పిన్నమనేని రాజకీయ పితలాటకం!
- నాటి వైభవం కనుమరుగు
- ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెబుతూ ప్రకటన
- టీడీపీలో ద్వితీయశ్రేణి ప్రచార కార్యకర్తగా చలామణి
- కొడాలి నానిని ఎదుర్కోలేకే...!
గుడివాడ, న్యూస్‌లైన్ : జిల్లానే కాదు రాష్ట్రంలోనే పిన్నమనేని కుటుంబమంటే ఓ ప్రత్యేకత ఉంది. అయితే పిన్నమనేని కోటేశ్వరరావు మరణానంతరం ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలనే నిర్ణయం తీసుకున్నారు. తానెప్పటికీ కాంగ్రెస్‌వాదినేనని చెప్పుకున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇటీవల టీడీపీ గూటికి చేరి గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుక ప్రచార కర్తగా మారాడు. గుడివాడలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ని రాజకీయంగా ఎదరుర్కోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడనే పెద్దల సామెతను రావి, పిన్నమనేని నిజం చేశారని చెబుతున్నారు.
చివరికి స్వగ్రామంలోనూ ఓటమే....
గతపదేళ్లుగా జరిగిన పలు ఎన్నికల్లో పిన్నమనేని వెంకటేశ్వరావు కొడాలి నాని రాజకీయ చతురత ముందు ఓటమి చెందుతూనే ఉన్నారు. పిన్నమనేని కుటుంబానికి బలంగా ఉండే నందివాడ , గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో గత మండల పరిషత్ ఎన్నికల్లో కొడాలి నాని అనుచరులు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పిన్నమనేని సొంత మండలం నందివాడ మండలంలోనూ మెజార్టీ దక్కలేదు. దీనికి తోడు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పిన్నమనేని స్వగ్రామం రుద్రపాకలో కొడాలి నాని నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన దళిత మహిళ విజయఢంకా మోగించింది.
ఇదీ పిన్నమనేని కుటుంబ రాజకీయ ప్రస్థానం...
1957లో రాజకీయాల్లోకి వచ్చిన తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు అత్యధిక కాలం జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ముసలం పుట్టినా పిన్నమనేని కోటేశ్వరావు మాత్రమే పరిష్కరించగలరనే నమ్మకం ఆ పార్టీ ప్రధాన నేతల్లో ఉండేది. ఆయన అనంతరం పిన్నమనేని వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చి ముదినేపల్లి నుంచి పోటీ చేసి మూడుసార్లు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు.
నియోజక వర్గాల పునర్విభజనతో ముదినేపల్లి నియోజకవర్గం కనుమరుగైంది. దీంతో 2009లో గుడివాడనుంచి పోటీ చేసిన పిన్నమనేని కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చేతిలో 17635ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో జరిగిన విభజన పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్‌పార్టీ కనుమరుగు కావడంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికినట్లు ప్రకటించారు.
అయితే కొడాలి నానిని ఓడించాలనే సంకల్పంతో టీడీపీ పంచన చేరి గుడివాడ టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావును గెలి పించాలని కోరుతూ ప్రచారకర్తగా వ్యవ హరిస్తున్నారు ఒకప్పటి వారి కుటుంబ రాజకీయాలను గుర్తెరిగిన గ్రామీణులు ఆయన చర్యలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.