వడోదరలో మోడీతో మిస్త్రీ ఢీ
12 మందితో కాంగ్రెస్ ఏడో జాబితా
నాందేడ్ నుంచి అశోక్ చవాన్
గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అందరూ ఊహించినట్లుగానే తన అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చేసింది. ఆ స్థానానికి ఇదివరకు ఖరారైన నరేంద్ర రావత్‌ను పక్కన పెట్టి రాహుల్ గాంధీ సన్నిహితుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ మధుసూదన్ మిస్త్రీని బరిలోకి దించింది. మంగళవారం మిస్త్రీ సహా వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు 12 మంది అభ్యర్థులతో ఏడో జాబితాను విడుదల చేసింది. పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం దక్కించుకున్న రావత్.. బీజేపీ మోడీని వడోదర నుంచి బరిలోకి దింపడంతో ఆయనకు బలమైన పోటీ ఇచ్చేందుకు బరి నుంచి తప్పుకున్నారు.
మిస్త్రీ మాట్లాడుతూ...‘ఎన్నో ఏళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. మోడీని ఓడించగలనని నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌కు జాబితాలో చోటు దక్కింది. ఆయనను నాందేడ్ నుంచి బరిలోకి దింపింది. చవాన్ పోటీ చేయకుండా కోర్టు, ఎన్నికల కమిషన్ నిషేధమేమీ విధించలేదని జాబితా విడుదల కార్యక్రమంలో పాల్గొ న్న పార్టీ నేత అజయ్ మాకెన్ అన్నారు. కాగా, కేంద్ర మంత్రి మనీశ్ తివారీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లూధియానా నుంచి ఆనందపూర్ సాహిబ్ సిట్టింగ్ ఎంపీ రవేనీత్‌సింగ్ బిట్టూ, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ పోటీ చేయనున్నారు. తాజా జాబితాతో హస్తం అభ్యర్థుల సంఖ్య 398కి చేరింది.
వారణాసిలో మోడీపై దిగ్విజయ్ పోటీ!
మోడీ పోటీచేస్తున్న మరో స్థానం వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను బరిలోకి దింపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మోడీతో ఢీకొనేందుకు ఆయనే సమర్థుడని పార్టీ నేత ఒకరు చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే మోడీపై పోటీ చేస్తానని దిగ్విజయ్ ఇదివరకే ప్రకటించారు.