బద్వేలు, న్యూస్‌లైన్ : ఎన్నికల వేళ.. ఇంటి స్థలాలకు సంబంధించి నకిలీ అనుబంధ పత్రాల పంపిణీ వ్యవహారం గోలగోలగా మారింది. ఈ వ్యవహారం ఇక్కడ అనేక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం సద్దుమణగకపోగా, మరింతగా రాజుకుంటోంది. పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాక.. యంత్రాంగం రంగంలోకి దిగింది. నకిలీ అనుబంధ పత్రాలను తమకు స్వాధీనం చేయాలని ఆదేశించింది. లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో కొందరు భయపడి నకిలీ పత్రాలను వెనక్కి ఇచ్చేయగా, మరికొందరు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల వేళ.. ఏమిటో ఈ గోల
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలనుకన్న ఓ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో ఇంటి స్థలాలకు సంబంధించి అనుబంధ పత్రాలను ఎరగా వేయాలని భావించారు. ఆలోచన వచ్చిందే తడువుగా నకిలీ పత్రాలు సృష్టించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 300 నకిలీ పత్రాలు సృష్టించి, ఓటర్లకు పంచిపెట్టారంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, నాయకులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలనూ వారు తహశీల్దార్ వెంకటరమణకు సమర్పించారు.
అన్నీ నిబంధనలకు విరుద్ధమే..
సాధారణంగా అనుబంధ పత్రాలు రెవెన్యూ కార్యాలయం నుంచే లబ్ధిదారుడు పొందాల్సి ఉంది. లేదా రెవెన్యూ అధికారులు గృహ నిర్మాణ శాఖ వారికి అందజేయాలి. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి వందల సంఖ్యల అనుబంధ పత్రాలు తెచ్చి ఓటర్లకు పంచిపెట్టడం కలకలం రేపుతోంది. అనుబంధ పత్రంలో లబ్ధిదారురాలి ఫొటో అతికించి, దానిపై తహశీల్దార్ సంతకం కూడా ఉండాలి.
అయితే ఇక్కడ పేదలకు పంపిణీ చేసిన అనుబంధ పత్రాల్లో లబ్ధిదారుల ఫొటో లేకపోగా, ఫొటో అతికించాల్సిన ప్రదేశంలో తహశీల్దార్ సంతకం, సీలు ఉండడం గమనార్హం. ఇలా ఇవ్వడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. దీన్ని బట్టి ఇవి నకిలీ పత్రాలే అనేందుకు తిరుగులేని ఆధారంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు అనుబంధ పత్రాలు జనవరి 21న మంజూరు చేసినట్లు పేర్కొనడం కూడా అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. మడకలవారిపల్లె గ్రామ పొలం సర్వే నంబర్-555/1బిలో వీటిని కేటాయించినట్లు రాసి ఉంది. అయితే పైన పేర్కొన్న సర్వే నంబర్‌లో కొంత రిజిస్టర్ భూమి కూడా ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం
ఓ పార్టీ అభ్యర్థిని సరోజమ్మ మద్దతుదారులే నకిలీ అనుబంధ పత్రాలను పంపిణీ చేశారంటూ వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ అభ్యర్థులు చందన, సంధ్య ఆరోపించారు. ఇదే విషయంపై ఎన్నికల అధికారులకు తాము మంగళవారం ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
కాగా నకిలీ అనుబంధ పత్రాల పంపిణీ వ్యవహారంపై బద్వేలు, గోపవరం తహశీల్దార్లు సోమవారం బద్వేలులో పర్యటించారు. అనుబంధ పత్రాలు పొందిన వారంతా తమకు స్వాధీనం చేయాలని మైకుల ద్వారా కోరారు. లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో 50 మంది అనుబంధ పత్రాలను వెనక్కి తెచ్చిచ్చారు.
ఎన్నికల వేళ.. గోలగోల
Published Tue, Apr 1 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
Advertisement