదబిళ్ల అంటారు.
* కొలాన్‌లోని 4 భాగాలు... ఆరోహ, అడ్డు, అవరోహ, సిగ్మాయిడ్.
* కొలాన్‌పై హాస్ట్రా అనే కోష్టకాలుంటాయి.
* పాయు కాలువ, పాయువు ద్వారా వెలుపలికి తెరచుకొంటుంది.
సంవరణి అవి ఉండే భాగాలు:
1. జఠర-ఆహార వాహిక (హృదయ)- ఆహా ర వాహిక, జీర్ణాశయం మధ్య ఉంటుంది.
2. జఠర నిర్గమ సంవరణి- జఠర నిర్గమ జీర్ణాశయం, ఆంత్రమూలం మధ్య ఉంటుంది.
3. ఒడ్డిసంవరణి - ఐక్య కాలేయ క్లోమనాళం ఆంత్రమూలంలోకి తెరచుకొనే ప్రాంతంలో ఉంటుంది.
4. అంతరపాయు సంవరణి - పాయురంధ్రం లోపలివైపు ఉంటుంది.
5. బాహ్యపాయు సంవరణి- పాయు రంధ్రం వెలుపలివైపు ఉంటుంది.
* ఆహారనాళం గోడల్లో ఉండే స్తరాలు (వెలుపలి నుంచి లోపలికి)
సీరోసా, వెలుపలి కండర స్తరం, అథఃశ్లేష్మస్త్తరం, శ్లేష్మస్తరం.
జీర్ణగ్రంథులు:
* లాలాజల గ్రంథులు: మానవుడిలో మూడు జతల లాలాజల గ్రంథులు మాత్రమే ఉంటాయి. అవి పెరోటిడ్, అధోజంభికా, అధోజిహ్వికా గ్రంథులు.
* జీర్ణాశయం గోడలో జఠర గ్రంథులుంటాయి.
* ఆంత్ర గ్రంథులు రెండు రకాలు... బ్రన్నర్ గ్రంథులు, లీబర్‌కున్ పుటికలు.
* కాలేయం అతిపెద్ద గ్రంథి. ఇది పైత్య రసాన్ని స్రవిస్తుంది.
జీర్ణక్రియా విధానం:
* జీర్ణనాళంలోని వివిధ భాగాల్లో జీర్ణక్రియా విధానం నేర్చుకోవడం వల్ల ఇంటర్ పరీక్షలకే కాకుండా, ఎంసెట్, ఇతర జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుంది.
* వివిధ భాగాల్లో పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, నూక్లికామ్లాల జీర్ణక్రియలో కనిపించే వివిధ దశలను రూపాంతరాలను పునశ్చరణ చేయాలి.
* వివిధ ఎంజైములు వాటి చర్యలు, జీర్ణక్రియలోని అంత్య ఉత్పన్నకాల గురించి నేర్చుకోవాలి.
* శోషణ గురించి కూడా శ్రద్ధ పెట్టాలి.
* జఠరాంత్ర హార్మోన్లు, వాటి పాత్ర, జీర్ణవ్యవస్థ అపస్థితులను విశదంగా నేర్చుకోవాలి.
శ్వాసించడం, వాయువుల వినిమయం:
* ఈ పాఠ్యాంశం కూడా అన్ని స్థాయిల పోటీ పరీక్షలకు ముఖ్యమైంది.
* దీనిలో వివిధ జీవుల్లో శ్వాసాంగాలు, మానవుడి శ్వాస వ్యవస్థలో బాహ్య నాసికా రంధ్రాలు, నాసికా కక్ష్యలు, నాసికా గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, నాళికలు ఊపిరితిత్తుల నిర్మాణంపై పట్టు సాధించాలి.
* శ్వాసక్రియా విధానంలో ఉచ్ఛ్వాసం, నిశ్వాసంలో జరిగే కండరాల మార్పులు, ఉదఃకుహరంలో కలిగే మార్పులు వంటి అంశాలను పట్టిక రూపంలో నేర్చుకుంటే సులభంగా గుర్తుంచుకోవచ్చు.
* శ్వాస ఘన పరిమాణాలు, సామర్థ్యాలను విధిగా నేర్చుకోవాలి.
* వాయువుల వినిమయాన్ని నియంత్రించే కారకాలు, పుపుస, దైహిక వాయు మార్పిడి గురించి అవగాహన పెంచుకోవాలి.
* ఈ పాఠ్యాంశంలో వాయువుల రవాణా అతి ముఖ్యమైన అంశం.
* ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్‌ల రవాణా విధానాలు ఆ ప్రక్రియల్లోని వివిధ దశలు, రూపాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
* ఆక్సిజన్ - హీమోగ్లోబిన్ వియోజన రేఖ పటంపై పోటీ పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
* కార్బన్ డై ఆక్సైడ్ రవాణాలో బైకార్బనేటు రూపాలు, క్లోరైడ్ విస్తాపనం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
* నాడీ వ్యవస్థలో ఇతర ప్రాంతాల్లో ఉండే వివిధ గ్రాహకాలు, శ్వాసక్రియా కదలికలపై వాటి ప్రభావం వంటి అంశాలు నేర్చుకోవాలి
* శ్వాసక్రియ అపస్థితులు, రుగ్మతల గురించి కూడా నేర్చుకోవాలి.