గుడివాడ : గుడివాడ నియోజకవర్గ టీడీపీలో ముసలం మొదలైంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై కోల్డ్‌వార్ జరుగుతోంది. గుడివాడలో పార్టీ గెలవకపోయినా పార్టీ అధికారాన్ని పంచుకునే విషయంలో రావి అనుచరులకు ఉన్న ప్రాధాన్యం పిన్నమనేని అనుచరులకు ఇవ్వటం లేదనే విమర్శ ఆ వర్గం నుంచి వినిపిస్తోంది.
కలిసి పనిచేసినా...
గుడివాడ నియోజకవర్గంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నికల ముందు తన అనుచరులతో కలసి టీడీపీలో చేరారు. ఇద్దరూ కలిసి పనిచేసి పార్టీని గుడివాడలో గెలిపించాల్సిందిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇరు వర్గాలు కలిసి పనిచేసినా గుడివాడలో పార్టీ విజయం సాధించలేక పోయింది. అనంతరం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా గుడివాడలో టీడీపీని గెలిపించలేకపోయారు. అయితే అధికారాన్ని పంచుకునే విషయంలో మాత్రం ఈ రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది.
కమిటీల్లో దక్కని చోటు...
ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయంలో భాగంగా సామాజిక పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో జన్మభూమి కమిటీలను వేశారు. ఈ కమిటీల్లో పిన్నమనేని అనుచరులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పిన్నమనేనికి మంచి పట్టు ఉంది. పిన్నమనేని వెంకటేశ్వరరావు సోదరుని కుమారుడు పిన్నమనేని బాబ్జి అన్ని ఎన్నికల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయినా తమకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటంపై వీరు గుర్రుగా ఉన్నారు.
ప్రత్తిపాటికి ఫిర్యాదు..
ఇటీవల గుడివాడకు వచ్చిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై పిన్నమనేని బాబ్జి, ఆయన అనుచరులు ఫిర్యాదు కూడా చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు సమర్థవంతంగా చేయటం లేదని, పిన్నమనేని కుటుంబానికి ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని కోరారు. గుడివాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టే విషయంలో వారం రోజులుగా పార్టీలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నా రావి సమర్థవంతమైన నిర్ణయం తీసుకోలేక పోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీ జిల్లా అధ్యక్షుడు వచ్చి బహిరంగ విమర్శలు చేసుకోవద్దని ఇరు వర్గాల వారికి హెచ్చరికలు జారీ చేయటంతో కొంతమేరకు అడ్డుకట్ట పడింది. నీరు-చెట్టు పథకం పనులకు సంబంధించి జన్మభూమి కమిటీ పేరుతో తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఈ పనులను రావి వర్గానికే కేటాయించటంతో పిన్నమనేని వర్గం గుర్రుగా ఉంది. ప్రస్తుత అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవిని పిన్నమనేని బాబ్జికి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుందని సమాచారం. అదే జరిగితే పాత టీడీపీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తుంది.
గుడివాడ టీడీపీలో కోల్డ్‌వార్
Published Sun, Aug 9 2015 1:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM
Advertisement
Advertisement