చైర్‌పర్సన్ ఎవరో.. జెడ్పీ పీఠంపై ఇంకా అస్పష్టతే..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్మన్.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్... ఈ పీఠం కోసం చివరి నిమిషం వరకూ విపరీతమైన పోటీ ఉండేది. కేబినేట్ హోదాతో సమానం కావడంతో దీన్ని అధిరోహించేందుకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ రసవత్తరమైన పోరు సాగేది.
ఈ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు... ఆయూ వర్గాల నేతలు ముందస్తుగానే అన్నీ చక్కబెట్టుకునేవారు. పైచేరుు కోసం ఒకరికొకరు విమర్శలు గుప్పించుకోవడంతోపాటు క్యాంప్ రాజకీయూలతో ఉత్కంఠకు తెరలేపేవారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోరుుంది.
సాధారణ ఎన్నికల తరుణంలో వచ్చిన జిల్లాపరిషత్ ఎన్నికలు ఒకింత సందడి లేకుండానే జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ దశకు వచ్చినా... గతంలో ఉన్నంత ఊపు కనిపించడంలేదు. రాజకీయ పార్టీల ముఖ్య నేతలు... సొంత ఎన్నికల వ్యూహాల్లో ఉండడంతో జిల్లా పరిషత్ పోరుపై ద్వితీయ శ్రేణి నాయకులు నిరాసక్తతో ఉన్నారు.
ఫలితంగా జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ ఎవరనేది ప్రధాన పార్టీల్లోనూ ఇప్పటికీ స్పష్టత రాలేదు. కనీసం ఫలనా పార్టీ నుంచి ఫలానా నేత చైర్‌పర్సన్ బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ కనిపించలేదని... వరుస ఎన్నికలతో స్థానిక సంస్థల పోరు చిత్రం మారిందని రాజకీయ నేతలే అభిప్రాయ పడుతుండడం గమనార్హం.
4 ఎస్సీ మహిళ.. 5 ఎస్సీ జనరల్.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి
ఎస్సీ మహిళకు రిజర్వ్ అరుుంది. గోవిందరావుపేట, దేవరుప్పుల, కొడకండ్ల, నర్మెట మండలాల జెడ్పీటీసీ స్థానాలను ఎస్సీ మహిళకు కేటారుుంచారు. నర్సింహులపేట, నెక్కొండ, పర్వతగిరి, పాలకుర్తి, రాయపర్తి మండలాలను ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. వీటిలోనూ ఎస్సీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుంది.
ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళకు కేటాయించిన 9 మండలాలతోపాటు జనరల్, జనరల్ మహిళ కేటగిరిలో ఆరు చొప్పున జెడ్పీటీసీలు స్థానాలు ఉన్నాయి. వీటి నుంచి ఎస్సీ మహిళ ఎన్నికైనా.. చైర్‌పర్సన్ రేసులో ఉంటారు. ఈ నేపథ్యంలో జెడ్పీ పీఠాన్ని అధిరోహించే మహిళ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్వతగిరి మండలం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అరుుంది. ఇక్కడ టీఆర్‌ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ పసునూరి దయాకర్ భార్య పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి లక్ష్యంగా పోటీకి దిగుతున్నారు.
ఆరూరి రమేశ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులైనప్పుడు దయాకర్‌కు స్థానిక సంస్థలో ప్రాధాన్యం ఇస్తారని ఒప్పందం జరిగినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారుు. పర్వతగిరి.. కడియం శ్రీహరి సొంత ఊరు కావడంతో టీఆర్‌ఎస్‌కు ఈ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానానికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్ భార్య పేరు వినిపిస్తోంది.
పాలకుర్తి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. పాలకుర్తి, రాయపర్తి మండలాలు ఎస్సీ జనరల్‌కు... కొడకండ్ల, దేవరుప్పుల ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. ఇలా ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు ఎస్సీ వర్గాలకే కేటాయించారు. ఈ నియోజకర్గం నుంచి ఎన్నికయ్యే జెడ్పీటీసీలే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సాధారణ ఎన్నికల తరుణంలో జెడ్పీటీసీలను గెలుచుకోవడం ఎమ్మెల్యే అభ్య ర్థులకు పరీక్షగా మారింది. చైర్‌పర్సన్ రిజర్వ్ అయిన వర్గానికే ఈ నియోజకర్గంలోని 4 మం డలాలకు కేటాయించడం అన్ని పార్టీలకు ఇబ్బందికర పరిస్థితి తెచ్చింది.
ఎస్సీ జనరల్‌కు కేటాయించిన పాలకుర్తి మండలం జెడ్పీటీసీగా మహిళను బరిలో నిలుపుతామని కాంగ్రెస్ నియోజకర్గ ఇన్‌చార్జ్ దుగ్యాల చెప్పారు. వరంగల్ ఎంపీ రాజయ్య భార్య ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
జనగామ నియోజకవర్గంలో నర్మెట ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. జనగామలోని ఓ వైద్యుడు తన భార్యకు టికెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలను సంప్రదిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ముందుగానే ఖాయం చేస్తే తగిన ఏర్పాట్లు చేసుకుంటానని రెండు పార్టీల్లోని ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లక్ష్యంగా టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జి.నర్సింహరావు తన భార్యను బరిలో నిలిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వారు జిల్లా చైర్‌పర్సన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
2006లో జరిగిన ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దేవరుప్పుల మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన లకావత్ ధన్వంతి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యారు. ఇప్పుడు ఇలానే జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
డోర్నకల్ నియోజకవర్గ నర్సింహులపేట మండలాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేవారు ఎవరనేది ఇంకా స్పష్టత రావడం లేదు.