ప్రచారానికి కిక్కు
సాక్షి, రాజమండ్రి : ఎన్నికలంటే మద్యం వరదగా పారుతుంది. ఈ ఎన్నికల్లో కూడా గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. ప్రచారానికి పార్టీలు సన్నద్ధం అవుతున్న వేళ వందలాది లీటర్ల నాటుసారాను కొనుగోలు చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు గోదావరి తీరంలో సారా పొయ్యిలు రెట్టింపు సంఖ్యలో రాజుకుంటున్నాయి.
తయారీ కేంద్రాలుగా తీర ప్రాంతాలు
గోదావరి తీరంలో దేవీపట్నం మండలం మారుమూల ప్రాంతం కొండమొదలు నుంచి సీతానగరం మండలం సరిహద్దున ఉన్న గిరిజన గ్రామాలను ఆనుకుని సారా తయారీ కేంద్రాలు వందల్లో వెలిశాయని తెలుస్తోంది. ఈ ప్రాంతాలకు పోలీసు, ఎక్సైజు అధికారులు చేరుకోవడం దుస్సాధ్యం. దీంతో ఎన్నికల వేళ పగలు రాత్రి తే డా లేకుండా నాటు సారా తయారు చేస్తున్నారు. తయారైన సారాను రాత్రి నాటు పడవలపై పరిసర గ్రామాలకు తరలిస్తున్నారు. సీతానగరం నుంచి కోనసీమ వరకూ ఉన్న 12 లంకల్లో నెల రోజులుగా సారా బట్టీలకు విరామం ఉండడంలేదు. వందల లీటర్ల సారాను ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం నిమిత్తం తరలిస్తున్నారు. ఉదయం ఈ ప్రాంతాలకు ఎక్సైజు అధికారులు చేరుకునే అవకాశాలు ఉండడంతో రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమై తెల్లవారు జామున నాలుగు గంటల వరకూ సారా తయారీ కొనసాగిస్తున్నారు. ఉదయానికల్లా సారా ఊటను ఇసుకలో కప్పెట్టి మాయం అవుతున్నారు. అధికారులు దాడి చేసినా ఆనవాళ్లు ఉన్నచోట్ల సారా ఊటను మాత్రమే స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. తయారైన సారా మాత్రం రాత్రికి రాత్రి తరలించేస్తున్నారు.
మైదాన ప్రాంతాల్లో ఇలా
ఏజెన్సీ సరిహద్దున ఉన్న ఏలేశ్వరం, గోకవరం, శంఖవరం, రౌతులపూడి పరిసర ప్రాంతాలకు ఏజెన్సీ నుంచి సారా రవాణా అవుతోంది. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కొండ కాలువల ఒడ్డున రాత్రి పూట సారా తయారీ చేస్తూ ఉదయం గ్రామాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో రాత్రుళ్లు దాడులు చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు భద్రతా కారణాల వల్ల ముందుకు రావడంలేదు. దీంతో సారా తయారీ ముమ్మరంగా సాగుతోంది. ఇంకా కోనసీమ తీర ప్రాంతాల్లో సారా తయారీ మునుపు కన్నా రెట్టింపు అయ్యింది. ఏటిమొగ, తూరంగి, దుమ్ములపేట, సాంబమూర్తినగర్ తదితర ప్రాంతాల్లో కూడా సారా విక్రయాలు ముమ్మరం అయ్యాయి.
భారీగా ఇండెంట్లు
మద్యం పంపిణీ చేయడం కన్నా తక్కువ ఖర్చుతో సారా పంచేందుకు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకు అనుగుణంగా భారీగా ఇండెంట్లు కూడా ఇస్తున్నారు. సాధారణ రోజుల్లో సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర నాటుసారా వ్యాపారాలు సాగుతాయని అంచనా. కాగా ఎన్నికల సీజన్‌లో వ్యాపారం రూ. రెండు కోట్లు దాటుతుందని అంటున్నారు. అధికారులు అమ్మకాలు అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెబుతున్నారు.