
పాలమూరులో జైరాం పర్యటన..రచ్చ..రచ్చ
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి, ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బుధవారం పాలమూరుకు వచ్చిన కేంద్రమంత్రి జైరాంరమేశ్, రాహుల్ దూత కొప్పుల రాజు ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నిరసనలు..నిలదీతల మధ్య పర్యటన రసాభాసగా మారింది.
మునిసిపాలిటీ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వలేదని మహబూబ్‌నగర్ పట్టణంలోని 31, 37వార్డుల అభ్యర్థులు, వారి మద్దతుదారులు గొడవ సృష్టించారు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 31 వార్డు నుంచి తమ కుటుంబానికి టికెట్ ఇప్పిస్తామని నాయకులు చెప్పడంతో తన చిన్న కూతురు రేణుకను నామినేషన్ వేయిస్తే బీఫామ్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని డీసీసీ కార్యదర్శి నాగమణి స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద కన్నీటిపర్యంతమైంది. ఆమె కూతుళ్లు ఉమ, టికెట్ ఆశించిన రేణుక కేంద్రమంత్రి జైరాం రమేశ్ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో హాలు బయటపార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. తమకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్ ముత్యాల ప్రకాశ్ కుట్ర చేశారని, డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. జైరాంరమేశ్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కొప్పుల రాజును అడ్డగించారు.
ఎమ్మెల్యే అబ్రహాం అనుచరుల వీరంగం: జైరాంరమేశ్ హైదరాబాద్‌లో వేరే సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున ఎమ్మెల్యే అబ్రహాంతో మాట్లాడం కుదరదని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ చెప్పడంతో ఆ నియోజకవర్గానికి చెందిన ఆయన అనుయాయులు గొడవకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోతుందని ఎమ్మెల్యే అబ్రహాంకు అవకాశమివ్వగా కాంగ్రెస్ పార్టీలో లేని మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బీఫామ్స్ తెచ్చి తన వర్గం వారికి పంచుతానని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడని, దీనివెనక పార్టీ జిల్లా నాయకత్వం హస్తం ఉందని వారు ఆరోపించారు. అయినా సంతృప్తి చెందని ఆయన అనుచరులు వేదిక పక్కన ఉన్న కుర్చీలను ఎత్తివేసి నిరసన ప్రదర్శించారు.