‘ఏకపార్టీ ప్రభుత్వాలకు ఇక కాలం చెల్లింది.. సంకీర్ణ రాజకీయాల శకమిది’ అన్న నమ్మకాన్ని బద్ధలు కొట్టి.. కాంగ్రెస్ తరువాత సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది.
‘ఏకపార్టీ ప్రభుత్వాలకు ఇక కాలం చెల్లింది.. సంకీర్ణ రాజకీయాల శకమిది’ అన్న నమ్మకాన్ని బద్ధలు కొట్టి.. కాంగ్రెస్ తరువాత సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది. మోడీ ప్రభంజనం ధాటికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షం కకావికలయింది. మోడీ విజయానికి కారణాలేంటి.. విశ్లేషణ..!
* ఆర్థికరంగంపై దృష్టి: యూపీఏ పాలనలో ఆర్థికరంగం కుదేలయింది. 2013లో జీడీపీ 5% కన్నా తక్కువకు దిగజారింది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరింది. మోడీ తన ప్రచారంలో దీనిపై దృష్టి పెట్టారు. గుజరాత్ అభివృద్ధి మోడల్‌ను చూపుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. ఆర్థికరంగ పునరుజ్జీవనానికి పరిపాలనాదక్షుడు అవసరమని, మోడీలో ఆ దక్షత ఉందని నమ్మి కార్పొరేట్ రంగమంతా బీజేపీకి దన్నుగా నిలిచింది.
* అవినీతిపై పోరు: పదేళ్ల యూపీఏ పాలనలో చోటు చేసుకున్న కుంభకోణాలను సమర్ధవంతంగా ప్రచారంలో ఉపయోగించుకున్నారు. వారి పాలనలో వనరుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించారు. అవినీతిపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించిన మోడీ.. తన ప్రచారంలో అవినీతిపై పోరును ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ప్రభుత్వంలో, వ్యవస్థలో అవినీతి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ధనానికి చౌకీదారుగా వ్యవహరిస్తానన్నారు.
* యువత: ఈ సారి యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 81 కోట్ల మంది ఓటర్లలో దాదాపు సగంమంది 35ఏళ్ల లోపువారే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటూ వారిని ఆకర్షించారు. అదీకాక, పదేళ్ల యూపీఏ పాలనపై వారంతా విసిగి వేసారి ఉన్నారు.
* సాంకేతిక పరిజ్ఞానం: ప్రచారంలో ఇంటర్నెట్‌ను, 3డీ టెక్నాలజీ సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని మోడీ అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ట్విటర్, ఫేస్‌బుక్ సహా సామాజిక వెబ్‌సైట్లలోనూ ప్రచారం చేశారు. అందుకు ప్రత్యేకంగా ఒక సాంకేతిక నిపుణుల బృందాన్నే నియమించారు. సెల్ఫీలు, ట్వీట్‌లతో నెటిజన్లను ఆకర్షించారు. అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ప్రచార పద్ధతులనే వినియోగించింది.
* మౌలిక వసతుల కల్పన: దేశంలో మౌలిక వసతుల లేమిని గుర్తించిన మోడీ.. ఆ దిశగానూ ప్రచారం చేశారు. రహదారులు, విద్యుత్,ఇతర మౌలిక వసతులు సమర్ధంగా కల్పించలేకపోవడం వల్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు మన దేశానికి రావడం లేదని, దానికి కారణం యూపీఏ పాలనేనని ప్రజల్లో ప్రచారం చేశారు. గుజరాత్‌లో తన నేతృత్వంలో కల్పించిన మౌలిక వసతులను వీలైన ప్రతీ సందర్భంలోనూ గుర్తుచేశారు.