ఎరక్క‘పోయి’.. ఇరుక్కుపోయారు
Published Thu, Apr 3 2014 4:06 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
సాక్షి, ఏలూరు :‘ఎరక్కపోయి వచ్చాం.. ఇరుక్కుపోయాం’ అన్నట్టుంది తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్లిన నాయకుల పరిస్థితి. ‘ఎవరొచ్చినా చేర్చుకుంటాం.. కోరింది ఇస్తాం’ అంటూ ఆశలు కల్పించడంతో క్యూ కట్టిన నాయకులంతా.. ప్యాకేజీల ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలుసుకుని తలలు పట్టుకుంటున్నారు. అన్నీ ఇచ్చిన పార్టీని కాదని టీడీపీలో చేరినందుకు ఇదా ఫలితమని అనుచర గణం వద్ద వాపోతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఇలాంటి రాజకీయూలే చేస్తారని తెలిసినా.. ఆయనను నమ్మడం తమ తప్పేనని మదనపడుతున్నారు. అవకాశవాద రాజకీయాలు, వెన్నుపోటు మంత్రాంగాలను వంట బట్టిం చుకున్న అధినేత ఎత్తుల్ని గ్రహించకుండా ఆ పార్టీలో కొనసాగుతున్న వారు.. కొత్తగా చేరుతున్న వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
జెడ్పీ నుంచి.. ఎమ్మెల్యే సీటు వరకు...
జెడ్పీ చైర్మన్ పీఠం దగ్గర్నుంచి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల వరకూ ప్రతి ఒక్కరికీ హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు అందరినీ ఊరిస్తూ చివరి నిమిషంలో సంతృప్తికర ప్యాకేజీ ముట్టచెప్పిన వారికే సీటు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సీటును ఎప్పటినుంచో ఆశి స్తున్న ముళ్లపూడి బాపిరాజుకు బాబు రిక్త‘హస్తం’ చూపించారు. ఆ స్థానాన్ని ఎరగా వేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మె ల్యే ఈలి నానిలను టీడీపీలో చేర్చుకున్నారు. అదే సందర్భంలో బాపిరాజుకు జెడ్పీ చైర్మన్ గిరీని కట్టబెడతానని బుజ్జగించారు. శాంతించిన ఆయన తాడేపల్లిగూడెం నుంచి జెడ్పీటీసీ పదవికి పోటీచేస్తూ చైర్మన్ తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. అయి తే, చాగల్లు జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీచేస్తున్న అల్లూరి విక్రమాదిత్యకు కూడా బాబు ఇలాంటి హామీయే ఇచ్చారు. దీంతో వీరిద్దరిలో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది వారికే తెలియకుండా పోయింది.
బాబు మాత్రం ‘మనోళ్లని గెలిపించండి.. మీ సంగతి వదిలేయండి. నేను చూసుకుంటా’నంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఎమ్మెల్యే సీట్ల వ్యవహారంలోనూ బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనపైనా ఓ పాచిక విసిరారు. పితాని ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గం సీటును గుబ్బల తమ్మయ్య కట్టబెడతానని గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే సీటును ఆశిస్తూ టీడీపీ పంచన చేరబోతున్న పితానికి ఆ అవకాశం కల్పిస్తారా.. ఒకవేళ ఇస్తే తమ్మయ్య పరి స్థితి ఏంటనే చర్చ ఆచంట నియోజకవర్గంలో విసృ్తత జరుగుతోంది. పితానికి బలమైన హామీ లభించడంతోనే టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారని సమాచారం.
అదేవిధంగా తణుకు నియోజకవర్గం సీటును ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావుకు టీడీపీ గాలమేస్తోంది. ఆయన ఆ గాలానికి పడితే తణుకు సీటు ఆశించడం సహజం. అప్పుడు రాధాకృష్ణ సంగతేంటనేది పార్టీ శ్రేణులకు అవగతం కావ డం లేదు. దెందులూరు నియోజకవర్గం అభ్యర్థి విషయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాను వేరే నియోజకవర్గానికి వెళ్లే ప్రసక్తే లేదని, అంతవరకూ వస్తే పార్టీని వీడిపోతానని బెదిరించడంతో అధినేత పునరాలోచనలో పడ్డారు. భీమవరంలో సీనియర్ నేతలు మెంటే పార్థసారధి, గాది రాజు బాబు టీడీపీ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరూ ఎప్పటినుంచో పార్టీలో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబును చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు.
ఈ ముగ్గురిలో సీటు ఎవరికిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నరసాపురం సీటును ఆశించి పొత్తూరి రామరాజు, సురేష్ కొండేటి, బండారు మాధవనాయుడు, పులపర్తి వెంకటేశ్వరావు, కోటిపల్లి సురేష్ ఆ పార్టీలోకి వెళ్లారు. అయితే ఇటీవల పార్టీ తీర్ధం పుచ్చుకున్న చెరుకువాడ రంగనాథరాజు లేదా పితాని సత్యనారాయణకు ఇక్కడి సీటు కేటాయించే అవకాశాలున్నట్లు పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అదే జరిగితే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇళ్లకే పరిమితంకాక తప్పదు. పాలకొల్లు సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జి), నిమ్మల రామానాయుడులకు ఆశలు కల్పిస్తున్నారు. చివరికి ఎవరికిస్తారో బాబుకే తెలియాలి. చింతలపూడి సీటును డాక్టర్ కర్రా రాజారావు, కొక్కిరిగడ్డ జయరాజుకు ఇస్తామంటున్నారు. కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకు కారుపాటి వివేకానందతో పొగపెడుతున్నారు. గోపాల పురం సీటు మీదంటే మీదేనని ముప్పిడి వెంకటేశ్వరావు, దాలయ్య, పీతల సుజాతలను మభ్యపెడుతున్నారు. చివరకు సీటు దక్కేదెవరికో తెలియని గందరగోళంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.
Advertisement