మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ :
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు కృషిచేయూలని ఎస్పీ జె.ప్రభాకరరావు పేర్కొన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలపై పోలీసుల నిఘా ఉంచాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించినా, నిబంధనలను అతిక్రమించినా సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఎలక్షన్ డేటా కార్డులను లేదా పోస్టల్ బ్యాలెట్‌లను సంబంధిత అధికారుల నుంచి పొందాలని సూచించారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు, అనుమానాస్పదవ్యక్తులను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయూలని, లెసైన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
అధికారులు అవగాహనతో మెలగాలి
డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శృంగవరపుకోట, పందిరిపల్లిగూడెం, గుమ్మళ్ళపాడు వంటి ద్వీప గ్రామాలలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలపై అవగాహన అవసరం
ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసులు ముందుగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలపై అవగాహన కల్పించుకోవాలని కోరారు. సంబంధిత రూట్ మ్యాప్‌లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సాగర్, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.
ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి : ఎస్పీ
Published Wed, Mar 19 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
Advertisement
Advertisement