సదాశివపేట, న్యూస్‌లైన్: స్థానిక జెడ్పీటీసీ స్థానానికి ప్రధాన పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో బరిలో దిగాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో ఈ పోటీ అధికంగా ఉంది. వైఎస్సార్ సీపీ నుంచి కూడా పలువురు టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం మరింత ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చినందున ఈసారి కూడా తమ పార్టీ గెలుస్తుందని వారు భావిస్తున్నారు. ఈ దశలో కాంగ్రెస్ నాయకులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, పెద్దాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొట్టిపల్లి విశ్వంతోపాటు పలువురు నాయకులు టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో సంగమేశ్వర్, శ్రీశైలం యాదవ్‌లు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆశావహులంతా ఎమ్మెల్యే వద్దకు పరుగులు తీస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు ఏఎంసీ మాజీ చైర్మన్ పొట్టిపల్లి విశ్వం ప్రధాన అనుచరుడు. ఈయన జెడ్పీటీసీ టికెట్ కోసం దామోదర ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. విశ్వం సతీమణి నాగమణి తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు.
టీఆర్‌ఎస్ నుంచి పలువురు..
టీఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, బాబిల్‌గామ్ గ్రామానికి చెందిన బీరయ్య యాదవ్ జెడ్పీటీసీ టికెట్‌ను ఆశిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ ద్వారా ఆయన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరూర్ గ్రామానికి చెందిన అల్లం బస్వరాజ్, వెల్టూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ యాదవ్, ఆత్మకూర్‌కు చెందిన టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా నియోజకవర్గ ఇన్‌చార్జి చింత ప్రభాకర్‌పై భారం వేశారు.
తలలు పట్టుకుంటున్న నేతలు..
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో ఆశావహులు అధికంగా ఉండడంతో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆశావహులు ఎవరికి వారుగా తమ స్థాయిలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుండడంతో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయమై ఆయా పార్టీలు ఇంకా ఓ కొలిక్కి రాలేకపోయాయి. నామినేషన్ వేయడానికి గురువారం చివరి రోజు. నామినేషన్లు వేసుకోవడానికి ఆశావహులందరికి ఆయా పార్టీలకు చెందిన నాయకులు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న వారికి బీ-ఫారం ఇస్తామని, మిగతా వారు బరిలో నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ నుంచి నర్సింలు..
కాగా టీడీపీ, బీజేపీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా జెడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిలో పోటీచేయనున్నారు. ఈ మేరకు టీడీపీ నాయకుడు, ఆత్మకూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు నర్సింలుకు జెడ్పీటీసీ టికెట్ ఖరారైంది.
నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు
Published Wed, Mar 19 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement