pinnamaneni venkateswara rao
-
సీట్‌బెల్ట్ వాడకే మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధే అనేక మంది పాలిట శాపంగా మారుతోంది. సీట్ బెల్ట్ వినియోగించని కారణంగానే ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని భార్య , డ్రైవర్ మృతిచెందారు. పిన్నమనేని సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి మృత్యువాతపడటానికీ సీట్ బె ల్ట్ ధరించకపోవడమే కారణం. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి కారు ఔటర్‌పై ప్రమాదానికి గురైనప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు మరణించినా..సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ఆరవ్‌రెడ్డి బయటపడ్డారు. సీట్ బెల్ట్ ఎందుకంటే..:కారులో ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో వారూ ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. దీంతో ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లు తదితరాలను వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీ కొడితే.. అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఇలా పడటం వల్ల తీవ్రగాయాలపాలై మృత్యువాతపడుతుంటారు. అదే సీట్ బెల్ట్ వాడితే పెద్ద కుదుపునకు మాత్రమే గురై గాయాలతో బయటపడచ్చు. సీట్ బెల్ట్‌కు.. ఎయిర్ బ్యాగ్స్‌కు లింకు..! - పిన్నమనేని కారు ప్రమాదంలో తెరుచుకోని ఎయిర్‌బ్యాగ్స్ సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ప్రమాదానికి గురైన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం మిత్సుబిషి కంపెనీ పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్‌కు చెందింది. ఈ వాహనానికి ముందు సీట్లకు ఎదురుగా రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు తక్షణం అవి తెరుచుకుని డ్రైవర్‌తో పాటు పక్క సీటులో కూర్చున్న వారికీ ముప్పును తగ్గిస్తాయి. అయితే పిన్నమనేని ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనా ఇవి తెరుచుకోలేదని, దీనికి కారణం ఏమిటనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వీవీ చలపతి ‘సాక్షి’కి తెలిపారు. వాహనరంగ నిపుణులు మాత్రం లేటెస్ట్ మోడల్‌కు చెందిన ఈ తరహా కారుల్లో డ్రైవర్ సీటుబెల్ట్ ధరిస్తేనే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయ్యేలా తయారీదారులు రూపొందించారని చెప్తున్నారు. పిన్నమనేని డ్రైవర్ ‘బెల్ట్’ పెట్టుకోకపోవడంతో... పిన్నమనేని ప్రయాణిస్తున్న కారులో ఆయన డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. ఆయన సీట్ బెల్ట్ ధరించగా.. డ్రైవర్ స్వామిదాసుతో పాటు వెనుక కూర్చున్న భార్య సాహిత్యవాణి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్లో సీట్ బెల్ట్‌కు, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు ఉంటుందని వాహనరంగ నిపుణులు చెప్తున్నారు. డ్రైవింగ్సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుందని అంటున్నారు. స్వామిదాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే.. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణ నషం్ట తగ్గేదని వ్యాఖ్యానిస్తున్నారు. వాహనానికి సంబంధించి ఎయిర్‌బ్యాగ్స్ అంశాన్ని నిత్యం పరీక్షించుకోవడం కూడా ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. -
పిన్నమనేని భార్య మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాద ఘటనపై వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పిన్నమనేని సతీమణి సత్యవాణి, డ్రైవర్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పిన్నమనేని త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణితోపాటు కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న పిన్నమనేని కారు పహాడీ షరీఫ్ వద్ద బోల్తాకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పిన్నమనేనిని శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. దీనిపై ఔటర్ రింగ్ రోడ్డు ఉద్యోగులను సంప్రదించగా.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందని, కారు వెనుక టైరు బాగా దెబ్బ తినడంతో అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొని తిరగబడిందని చెప్పారు. దాంతో ముందుసీట్లో కూర్చున్న డ్రైవర్ దాసు, భార్య సత్యవాణి బయటకు పడిపోయారని, కారు అలాగే 50 అడుగుల పాటు ఈడ్చుకుంటూ వెళ్లిపోయిందని అన్నారు. రోడ్డు మీద పడిపోవడంతో తలకు గాయాలై సత్యవాణి, డ్రైవర్ వాసు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు తిరగబడిన కారు -
గుడివాడ టీడీపీలో కోల్డ్‌వార్
గుడివాడ : గుడివాడ నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై కోల్డ్‌వార్ జరుగుతోంది. గుడివాడలో పార్టీ గెలవకపోయినా పార్టీ అధికారాన్ని పంచుకునే విషయంలో రావి అనుచరులకు ఉన్న ప్రాధాన్యం పిన్నమనేని అనుచరులకు ఇవ్వటం లేదనే విమర్శ ఆ వర్గం నుంచి వినిపిస్తోంది. కలిసి పనిచేసినా... గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నికల ముందు తన అనుచరులతో కలసి టీడీపీలో చేరారు. ఇద్దరూ కలిసి పనిచేసి పార్టీని గుడివాడలో గెలిపించాల్సిందిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇరు వర్గాలు కలిసి పనిచేసినా గుడివాడలో పార్టీ విజయం సాధించలేక పోయింది. అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా గుడివాడలో టీడీపీని గెలిపించలేకపోయారు. అయితే అధికారాన్ని పంచుకునే విషయంలో మాత్రం ఈ రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. కమిటీల్లో దక్కని చోటు... ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయంలో భాగంగా సామాజిక పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో జన్మభూమి కమిటీలను వేశారు. ఈ కమిటీల్లో పిన్నమనేని అనుచరులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పిన్నమనేనికి మంచి పట్టు ఉంది. పిన్నమనేని వెంకటేశ్వరరావు సోదరుని కుమారుడు పిన్నమనేని బాబ్జి అన్ని ఎన్నికల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయినా తమకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటంపై వీరు గుర్రుగా ఉన్నారు. ప్రత్తిపాటికి ఫిర్యాదు.. ఇటీవల గుడివాడకు వచ్చిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై పిన్నమనేని బాబ్జి, ఆయన అనుచరులు ఫిర్యాదు కూడా చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు సమర్థవంతంగా చేయటం లేదని, పిన్నమనేని కుటుంబానికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని కోరారు. గుడివాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టే విషయంలో వారం రోజులుగా పార్టీలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నా రావి సమర్థవంతమైన నిర్ణయం తీసుకోలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు వచ్చి బహిరంగ విమర్శలు చేసుకోవద్దని ఇరు వర్గాల వారికి హెచ్చరికలు జారీ చేయటంతో కొంతమేరకు అడ్డుకట్ట పడింది. నీరు-చెట్టు పథకం పనులకు సంబంధించి జన్మభూమి కమిటీ పేరుతో తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఈ పనులను రావి వర్గానికే కేటాయించటంతో పిన్నమనేని వర్గం గుర్రుగా ఉంది. ప్రస్తుత అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవిని పిన్నమనేని బాబ్జికి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుందని సమాచారం. అదే జరిగితే పాత టీడీపీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తుంది. -
'నాబార్డ్ నుంచి రాయితీలు రావడం కష్టమే'
ఒంగోలు: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆప్కాబ్‌కు నాబార్డు నుంచి రాయితీలు రావటం కష్టంగా మారిందని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఒంగోలులో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం సదస్సులో పిన్నమనేని మాట్లాడుతూ... ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ ఆప్కాబ్‌కు ఉంటే నాబార్డు నుంచి రాయితీలు వస్తాయని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రూ.7 వేల కోట్లు, తెలంగాణలో రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల టర్నోవర్ మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో రెండు రాష్ట్రాలకు నాబార్డు నుంచి రాయితీలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్త కమిటీలను ఎన్నుకోనున్నారు. -
అప్కాబ్ చైర్మన్‌గా పిన్నమనేని నామినేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాకార బ్యాంక్ (అప్కాబ్) చైర్మన్ పదవికి మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో అప్కాబ్ ప్రధాన కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. ఉపాధ్యక్ష పదవికి వరుపుల రాజా నామినేషన్ వేశారు. అయితే వీరిద్దరి ఎన్నిక లాంఛన ప్రాయమేనని సమాచారం. అప్కాబ్ ఎన్నికలపై సీఎం చంద్రబాబు గురువారం పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అప్కాబ్ ఎన్నికల బాధ్యతను అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవుకు బాబు అప్పగించారు. -
ఆప్కాబ్ చైర్మన్‌గా పిన్నమనేని!
సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) నూతన పాలక మండలి ఎన్నిక శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడ ఆప్కాబ్ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికల అధికారి తేజోమయి ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుత డెరైక్టర్లలో ఎక్కువ మంది టీడీపీ వారే ఉండడంతో ఆ పార్టీకి చెందిన డెరైక్టరే అధ్యక్ష పోస్టుకు ఎన్నికయ్యే అవకాశముంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధ్యక్ష పదవికి కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నిక కానున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. గుంటూరుకు చెందిన పార్టీ సీనియర్ నేత ముమ్మనేని వెంకటసుబ్బయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఏమిటీ శిక్ష?: ముమ్మనేని ఆవేదన పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో వెనకబడిపోయానని, నిజంగా చెప్పాలంటే తాను రాజకీయంగా చచ్చిపోయినట్టేనని ఆప్కాబ్ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన ముమ్మనేని వెంకటసుబ్బయ్య తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
పిన్నమనేని రాజకీయ పితలాటకం!
నాటి వైభవం కనుమరుగు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెబుతూ ప్రకటన టీడీపీలో ద్వితీయశ్రేణి ప్రచార కార్యకర్తగా చలామణి కొడాలి నానిని ఎదుర్కోలేకే...! గుడివాడ, న్యూస్‌లైన్ : జిల్లానే కాదు రాష్ట్రంలోనే పిన్నమనేని కుటుంబమంటే ఓ ప్రత్యేకత ఉంది. అయితే పిన్నమనేని కోటేశ్వరరావు మరణానంతరం ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలనే నిర్ణయం తీసుకున్నారు. తానెప్పటికీ కాంగ్రెస్‌వాదినేనని చెప్పుకున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇటీవల టీడీపీ గూటికి చేరి గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుక ప్రచార కర్తగా మారాడు. గుడివాడలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)ని రాజకీయంగా ఎదరుర్కోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడనే పెద్దల సామెతను రావి, పిన్నమనేని నిజం చేశారని చెబుతున్నారు. చివరికి స్వగ్రామంలోనూ ఓటమే.... గతపదేళ్లుగా జరిగిన పలు ఎన్నికల్లో పిన్నమనేని వెంకటేశ్వరావు కొడాలి నాని రాజకీయ చతురత ముందు ఓటమి చెందుతూనే ఉన్నారు. పిన్నమనేని కుటుంబానికి బలంగా ఉండే నందివాడ , గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో గత మండల పరిషత్ ఎన్నికల్లో కొడాలి నాని అనుచరులు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పిన్నమనేని సొంత మండలం నందివాడ మండలంలోనూ మెజార్టీ దక్కలేదు. దీనికి తోడు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పిన్నమనేని స్వగ్రామం రుద్రపాకలో కొడాలి నాని నాయకత్వంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన దళిత మహిళ విజయఢంకా మోగించింది. ఇదీ పిన్నమనేని కుటుంబ రాజకీయ ప్రస్థానం... 1957లో రాజకీయాల్లోకి వచ్చిన తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు అత్యధిక కాలం జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ముసలం పుట్టినా పిన్నమనేని కోటేశ్వరావు మాత్రమే పరిష్కరించగలరనే నమ్మకం ఆ పార్టీ ప్రధాన నేతల్లో ఉండేది. ఆయన అనంతరం పిన్నమనేని వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చి ముదినేపల్లి నుంచి పోటీ చేసి మూడుసార్లు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. నియోజక వర్గాల పునర్విభజనతో ముదినేపల్లి నియోజకవర్గం కనుమరుగైంది. దీంతో 2009లో గుడివాడనుంచి పోటీ చేసిన పిన్నమనేని కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చేతిలో 17635ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో జరిగిన విభజన పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్‌పార్టీ కనుమరుగు కావడంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికినట్లు ప్రకటించారు. అయితే కొడాలి నానిని ఓడించాలనే సంకల్పంతో టీడీపీ పంచన చేరి గుడివాడ టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావును గెలి పించాలని కోరుతూ ప్రచారకర్తగా వ్యవ హరిస్తున్నారు ఒకప్పటి వారి కుటుంబ రాజకీయాలను గుర్తెరిగిన గ్రామీణులు ఆయన చర్యలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.