న్యూఢిల్లీ/జైపూర్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేతను ఎన్నికొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ మరో 3–4 రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు సోమవారం తెలిపాయి. సెప్టెంబర్ 20లోగా నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఎన్నిక తేదీపై తుది నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని(సీడబ్ల్యూసీ) వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్ గాంధీకి అశోక్ గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు.
ఆనంద్ శర్మను బుజ్జగించే యత్నాల్లో కాంగ్రెస్
హిమాచల్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జి రాజీవ్ శుక్లా సోమవారం ఆయన్ను కలిసి, పార్టీ పదవిలో కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా శర్మతో ఫోన్‌లో మాట్లాడి, అనేక అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment