ఎన్నికలకు సర్వం సిద్ధం
- జిల్లాలో 3614 పోలింగ్ కేంద్రాలు పకడ్బందీగా
- భద్రతా ఏర్పాట్లు సమస్యాత్మక
- {పాంతాలపై ప్రత్యేక దృష్టి
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. జిల్లాలో 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7న జరగనున్న పోలింగ్, 16వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి చేపడుతున్న చర్యలను ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విలేకరులకు వివరించారు.
మొత్తం 3614 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 10,260 బ్యాలెట్ యూనిట్లు, 7980 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశామని చెప్పారు. విశాఖ లోక్‌సభ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీపడుతుండడంతో ఇక్కడ 2 బ్యాలెట్ యూనిట్లు పెట్టాల్సి ఉందన్నారు. అలాగే విశాఖ-తూర్పులో 21 మంది, గాజువాకలో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఇక్కడ కూడా రెండేసి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
జిల్లాలో మొత్తం 33,46,639 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులకు 3967 మంది పీవో, 3967 మంది ఏపీవో, 16,366 మంది ఓపీవోలను నియమించామని చెప్పారు. పాడేరు, అరకుకు సంబంధించి ఉద యం 7 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు ఓటింగ్ ఉంటుందని తెలిపారు.
భారీ బందోబస్తు
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి.శివధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. 26 కంపెనీలు సీఏపీఎఫ్, 10 ప్లటూన్లు ఏపీఎస్‌పీతో పాటు ఏఎస్పీ నుంచి హోమ్‌గార్డుల వరకు మొత్తం 7100 మందిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో మొత్తం 12,056 మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎస్‌ఎఫ్, సీఏపీఎఫ్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఉంటుందన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటల తరువాత ఇతర ప్రాంతాల రాజకీయ నాయకులు జిల్లా నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.