ఎస్పీ జె.ప్రభాకరరావు
అవనిగడ్డ, న్యూస్‌లైన్: ఆదివారం జరుగనున్న తొలివిడత ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు రౌడీషీట్లు తెరుస్తామని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు హెచ్చరించారు. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించే నిమిత్తం శనివారం అవనిగడ్డ విచ్చేసిన ఎస్పీ స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతగా 26మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, 317ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 7,91,345మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు.
ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో 589ప్రాంతాల్లో 1015 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం ఎన్నికలు జరుగనున్న 26మండలాల్లో 59అత్యంత సమస్యాత్మక, 67సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, వీటిలో ఆరు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 8మంది డీఎస్పీలు, 28మంది సీఐలు, 100మంది ఎస్‌ఐలు, 250మంది ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులు రెండువేల మందితో, ఒక సీఆర్‌పీఎఫ్ ప్లాటూన్, రెండు ఏపీఎస్పీ ప్లాటూన్‌లు, మూడు ప్లాటున్ల ఎస్పీఎఫ్ సిబ్బందిని వినియోగించనున్నట్లు తెలిపారు.
త్వరలోనే సాధారణ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ప్రతి కూడలి ప్రాంతంలో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నామని, 80బెల్టుషాపులపై కేసులు నమోదు చేశామని వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 3వేల మందిపై బైండోవర్ కేసులు నమోదుచేశామని చెప్పారు.
ఎన్నికల ప్రచారఘట్టం శుక్రవారం సాయంత్రంతో ముగిసిందని, పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల లోపు ఆయా పార్టీల అభ్యర్థులు, వ్యక్తులు ప్రచారం నిర్వహించరాదని, అదే విధంగా ఆయా పార్టీల రంగులను తెలియజేసే విధంగా చొక్కాలు ధరించకూడదని చెప్పారు. పోలింగ్‌స్టేషన్‌లో ఓటరు కానివారు పదేపదే పోలింగ్‌కేంద్రంలోకి ప్రవేశిస్తే వారిపై వీడియో చిత్రీకరించి ఎన్నికల కమిషన్‌కు పంపుతామని స్పష్టం చేశారు. డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు నుంచి అవనిగడ్డ సబ్‌డివిజన్‌లో ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీతోపాటు సీఐ ఎన్.సూర్యచంద్రరావు పాల్గొన్నారు.
అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు పరిశీలన
కంచికచర్ల : నందిగామ నియోజకవర్గ పరిధిలోని అత్యంత సమస్యాత్మక గ్రామాలైన పరిటాల, చెవిటికల్లు గ్రామాలను స్థానిక డీఎస్పీతో కలిసి ఎస్పీ జే.ప్రభాకరరావు పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలను పరిశీలించేందుకు శనివారం సాయంత్రం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నందిగామ డీఎస్పీ డీసీహెచ్ హుస్సేన్, స్థానిక ఎస్‌ఐ కందుల దుర్గాప్రసాదరావు పాల్గొన్నారు.
అభ్యర్థులు సహకరించాలి: అడిషనల్ ఎస్పీ
ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించేందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు సహకరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ, నందిగామ నియోజకవర్గ ఇన్‌చార్జి బీడీవీ సాగర్ కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎంపీటీసీ,జెడ్‌పీటీసీ అభ్యర్థులతో శనివారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు.
ఎన్నికలకు భంగం కలిగిస్తే ఊరుకోం
Published Sun, Apr 6 2014 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement