సార్వత్రిక టెన్షన్
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: అందరిలోనూ ఒకటే టెన్షన్. దేశ భవిష్యత్‌తో పాటు, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రాజకీయ పార్టీల శ్రేణులు తీవ్ర ఉత్కం ఠకు గురవుతున్నారు. ఈ నెల ఏడో తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో పోలిం గ్ శాతం పెరగడం ఎవరికి మేలు చేస్తుందన్న దానిపై ప్రధాన పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. గత రెండు రోజుల్లో వెల్లడైన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ఆధారంగా సార్వత్రిక విజయావకాశాలపై కొం దరు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే స్థానిక, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిలో చాలా తేడా ఉం టుందని, ఓటర్ల తీర్పులో మార్పు ఉం టుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఫలితాల మధ్య కనిపించిన భారీ తేడాయే దీనికి నిదర్శనమని పేర్కొం టున్నారు. దాంతో సార్వత్రిక ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో పరిస్థితిని చూస్తే.. పురపాలక, పరిషత్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు సాగిన విషయాన్ని ఫలితాల సరళి స్పష్టం చేసింది. సీట్ల సంఖ్యలో టీడీపీ కాస్త ముందున్నట్లు కనిపించినా.. ఓట్లపరంగా రెం డింటి మధ్య తేడా చాలా స్వల్పం. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇలాగే వస్తాయా లేక మార్పు ఉంటుం దా? అన్న అంశమే ఇప్పుడు అందరినీ ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రధాన పోటీదారులైన వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు దేనికదే విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రాదేశిక ఫలితాల్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్న టీడీపీ రానున్న ఫలితాల్లోనూ దాన్నే పునరావవృతం చేస్తామని చెబుతోంది. కాగా ప్రాదేశిక ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికల్లో తాము ముందంజ వేస్తామని టీడీపీని ఊహించని రీతిలో దెబ్బ కొడతామని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఫలి తాలపై నెలకొన్ని ఉత్కంఠను అవకాశంగా తీసుకొని బెట్టింగ్‌రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పార్టీలు, అభ్యర్థులు, మెజారిటీలపై జోరుగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలు పందాలు కాస్తూ ఎన్నికల ఫలితాలు సొమ్ము చేసుకునే పనిలో ప్రస్తుతం పందెంరాయుళ్లు బిజీగా ఉన్నారు.