నేడే మున్సి‘పోల్’ | muncipal elections today | Sakshi
Sakshi News home page

నేడే మున్సి‘పోల్’

Published Sun, Mar 30 2014 1:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

నేడే మున్సి‘పోల్’ - Sakshi

నేడే మున్సి‘పోల్’

మున్సిపాలిటీలు145
కార్పొరేషన్లు 10
మొత్తం ఓటర్ల సంఖ్య 95,35,824
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్
3,959 వార్డులు, 513 డివిజన్లకు 21,207 మంది పోటీ
9,015 కేంద్రాలు.. 50,300 మంది సిబ్బంది.. 13,991 ఈవీఎంలు
3,630 సమస్యాత్మక, 3,026 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
53 వేల మందికి పైగా పోలీసు, పారా బలగాలతో భారీ బందోబస్తు
1,046 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 1,023 నిఘా బృందాల ఏర్పాటు
23,519 మందిపై కేసులు.. 2,44,101 మంది బైండోవర్
ఓట్ల లెక్కింపుపై హైకోర్టు  ఏం చెప్తే అది చేస్తాం: రమాకాంత్‌రెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మొత్తం 145 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హైకోర్టు తీర్పు కారణంగా కర్నూలు జిల్లా బనగానపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలను వాయిదా వేశారు. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని.. ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఏప్రిల్ 1వ తేదీన ఏం చెప్తే అది చేస్తామని.. 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేయమంటే చేస్తామని, లేదు వాయిదా వేయమంటే వేస్తామని చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 2010 సెప్టెంబర్‌లో పాలక మండళ్ల గడువు ముగియడంతో.. అప్పటి నుంచి ఎన్నికలు జరుగకుండా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల మూడో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటమూ విదితమే. ఆదివారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి రమాకాంతరెడ్డి వివరించిన ముఖ్యాంశాలివీ...
 ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 95,35,824 మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 47,64,857 మంది ఉంటే.. మహిళలు 47,70,346 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 5,489 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో హిజ్రాలు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హిజ్రాలు మొత్త 621 మంది ఓటర్ల జాబితాలో ఉన్నారు.
 
 మున్సిపాలిటీల్లో మొత్తం 3,990 వార్డులు ఉంటే.. అందులో 39 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మిగిలిన 3,959 వార్డుల ఎన్నికల్లో 17,795 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 10 కార్పొరేషన్లలో మొత్తం 513 డివిజన్లకు ఎన్నికల్లో 3,343 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
 
 మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కోసం 10,087 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కోసం 3,814 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తున్నారు. 3,630 సమస్మాత్మక, 3,026 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో 3,002 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్, 4,919 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని వీడియోగ్రఫీ చేస్తారు. 1,656 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు.
 
 మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహణకు 36,500 మంది టీచర్లు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహణకు 13,800 మంది టీచర్లు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.
 
 ప్రతి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా జిల్లాల్లోని పోలీసు సిబ్బందినే ఆయా మున్సిపాలిటీల్లో నియమించారు. ఇందుకు అదనంగా 41 మంది డీఎస్‌పీలు, 55 మంది ఎస్‌ఐలు, 130 ఏఎస్‌పీ ప్లాటూన్లు, 16 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను నియమించారు.
 
 ఎన్నికల నియామవళి అమలులో భాగంగా 23,519 మందిపై కేసులు నమోదు చేశారు. 2,44,101 మందిని బైండోవర్ చేశారు. 15,766 ఆయుధాలను డిపాజిట్ చేశారు. 201 ఆయుధాల లెసైన్స్‌లను రద్దు చేశారు. ఎక్సైజ్, పోలీసులు కలిపి 20,724 కేసులు నమోదు చేశారు. 7,483 మందిని అరెస్టు చేశారు. 1,79,422 లీటర్ల మద్యాన్ని, 3 లక్షల కేజీలకు పైగా నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 59.17 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో నాగరాజు అనే కమిషనర్ విధులు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ చేసి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సాధనను నియమించారు.
 
 ఎన్నికల కోసం భారీ బందోబస్తు: డీజీపీ
 
 మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాం తంగా జరగడానికి మొత్తం 53,370 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. ఇందులో 36 మంది అదనపు ఎస్పీలు, 206 మంది డీఎస్పీలు, 631 మంది ఇన్‌స్పెక్టర్లు, 2,053 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 9,048 ఏఎస్‌ఐలు, 33,168 మంది కానిస్టేబుళ్లు, రిజర్వు కానిస్టేబుళ్లను బందోబస్తుకు నియోగించినట్లు వివరించారు. అలాగే 792 మంది మహిళా కానిస్టేబుళ్లు, 512 మంది మహిళా హెడ్‌కానిస్టేబుళ్లు, 6,923 మంది హోగార్డులు కూడా బందోబస్తులో ఉన్నారని తెలిపారు.
 
 ‘‘మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారు. అయినా ఆ ఓటర్ల స్లిప్‌లను సమయం లేనందున ధృవీకరించలేదు. ఓటర్ గుర్తింపు కార్డు లేనివారు రేషన్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్ వంటి 21 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో కార్డు తీసుకువెళ్లి ఓటు వేయాలి. ఓటరు స్లిప్ కూడా తీసుకువెళితే పోలింగ్ కేంద్రంలో సిబ్బంది త్వరగా మీ పేరు గుర్తించగలరు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తారు. ’’    
 - రమాకాంత్‌రెడ్డి

 


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement