
రాజమండ్రి నుంచి పోటీ చేస్తా: అలీ
వెలుగుబంద (రాజానగరం) : రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి తనను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని అడుగుతున్నారని, అయితే సొంత ప్రాంతమైన రాజమండ్రి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని ప్రముఖ హాస్యనటుడు అలీ అన్నారు. ఏ పార్టీ నుంచి అని ప్రశ్నిస్తే ‘కాట్రవల్లి పార్టీ’ అంటూ తన సహజధోరణిలో చమత్కరించారు.
స్థానిక గైట్ కళాశాలలో మైత్రి యువజనోత్సవాలలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌కి అత్యంత ఆప్తుడైనంత మాత్రాన ఆయన ప్రతి విషయాన్ని తనకు చెప్పాలని లేదని ఒక ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. సినిమాల పరంగా ఆయనంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. జనసేన పార్టీ గురించి తనకు చెప్పలేదు, రమ్మని అనలేదన్నారు. పనిచేసే వారిని యువతరం ఎన్నుకోవాలని సూచించారు.