sp j prabhakar rao
-
ఎన్నికలకు భంగం కలిగిస్తే ఊరుకోం
ఎస్పీ జె.ప్రభాకరరావు అవనిగడ్డ, న్యూస్‌లైన్: ఆదివారం జరుగనున్న తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు రౌడీషీట్లు తెరుస్తామని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు హెచ్చరించారు. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించే నిమిత్తం శనివారం అవనిగడ్డ విచ్చేసిన ఎస్పీ స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతగా 26మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, 317ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 7,91,345మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో 589ప్రాంతాల్లో 1015 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం ఎన్నికలు జరుగనున్న 26మండలాల్లో 59అత్యంత సమస్యాత్మక, 67సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, వీటిలో ఆరు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 8మంది డీఎస్పీలు, 28మంది సీఐలు, 100మంది ఎస్ఐలు, 250మంది ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులు రెండువేల మందితో, ఒక సీఆర్పీఎఫ్ ప్లాటూన్, రెండు ఏపీఎస్పీ ప్లాటూన్లు, మూడు ప్లాటున్ల ఎస్పీఎఫ్ సిబ్బందిని వినియోగించనున్నట్లు తెలిపారు. త్వరలోనే సాధారణ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ప్రతి కూడలి ప్రాంతంలో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నామని, 80బెల్టుషాపులపై కేసులు నమోదు చేశామని వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 3వేల మందిపై బైండోవర్ కేసులు నమోదుచేశామని చెప్పారు. ఎన్నికల ప్రచారఘట్టం శుక్రవారం సాయంత్రంతో ముగిసిందని, పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల లోపు ఆయా పార్టీల అభ్యర్థులు, వ్యక్తులు ప్రచారం నిర్వహించరాదని, అదే విధంగా ఆయా పార్టీల రంగులను తెలియజేసే విధంగా చొక్కాలు ధరించకూడదని చెప్పారు. పోలింగ్స్టేషన్లో ఓటరు కానివారు పదేపదే పోలింగ్‌కేంద్రంలోకి ప్రవేశిస్తే వారిపై వీడియో చిత్రీకరించి ఎన్నికల కమిషన్‌కు పంపుతామని స్పష్టం చేశారు. డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు నుంచి అవనిగడ్డ సబ్‌డివిజన్‌లో ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీతోపాటు సీఐ ఎన్.సూర్యచంద్రరావు పాల్గొన్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు పరిశీలన కంచికచర్ల : నందిగామ నియోజకవర్గ పరిధిలోని అత్యంత సమస్యాత్మక గ్రామాలైన పరిటాల, చెవిటికల్లు గ్రామాలను స్థానిక డీఎస్పీతో కలిసి ఎస్పీ జే.ప్రభాకరరావు పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలను పరిశీలించేందుకు శనివారం సాయంత్రం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నందిగామ డీఎస్పీ డీసీహెచ్ హుస్సేన్, స్థానిక ఎస్ఐ కందుల దుర్గాప్రసాదరావు పాల్గొన్నారు. అభ్యర్థులు సహకరించాలి: అడిషనల్ ఎస్పీ ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సహకరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ, నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి బీడీవీ సాగర్ కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎంపీటీసీ,జెడ్పీటీసీ అభ్యర్థులతో శనివారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. -
ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి : ఎస్పీ
మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు కృషిచేయూలని ఎస్పీ జె.ప్రభాకరరావు పేర్కొన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలపై పోలీసుల నిఘా ఉంచాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించినా, నిబంధనలను అతిక్రమించినా సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఎలక్షన్ డేటా కార్డులను లేదా పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత అధికారుల నుంచి పొందాలని సూచించారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు, అనుమానాస్పదవ్యక్తులను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయూలని, లెసైన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అధికారులు అవగాహనతో మెలగాలి డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శృంగవరపుకోట, పందిరిపల్లిగూడెం, గుమ్మళ్ళపాడు వంటి ద్వీప గ్రామాలలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలపై అవగాహన అవసరం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసులు ముందుగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలపై అవగాహన కల్పించుకోవాలని కోరారు. సంబంధిత రూట్ మ్యాప్‌లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సాగర్, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు. -
నేరాల సంఖ్య తగ్గించాం
మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో 2013లో నేరాల సంఖ్యను అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే చాలా వరకు తగ్గించగలిగామని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు పేర్కొన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ నిర్భయ చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. నిర్భ య చట్టం అమలులో ఉన్నప్పటికీ మహిళలపై, ప్రత్యేకించి బాలికలపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చేం దుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియా భాగస్వామ్యం కావాలి.. నిర్భయ చట్టం అమలులో మీడియా ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఎస్పీ తెలి పారు. బాలికలపై లైంగికదాడులు జరిగినపుడు సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అలా ఫిర్యాదు చేయని పక్షంలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్స్యు వల్ అఫెన్సెస్ -2013 యాక్టు ప్రకారం సంబంధిత సంస్థపై కేసుల నమోదుకు వీలుందన్నారు. నిత్యం విధులతో సతమతమయ్యే పోలీసులకు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. 40 ఏళ్ల వయస్సు కలిగిన సిబ్బందికి ఈ చెకప్‌లు చేయిస్తున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు 750 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుల కుటుంబాలకు కూడా చెకప్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. 15 రిసెప్షన్ హాళ్లకు ప్రతిపాదనలు.. జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ హాళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్పీ చెప్పారు. ఒక్కో స్టేషన్లో రూ. 50 లక్షల వ్యయంతో వీటిని నిర్మించాలని నిర్ణయించి, ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. త్వరలో మెరైన్ స్టేషన్ల నిర్మాణం... జిల్లాలో మూడు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. వాటిలో గిలకలదిండి స్టేషన్‌కు మాత్రమే సొంత భవనం ఉందన్నారు. ఒర్లగొందితిప్ప, పాలకాయతిప్ప మెరైన్ స్టేషన్లకు భవనాల నిర్మాణం త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జగ్గయ్యపేట, హనుమాన్‌జంక్షన్, గుడివాడ డివిజన్లలో మాత్రమే సీసీ కెమేరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం, నందిగామ, పామర్రు, కంచకచర్లలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డయల్-100కు మంచి స్పందన వస్తోందన్నారు. సమావేశంలో బందరు డీఎస్పీ డాక్టర్ కె.శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ బి.చంద్రశేఖర్, డీసీఆర్బీ, ఎస్బీ సీఐలు పాల్గొన్నారు.