Madhusudan mistry
-
శశి థరూర్‌కు షాక్.. ‘ఓటింగ్ అక్రమాల’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్ వర్గం ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసుదన్ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే..శశి థరూర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మిస్త్రీ. మీకు రెండు ముఖాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము మీ అభ్యర్థనను స్వీకరించాము. కానీ, మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని తెలియజేసేందుకు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో వేరే ముఖం ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను.’అని శశి థరూర్ తరఫు చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్‌కు సమాధానం పంపించారు మిస్త్రీ. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలుడుతున్న క్రమంలో పోలింగ్ ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ బుధవారం మధుసుదన్ మిస్త్రీకి లేఖ రాశారు థరూర్ పోలింగ్ ఏజెంట్. నాలుగు రకాల ఫిర్యాదులను అందులో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులకు అనధికారిక సీల్స్ వేయటం, పోలింగ్ బూతుల్లో వేరే వ్యక్తులు ఉండటం, ఓటింగ్ జరుగుతున్న క్రమంలో అక్రమాలు, పోలింగ్ షీట్లు లేకపోవటం వంటి అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో శశి థరూర్‌కు 1,072 ఓట్లు రాగా.. మల్లికార్జున్ ఖర్గేకు 7,897 ఏట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! -
ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దేశంలోని వివిధ పోలింగ్ బూత్‌ల నుంచి చేరిన పోస్టల్ బాలెట్ల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లో ఎవరు గెలుస్తారన్నది కాసేపట్లో తేలనుంది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. గాంధీయేతర కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నిక కాబోతుండడం, కాంగ్ సీనియర్లపై అభ్యర్థి శశిథరూర్ అసహనం వ్యక్తం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఓటింగ్‌పై శశిథరూర్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్ వేళ ఆరోపణలకు దిగారాయన. ఉత్తర ప్రదేశ్ ఓట్లను రద్దు చేయాలని కోరారు ఆయన. ఇక ఓటింగ్ అవకతవకలతో పాటు కొన్ని అంశాలపై ఎన్నికల అధికారి మధుసుధన్ మిస్త్రీని కలిసినట్లు, తమ వర్గం తరపున లేఖ అందించినట్లు థరూర్ ఎలక్షన్ ఏజెంట్ సల్మాన్ సోజ్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, మల్లికార్జున ఖర్గేకు తెలియకుండా అది జరిగి ఉంటుందని, ఒకవేళ తెలిస్తే ఆయన సైతం ఆ అక్రమాలను సహించబోరని థరూర్ టీం లేఖలో పేర్కొంది. పోలింగ్‌తో సంబంధం లేని వాళ్ల సమక్షంలో బాలెట్ బాక్సులు ఉండడంపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది థరూర్ బృందం. ► అయితే ఓటింగ్ ప్రశాంతంగానే జరిగిందని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించామని మధుసుదన్ మిస్త్రీ చెప్తున్నారు. మరో సీనియర్ సభ్యుడు జైరామ్ రమేశ్ సైతం ఎన్నికలు పారదర్శకంగానే జరిగినట్లు చెప్తున్నారు. ► మొత్తం పోలైన 9,915 ఓట్లలో అధికంగా.. సగానికి(50 శాతం) పైగా ఓట్లు ఎవరికి పోలైతే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో మెజార్టీ తేలగానే కౌంటింగ్‌ను ఇక ఆపేస్తుంది కూడా. ► మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ ‘అధ్యక్ష ఎన్నిక’.. పార్టీలో అంతర్గత పోరును బయటపెట్టింది. పంజాబ్, కేరళ, యూపీ, మహారాష్ట్ర.. ఇలా చాలా చోట్ల కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చును రాజేసింది. సీనియర్లు సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం గమనార్హం. ► అయితే ఎవరు గెలిచినా.. రిమోట్ కంట్రోల్ సోనియాగాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటుందన్న విమర్శలను పార్టీ ఖండిస్తోంది. సమర్థులైన ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ► ఇక శశిథరూర్ అసహనం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు, పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్లతో సహా పీసీసీ చీఫ్‌లు సైతం మల్లికార్జున ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. ► థరూర్ నామినేషన్‌ను ప్రతిపాదించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం థరూర్ నినాదం ‘గుణాత్మక మార్పు’ ప్రచారం గురించి తప్పుడు సమాచారం కార్యకర్తల్లోకి వెళ్లిందని, అయినా ఆశాజనక ఓట్లు దక్కవచ్చని పేర్కొన్నారు. ► 2014తో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. 2019 ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగుతూ వస్తున్నారు. ► పోటీలో శశిథరూర్ ప్రథమంగా బరిలో నిలవగా.. ఆయనకు ప్రత్యర్థిగా పలువురు అభ్యర్థులు పేర్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బరిలో నిలవొచ్చని అంతా అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయంలో చిచ్చు పెట్టగా.. అధిష్టాన జోక్యంతో చల్లారింది. చివరికి.. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నిలిచారు. ► స్వాతంత్రం అనంతరం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా గాంధీ కుటుంబం నుంచే ఎవరో ఒకరు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆరుసార్లు మాత్రమే ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థి నిలబడడంతో ఎన్నిక నిర్వహించారు. ఆ సమయాల్లోనూ అధిష్టాన మద్దతుతోనే అధ్యక్ష ఎన్నిక సజావుగా పూర్తైంది. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక.. అందునా గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కాబోతుండడం, తటస్థంగా ఉన్నట్లు అధిష్టానం ప్రకటించుకోవడం గమనార్హం. -
Congress president polls: ఇక ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ద్విముఖ పోరు తప్పదని తేలిపోయింది. మూడో అభ్యర్థి, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో చివరకు బరిలో ఇద్దరే మిగిలారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పరస్పరం పోటీ పడబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నామినేషన్లను పరిశీలించామని, మొత్తం 20 పత్రాలు వచ్చాయని, సంతకాలు రిపీట్ కావడం, సరిపోలకపోవడం వంటి కారణాలతో 4 పత్రాలను తిరస్కరించామని చెప్పారు. నామినేషన్లలో భాగంగా ఖర్గే 14 పత్రాలు, థరూర్ 5 పత్రాలు, త్రిపాఠి ఒక పత్రం సమర్పించారు. త్రిపాఠి నామినేషన్‌ను తిరస్కరించామని, ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఒకరి సంతకం సరిపోలలేదని, మరొకరి సంతకం రిపీట్ అయ్యిందని తెలిపారు. పోటీలో ఖర్గే, థరూర్ మిగిలారని మిస్త్రీ వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు మరో వారం రోజులు గడువు ఉందని, అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులపై ఈ నెల 8న పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన మరో మూడు పత్రాలు ఎవరు సమర్పించారన్న సంగతి మిస్త్రీ బయటపెట్టలేదు. ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధనకు కట్టుబడి ప్రతిపక్ష నేత పోస్టు నుంచి తప్పుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను శుక్రవారం రాత్రి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఖర్గే రాజీనామాతో ఖాళీ అయిన పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, ప్రమోద్ తివారీ పోటీ పడుతున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబం తటస్థమే: థరూర్ నాగ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం తటస్థంగా వ్యవహరిస్తుందని శశి థరూర్ తెలిపారు. ఈ ఎన్నికలో అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ లేరంటూ గాంధీ కుటుంబం తనతో చెప్పిందని అన్నారు. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్న థరూర్ శనివారం ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని దీక్షాభూమి స్మారకం చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాను కలిశానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరగాలని, పార్టీ బలోపేతం కావాలని వారు కోరుకుంటున్నారని వివరించారు. గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని, పార్టీ యంత్రాంగం మొత్తం పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించాలని విన్నవించారు. గాంధీ కుటుంబం మల్లికార్జున ఖర్గే పట్ల మొగ్గుచూపుతోందా? అని ప్రశ్నించగా.. అలాంటి అనుమానాలు తనకు లేవని థరూర్ బదులిచ్చారు. -
కాంగ్రెస్ ఎన్నికలు: ఆయన నామినేషన్ తిరస్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ పరిశీలన కూడా పూర్తైంది. అయితే అందులో నుంచి ఓ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి(45) నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల సెట్ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్ వెల్లడించారు. దీంతో బరిలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత శశిథరూర్‌లు నిలిచారు. కేఎన్ త్రిపాఠి.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. జార్ఖండ్ మాజీ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(సొంత వర్గం)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పని చేసిన త్రిపాఠి.. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచాడీయన. కోషియారా గ్రామంలో బీజేపీ అభ్యర్థి మద్దతుదారులు ఆయన్ని చుట్టుముట్టగా.. తుపాకీతో కాల్పులకు దిగాడు. అయితే ఆ పరిణామం ఆయనకేం సహకరించకపోగా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. మావో ప్రభావిత పాలము జిల్లాకు చెందిన త్రిపాఠి.. లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్నారు. ప్రాణహని నేపథ్యంతో ఎన్నికల టైంలోనూ ఆయన ఆ తుపాకీని అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. ఇదిలా ఉంటే.. 2009లో దాల్టోన్‌గంజ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన. అదృష్టవశాత్తూ 2014లో త్రిపాఠికి మంత్రి బెర్త్ దక్కింది. దీంతో రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్, లేబర్ మినిస్టర్‌గా పని చేశారు. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. తాను రైతు బిడ్డను మాత్రమే కానని, సోనియాకు కూడా కొడుకు లాంటి వాడినేనంటూ ఉపన్యాసం దంచాడు. అందుకే పార్టీ టాప్ పోస్ట్‌కు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు హైకమాండ్ ఏం చెబితే.. అది పాటిస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. అయితే ఆయన నామినేషన్ వేసి వచ్చిన కాసేపటికే పార్టీలో చర్చ నడిచింది. త్రిపాఠి బరిలో నిలవాంటే.. నాలుగు రాష్ట్రాల నుంచి కనీసం పది మంది ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ చివరి వరకు ఉంటుందా? అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే.. ఆయన నామినేషన్ చివరకు తిరస్కరణకు గురైంది. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, ఆ తేదీ నాటికి ఒక ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ఓ స్పష్టత వస్తుందని మధుసుదన్ మిస్ట్రీ తెలిపారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. 19వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. -
కాంగ్రెస్ చీఫ్ ఎన్నికకు 3–4 రోజుల్లో షెడ్యూల్!
న్యూఢిల్లీ/జైపూర్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేతను ఎన్నికొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ మరో 3–4 రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు సోమవారం తెలిపాయి. సెప్టెంబర్ 20లోగా నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఎన్నిక తేదీపై తుది నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని(సీడబ్ల్యూసీ) వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్ గాంధీకి అశోక్ గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు. ఆనంద్ శర్మను బుజ్జగించే యత్నాల్లో కాంగ్రెస్ హిమాచల్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జి రాజీవ్ శుక్లా సోమవారం ఆయన్ను కలిసి, పార్టీ పదవిలో కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా శర్మతో ఫోన్లో మాట్లాడి, అనేక అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. -
మోడీ ప్రత్యర్థి మిస్త్రీ అరెస్ట్, విడుదల
మోడీ పోస్టర్‌పై తన పోస్టర్ అతికించడానికి యత్నించినందుకు వడోదర: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్న వడోదర వీధుల్లో గురువారం ‘పోస్టర్ల యుద్ధం’ జరిగింది. మోడీ ఫొటో ఉన్న బోర్డుపై మిస్త్రీ తన చిత్రాన్ని అతికించేందుకు ప్రయత్నించగా, మోడీ పోస్టర్లను మిస్త్రీ అనుచరులు చించేసి అల్లర్లకు దిగారు. దీంతో పోలీసులు మిస్తై, అతని 33 మంది అనుచరులను అరెస్టు చేశారు. రూ. 5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై మేజిస్ట్రేట్ వారిని విడుదల చేశారు. మిస్త్రీ సహా 20 మందిపై అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం నేరాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. 69 ఏళ్ల మిస్తైరోడ్డు డివైడర్‌పైనున్న విద్యుత్ స్తంభాన్ని నిచ్చెన ద్వారా ఎక్కి స్తంభానికి వేలాడుతున్న మోడీ బోర్డుపై తన పోస్టర్‌ను అతికించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నిచ్చెననూ స్వాధీనం చేసుకున్నారు. మిస్త్రీ పోస్టర్ అంటిస్తున్న ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వడోదర మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులను రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ బుక్ చేసుకుని, వాటిని మోడీ చిత్రాలతో నింపేయడంతో గొడవ మొదలైంది. బోర్డుల్లో సగాన్ని తనకు కేటాయించాలని మిస్త్రీ కోరారు. ఈ నేపథ్యంలో మిస్త్రీ అనుచరులు మోడీ పోస్టర్లను చించేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా అధికారులు, పోలీసులు బోర్డులపై తన చిత్రాలు అంటించకుండా అడ్డుకుంటున్నారని మిస్త్రీ ఆరోపించారు. -
వడోదరలో మోడీతో మిస్త్రీ ఢీ
12 మందితో కాంగ్రెస్ ఏడో జాబితా నాందేడ్ నుంచి అశోక్ చవాన్ గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అందరూ ఊహించినట్లుగానే తన అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చేసింది. ఆ స్థానానికి ఇదివరకు ఖరారైన నరేంద్ర రావత్‌ను పక్కన పెట్టి రాహుల్ గాంధీ సన్నిహితుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ మధుసూదన్ మిస్త్రీని బరిలోకి దించింది. మంగళవారం మిస్త్రీ సహా వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు 12 మంది అభ్యర్థులతో ఏడో జాబితాను విడుదల చేసింది. పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం దక్కించుకున్న రావత్.. బీజేపీ మోడీని వడోదర నుంచి బరిలోకి దింపడంతో ఆయనకు బలమైన పోటీ ఇచ్చేందుకు బరి నుంచి తప్పుకున్నారు. మిస్త్రీ మాట్లాడుతూ...‘ఎన్నో ఏళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. మోడీని ఓడించగలనని నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌కు జాబితాలో చోటు దక్కింది. ఆయనను నాందేడ్ నుంచి బరిలోకి దింపింది. చవాన్ పోటీ చేయకుండా కోర్టు, ఎన్నికల కమిషన్ నిషేధమేమీ విధించలేదని జాబితా విడుదల కార్యక్రమంలో పాల్గొ న్న పార్టీ నేత అజయ్ మాకెన్ అన్నారు. కాగా, కేంద్ర మంత్రి మనీశ్ తివారీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లూధియానా నుంచి ఆనందపూర్ సాహిబ్ సిట్టింగ్ ఎంపీ రవేనీత్సింగ్ బిట్టూ, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ పోటీ చేయనున్నారు. తాజా జాబితాతో హస్తం అభ్యర్థుల సంఖ్య 398కి చేరింది. వారణాసిలో మోడీపై దిగ్విజయ్ పోటీ! మోడీ పోటీచేస్తున్న మరో స్థానం వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను బరిలోకి దింపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మోడీతో ఢీకొనేందుకు ఆయనే సమర్థుడని పార్టీ నేత ఒకరు చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే మోడీపై పోటీ చేస్తానని దిగ్విజయ్ ఇదివరకే ప్రకటించారు. -
మోడిపై పోటీకి సై అంటున్న దిగ్విజయ్
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సిద్దమవుతున్నారు. వారణాసిలో మోడీపై పోటీ చేసేందుకు ఆయన అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానంతో ఆయన చెప్పినట్టు తెలిసింది. దిగ్విజయ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మోడీకి ఆయన దీటైన అభ్యర్థి కాగలని అధిష్టానం భావిస్తోంది. వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు. వారణాసి నుంచి ప్రముఖ వ్యక్తినే రంగంలోకి దింపనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఈనేపథ్యంలో దిగ్విజయ్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.