న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ద్విముఖ పోరు తప్పదని తేలిపోయింది. మూడో అభ్యర్థి, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో చివరకు బరిలో ఇద్దరే మిగిలారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పరస్పరం పోటీ పడబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
నామినేషన్లను పరిశీలించామని, మొత్తం 20 పత్రాలు వచ్చాయని, సంతకాలు రిపీట్ కావడం, సరిపోలకపోవడం వంటి కారణాలతో 4 పత్రాలను తిరస్కరించామని చెప్పారు. నామినేషన్లలో భాగంగా ఖర్గే 14 పత్రాలు, థరూర్ 5 పత్రాలు, త్రిపాఠి ఒక పత్రం సమర్పించారు. త్రిపాఠి నామినేషన్‌ను తిరస్కరించామని, ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఒకరి సంతకం సరిపోలలేదని, మరొకరి సంతకం రిపీట్ అయ్యిందని తెలిపారు. పోటీలో ఖర్గే, థరూర్ మిగిలారని మిస్త్రీ వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు మరో వారం రోజులు గడువు ఉందని, అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులపై ఈ నెల 8న పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన మరో మూడు పత్రాలు ఎవరు సమర్పించారన్న సంగతి మిస్త్రీ బయటపెట్టలేదు.
ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే నిబంధనకు కట్టుబడి ప్రతిపక్ష నేత పోస్టు నుంచి తప్పుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను శుక్రవారం రాత్రి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఖర్గే రాజీనామాతో ఖాళీ అయిన పదవి కోసం కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం, ప్రమోద్ తివారీ పోటీ పడుతున్నట్లు సమాచారం.
గాంధీ కుటుంబం తటస్థమే: థరూర్
నాగ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సోనియా గాంధీ కుటుంబం తటస్థంగా వ్యవహరిస్తుందని శశి థరూర్ తెలిపారు. ఈ ఎన్నికలో అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ లేరంటూ గాంధీ కుటుంబం తనతో చెప్పిందని అన్నారు. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్న థరూర్ శనివారం ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని దీక్షాభూమి స్మారకం చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాను కలిశానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి పారదర్శకంగా జరగాలని, పార్టీ బలోపేతం కావాలని వారు కోరుకుంటున్నారని వివరించారు. గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని, పార్టీ యంత్రాంగం మొత్తం పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించాలని విన్నవించారు. గాంధీ కుటుంబం మల్లికార్జున ఖర్గే పట్ల మొగ్గుచూపుతోందా? అని ప్రశ్నించగా.. అలాంటి అనుమానాలు తనకు లేవని థరూర్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment