టెన్షన్.. టెన్షన్ | Counting of votes municipal elections Candidates Tension | Sakshi
Sakshi News home page

టెన్షన్.. టెన్షన్

Published Mon, May 12 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

Counting of votes municipal elections Candidates Tension

సాక్షి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు, రాజకీ య పార్టీల నేతల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఎన్నికలు జరిగి సోమవారం నాటికి నలభై రెండు రోజులు కావస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏ మేరకు ఉంటుందోనని రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటి నుంచే లెక్కలు కడుతున్నారు. దీంతో అన్ని పార్టీల దృష్టి మునిసిపల్ ఓట్ల లెక్కింపుపై పడింది. నగర, పట్టణ ప్రజలే కాకుండా జిల్లావ్యాప్తంగా ప్రజలందరూ మునిసిపల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
 నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన
 పురపాలక సంఘాలు, కార్పొరేషన్ నాలుగేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. పాలక మండళ్లు లేకపోవడంతో కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో, ఏ పని జరగాలన్నా ఎవరి చేత చేయించుకోవాలో తెలియక నగరంలో, పట్టణాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రత్యేకాధికారులను నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ అధికారులకు వారి సొంత శాఖలో పనులు చేయడానికే సమయం సరిపోకపోవడంతో ప్రజల సమస్యలను పట్టించుకున్న నాథుడు లేకుం డా పోయాడు. నాలుగేళ్లుగా పట్టణాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఇదే సమయంలో ప్రభుత్వం
 
 నుంచి విడుదలైన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు కల్పననూ విస్మరించారు. రోడ్లుగోతులమయంగా, పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. అసలు మునిసిపాలిటీలకు వచ్చే నిధులు ఏమవుతున్నాయో, దేనికి ఖర్చు చేస్తున్నారో అడిగే నాథుడే కరువయ్యాడు. ఈ పరిస్థితి నుంచి విముక్తి ఎప్పుడు వస్తుందోనని ప్రజలు ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. 2010 సెప్టెంబర్‌తో ముగిసిన ఏలూరు నగరపాలక, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి.   కొత్త పాలకమండళ్లు ఏర్పడి ప్రజలకు మేలు జరుగుతుందనే విషయం అటుంచితే అసలు పాలక మండలిలో చోటు దక్కేదెవరికి అనే దానిపై పోలింగ్ ముగిసిన రోజు దగ్గర్నుంచి తీవ్ర చర్చ జరుగుతోంది.
 
 ఏ పార్టీకి పురపాలికల్లో ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై భారీగా బెట్టింగ్‌లు జరిగాయి. ఎక్కువ మునిసిపాలిటీలు గెలుచుకునే పార్టీయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందనే ప్రచారం సాగింది. అది ఎంత వరకు వాస్తమనే మాటెలా ఉన్నా ఫలితాలు పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఏప్రిల్ 7న లెక్కింపు జరపాల్సి ఉన్నా వాయి దా వేశారు. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వాయిదా బాటే పట్టడంతో సార్వత్రిక ఎన్నికలపైనే నేతలు దృష్టి సారించారు. పురపోరు  ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే జరిగింది. ఫలితాలు వెల్లడయ్యాక ఎవరిని చైర్మన్‌గా ప్రకటించాలనే దానిపై ఇప్పటికే ఆ పార్టీల ముఖ్యనేతలు కసరత్తు పూర్తిచేశారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement