ఎక్స్‌అఫీషియో సభ్యులెవరు?
* ప్రస్తుత నేతలా.. కొత్తగా ఎన్నికయ్యేవారా?
* రాష్ర్ట ఎన్నికల సంఘానికి కొత్త చిక్కు
* స్థానిక ఫలితాలు వచ్చినా.. నెల తర్వాతే పాలక మండళ్లు..
* చైర్‌పర్సన్ల ఎన్నికకు న్యాయ సమస్య
* రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాకే పరోక్ష ఎన్నికకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి వచ్చి పడిన ఎన్నికలతో సతమతమవుతున్న రాష్ర్ట ఎన్నికల సంఘానికి తాజాగా ఓ చిక్కొచ్చి పడింది! స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వెల్లడించాక.. పాలక మండళ్లు ఎలా కొలువుదీరుతాయన్నదే ఆ సమస్య!! పరిస్థితి చూస్తుంటే రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాతే పాలక మండళ్లు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సుప్రీం తీర్పు ప్రకారం సార్వత్రిక ఎన్నికలు ముగిసే మే 7 తర్వాతే ‘స్థానిక’ ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాలు మే 16న వెల్లడికానున్న నేపథ్యంలో అంతకు రెండు మూడు రోజుల ముందు స్థానిక సంస్థల ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. జిల్లాల అధికారులను సంప్రదించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఈసీ గురువారం స్పష్టం చేసింది. అయితే ఇక్కడే ఓ న్యాయ సమస్య ఎదురవుతోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఆయా ప్రాంతాల ఎమ్మె ల్యేలు, ఎంపీలు కలిసి పరోక్ష పద్ధతిలో మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లను, మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరి షత్‌ల చైర్‌పర్సన్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఏదైనా పార్టీ వర్గానికి సరిపడా మెజారిటీ లేని పక్షంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఆ పార్టీ ప్రజాప్రతినిధులే కీలకమవుతారు. మే 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల తర్వాతే.. పాలక మండళ్లకు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాంటప్పుడు తాజాగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించి, వారికే ఓటు హక్కు కల్పించాలా?.. లేక కొత్త ప్రభుత్వాలు ఏర్పడే వరకు పదవిలో కొనసాగనున్న ప్రస్తుత ఎమ్మెల్యేలకు అవకాశమివ్వాలా? అన్న న్యాయ సమస్య తలెత్తుతోంది. సార్వత్రిక ఫలితాల తర్వాత మరో పక్షం రోజుల్లో మాజీలు కానున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు హక్కు కల్పిస్తే.. అది అనైతికమవుతుందున్న వాదన వినిపిస్తోంది. కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదివరకే ఏదో ఒక స్థానిక సంస్థలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదై ఉన్నారు.
మరోవైపు మే 16న వెల్లడయ్యే ఫలితాల్లో విజయం సాధించిన వారు నెల రోజుల్లోగా ఏదో ఒక స్థానిక సంస్థలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవాలని పురపాలక చట్టం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ప్రాధాన్యమివ్వాలన్నది తేల్చుకోలేకపోతున్నట్లు ఓ అధికారి వివరించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా.. ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు. అది సుప్తచేతనావస్థలో ఉంది. అంటే ఎమ్మెల్యేలు ఇంకా పదవిలో ఉన్నట్లే లెక్క. రాష్ట్రపతి పాలనకు రెండు నెలల్లోగా పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుందని లేని పక్షంలో.. ప్రస్తుత శాసనసభను పూర్తిగా రద్దు చే యాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ నెలాఖరులోగా రెండు నెలలు ముగుస్తున్నందున.. ఒకవేళ శాసనసభను రద్దు చేస్తే ‘స్థానికం’ విషయంలో ఎమ్మెల్యేల సమస్య పరిష్కారమవుతుంది. అయినా ఎంపీల సంగతేమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎవరికి అవకాశమివ్వాలన్న దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా స్పష్టత లేదు. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని, న్యాయశాఖ సలహా కూడా తీసుకుంటామని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. చట్టసభల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత.. న్యాయశాఖ ఇచ్చే సలహా ప్రకారం ముందుకెళ్తామని ఆయన చెప్పారు.