సీట్‌బెల్ట్ వాడకే మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధే అనేక మంది పాలిట శాపంగా మారుతోంది. సీట్ బెల్ట్ వినియోగించని కారణంగానే ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని భార్య , డ్రైవర్ మృతిచెందారు. పిన్నమనేని సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్‌సీపీ నేత శోభానాగిరెడ్డి మృత్యువాతపడటానికీ సీట్ బె ల్ట్ ధరించకపోవడమే కారణం. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి కారు ఔటర్‌పై ప్రమాదానికి గురైనప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు మరణించినా..సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ఆరవ్‌రెడ్డి బయటపడ్డారు.
సీట్ బెల్ట్ ఎందుకంటే..:కారులో ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో వారూ ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. దీంతో ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లు తదితరాలను వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీ కొడితే.. అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఇలా పడటం వల్ల తీవ్రగాయాలపాలై మృత్యువాతపడుతుంటారు. అదే సీట్ బెల్ట్ వాడితే పెద్ద కుదుపునకు మాత్రమే గురై గాయాలతో బయటపడచ్చు.
సీట్ బెల్ట్‌కు.. ఎయిర్ బ్యాగ్స్‌కు లింకు..!
- పిన్నమనేని కారు ప్రమాదంలో తెరుచుకోని ఎయిర్‌బ్యాగ్స్
సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ప్రమాదానికి గురైన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం మిత్సుబిషి కంపెనీ పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్‌కు చెందింది. ఈ వాహనానికి ముందు సీట్లకు ఎదురుగా రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు తక్షణం అవి తెరుచుకుని డ్రైవర్‌తో పాటు పక్క సీటులో కూర్చున్న వారికీ ముప్పును తగ్గిస్తాయి. అయితే పిన్నమనేని ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనా ఇవి తెరుచుకోలేదని, దీనికి కారణం ఏమిటనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వీవీ చలపతి ‘సాక్షి’కి తెలిపారు. వాహనరంగ నిపుణులు మాత్రం లేటెస్ట్ మోడల్‌కు చెందిన ఈ తరహా కారుల్లో డ్రైవర్ సీటుబెల్ట్ ధరిస్తేనే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయ్యేలా తయారీదారులు రూపొందించారని చెప్తున్నారు.
పిన్నమనేని డ్రైవర్ ‘బెల్ట్’ పెట్టుకోకపోవడంతో...
పిన్నమనేని ప్రయాణిస్తున్న కారులో ఆయన డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. ఆయన సీట్ బెల్ట్ ధరించగా.. డ్రైవర్ స్వామిదాసుతో పాటు వెనుక కూర్చున్న భార్య సాహిత్యవాణి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్‌లో సీట్ బెల్ట్‌కు, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు ఉంటుందని వాహనరంగ నిపుణులు చెప్తున్నారు. డ్రైవింగ్‌సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుందని అంటున్నారు. స్వామిదాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే.. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణ నషం్ట తగ్గేదని వ్యాఖ్యానిస్తున్నారు. వాహనానికి సంబంధించి ఎయిర్‌బ్యాగ్స్ అంశాన్ని నిత్యం పరీక్షించుకోవడం కూడా ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు.