సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఇదే...
సాక్షి, ఒంగోలు మెట్రో: అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టికెట్ కోసం చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకోవడంపై నెటిజన్లు, వివిధ దళిత, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై చర్చిస్తూ హర్షకుమార్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. సీటు కోసం ఇంతగా దిగజారాలా, వారసుల కోసం కాళ్లు పట్టుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
‘మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ నిన్నటి వరకూ చంద్రబాబుని నానా బూతులు తిట్టాడు. మళ్లీ ఇప్పుడు టికెట్ కోసం బాబు కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటు. కాళ్లు పట్టుకుని టికెట్ తెచ్చుకుని గెలిచినా.. ఆయన మొహం మాత్రం చూడను’ అని ఆలిండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు.
‘షేక్ హ్యాండివ్వడం సమానత్వానికి గుర్తు. కాళ్లు మొక్కడం బానిసత్వానికి గుర్తు. కాళ్లు మొక్కించుకోవడం ఫ్యూడలిజానికి గుర్తు. పదవి కోసం కాళ్ల మీద పడి నమస్కారం చేసిన హర్షకుమార్.. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడతాడా’.? అంటూ జైభీం ఫౌండేషన్ చైర్మన్ ఎస్.నాగేశ్వరరావు విమర్శించారు.
జగన్ తీరుపై హర్షం...
హర్షకుమార్, చంద్రబాబు తీరును తప్పుపడుతూనే.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నందిగం సురేష్‌లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే సమయంలో నందిగం సురేష్‌కు ఆ జాబితా ఇచ్చి చదివించి అతనికి జగన్ ఇచ్చిన గౌరవంపై నెటిజన్లు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుడైన సురేష్‌కు బాపట్ల ఎంపీ సీటివ్వడమే కాకుండా, ఎంతో గౌరవమివ్వడాన్ని చర్చిస్తూ ప్రశంసించారు. హర్షకుమార్–చంద్రబాబు, సురేష్–జగన్‌ల ఫొటోలతో కూడిన పోస్టును షేర్‌చేస్తూ వారి మధ్య గల వ్యత్యాసంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment