మెరవని మెగాస్టార్
మెరవని మెగాస్టార్
Published Fri, Apr 25 2014 12:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
జిల్లాలో పేలవంగా చిరంజీవి రోడ్‌షో
ఎక్కడకు వెళ్లినా కానరాని జనస్పందన
నిరాశానిస్పృహల్లో కాంగ్రెస్ శ్రేణులు
సాక్షి, రాజమండ్రి :సీమాంధ్రలో చావుకళ పడ్డ కాంగ్రెస్‌కు పునర్జీవితం ప్రసాదిస్తానంటున్న ఆ పార్టీ ప్రచార సారథి చిరంజీవి జిల్లాలో నిర్వహించిన రోడ్‌షో అత్యంత పేలవంగా సాగింది. ఆయనకు ఎదురేగి స్వాగత సత్కారాలు చేసే వారే కరువయ్యారు. ఆయన ప్రచారరథాన్ని అనుసరించే నేతల జాడే కనిపించలేదు. ఎక్కడికక్క టిక్కెట్లు పొందిన ద్వితీయశ్రేణి నాయకులు పదుల సంఖ్యలో కార్యకర్తలను వెంటబెట్టుకుని చిరంజీవికి స్వాగతం పలికారు. సినీ చరిత్రలో మెగాస్టార్‌గా పేరు పొందిన చిరంజీవికి రాజకీయంగా ఫ్లాప్‌షో తప్పలేదని పలువురు అభిమానులే నిట్టూర్చారు. విశాఖ జిల్లా పర్యటన అనంతరం చిరంజీవి గురువారం ఉదయం తుని నుంచి జిల్లా పర్యటన ప్రారంభించారు. తునిలో పార్టీ అభ్యర్థి పాండురంగారావు ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం గొల్ల అప్పారావు సెంటర్‌కు చేరుకుని ప్రసంగించారు.
ఆ సమయంలో కనీసం వందల సంఖ్యలో కూడా జనం లేకపోవడం జిల్లాలో చిరు షో ఆరంభాన్నే పేలవంగా మార్చేసింది. అక్కడి నుంచి రామాలయం వీధి, రైల్వేస్టేషన్ మీదుగా అన్నవరం చేరుకుని రోడ్‌షో నిర్వహించారు. బస్సు మీద నుంచే తనను చూస్తున్నవారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు. తొండంగి, ఒంటిమామిడి, కోనపాపపేట, ఉప్పాడల మీదుగా భోజన విరామసమయానికి కాకినాడ చేరుకున్నారు. ఈ ప్రాంతాలన్నింటిలోనూ పదుల సంఖ్యలోనే ప్రజలు చిరంజీవికి తారసపడ్డారు.కాకినాడలోని మానస సరోవర్‌లో భోజనం అనంతరం చిరంజీవి కాకినాడ రూరల్ ప్రాంతాల మీదుగా కోనసీమ బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో జగన్నాథపురం, డ్రైవర్స్ కాలనీ, చొల్లంగి మీదుగా రోడ్‌షో కొనసాగించారు. ప్రతి చోటా జనం పల్చగా హాజరు కావడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. అక్కడి నుంచి యాత్ర తాళ్లరేవు, ఐ.పోలవరం మీదుగా ముమ్మిడివరం చేరుకున్న సమయంలో కనీసం 20 మంది కూడా చిరంజీవికి స్వాగతం పలికేందుకు లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నొచ్చుకున్నారు.
రద్దయిన రాజమండ్రి సభ
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అమలాపురం చేరుకున్న చిరంజీవి ముందుగా లక్ష్మీ థియేటర్ సెంటర్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్ చేరుకున్నారు. పల్చగా హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తామని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి రాజమండ్రిలో జరిగే సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. అయితే సమయం మించిపోవడంతో అక్కడ జరగాల్సిన సభను రద్దు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ చిరు పర్యటన కలిసి వస్తుందని ఆశ పడ్డ కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు.. తీరా ఫ్లాప్‌షోగా మారడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. చిరు వెంట కేంద్ర మంత్రి, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, రాజమండ్రి, అమలాపురం ఎంపీ అభ్యర్థులు కందుల దుర్గేష్, ఎ.బి.వి.బుచ్చి మహేశ్వరరావు ఉన్నారు.
Advertisement
Advertisement