మోడీ పోస్టర్‌పై తన పోస్టర్ అతికించడానికి యత్నించినందుకు
వడోదర: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్న వడోదర వీధుల్లో గురువారం ‘పోస్టర్ల యుద్ధం’ జరిగింది. మోడీ ఫొటో ఉన్న బోర్డుపై మిస్త్రీ తన చిత్రాన్ని అతికించేందుకు ప్రయత్నించగా, మోడీ పోస్టర్లను మిస్త్రీ అనుచరులు చించేసి అల్లర్లకు దిగారు. దీంతో పోలీసులు మిస్తై, అతని 33 మంది అనుచరులను అరెస్టు చేశారు. రూ. 5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై మేజిస్ట్రేట్ వారిని విడుదల చేశారు. మిస్త్రీ సహా 20 మందిపై అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం నేరాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.
69 ఏళ్ల మిస్తైరోడ్డు డివైడర్‌పైనున్న విద్యుత్ స్తంభాన్ని నిచ్చెన ద్వారా ఎక్కి స్తంభానికి వేలాడుతున్న మోడీ బోర్డుపై తన పోస్టర్‌ను అతికించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నిచ్చెననూ స్వాధీనం చేసుకున్నారు. మిస్త్రీ పోస్టర్ అంటిస్తున్న ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వడోదర మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులను రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ బుక్ చేసుకుని, వాటిని మోడీ చిత్రాలతో నింపేయడంతో గొడవ మొదలైంది. బోర్డుల్లో సగాన్ని తనకు కేటాయించాలని మిస్త్రీ కోరారు. ఈ నేపథ్యంలో మిస్త్రీ అనుచరులు మోడీ పోస్టర్లను చించేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా అధికారులు, పోలీసులు బోర్డులపై తన చిత్రాలు అంటించకుండా అడ్డుకుంటున్నారని మిస్త్రీ ఆరోపించారు.