‘సిటీ’పై సాగుతున్న దోస్తీ కుస్తీ
‘సిటీ’పై సాగుతున్న దోస్తీ కుస్తీ
Published Sun, Apr 13 2014 1:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
సాక్షి, రాజమండ్రి :పొత్తులో భాగంగా టీడీపీ.. బీజేపీకి విడిచి పెట్టిందంటున్న రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం రెండుపార్టీల నడుమా చెలిమి ఎలా అఘోరించనుందో అంచనా వేసేందుకు చక్కని ఉదాహరణ. అసలు బీజేపీకి విడిచిపెట్టేది రాజమండ్రి సిటీనా, రూరలా అన్న దానిపై టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకూ స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. అయినా సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న టీడీపీనేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎలాగైనా తన అభీష్టం నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ తన ప్రయత్నం విఫలమై.. సిటీ నియోజకవర్గం బీజేపీకే ఖాయమైనా తన వర్గంతో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయించేందుకు గోరంట్ల సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతల్లో గుబులు కమ్ముకుంది.ఓవైపు గోరంట్ల నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి చంద్రబాబు వద్ద ప్రయత్నాలు చేసుకుంటుండగా.. మరోవైపు బీజేపీ నేతలు రాజమండ్రి సిటీ స్థానం తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. గోరంట్లకు చెక్ పెట్టేందుకు టీడీపీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్, సీనియర్ నేత గన్ని కృష్ణ సిటీని బీజేపీకే విడిచి పెట్టాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. ఒకవేళ వారిదే పైచేయి అయితే రూరల్ సీటైనా దక్కించుకోవాలని గోరంట్ల ఆశిస్తున్నారు. టీడీపీలో నెలకొన్న వర్గపోరుతో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
‘సోము’ కూడా హైదరాబాద్‌లోనే..
కాగా రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు తొలిజాబితాలోనే టిక్కెట్ ఖరారు చేసిన చంద్రబాబు రాజమండ్రి సిటీ, రూరల్ అభ్యర్థులెవరో రెండో జాబితాలో కూడా ప్రకటించలేదు. రెండింటిలో దేనిని తమకు విడిచి పెట్టారో తేలనందున ఆఖరి క్షణంలో మార్పులుంటాయేమోనని బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా రెండు పార్టీల సీటు పంచాయితీ కొలిక్కిరాక కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారు. రాజమండ్రి సిటీ స్థానం బీజేపీకే ఇస్తే సహాయ నిరాకరణ చేయాలని గోరంట్ల వర్గం ఆలోచిస్తున్నట్టు సమాచారం. గెలిచే సీటును బీజేపీకి అప్పగించవద్దన్న తన సూచనను పరిగణనలోకి తీసుకోకపోతే.. సత్తా చూపాలని తన వర్గీయులకు గోరంట్ల సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గోరంట్ల అనుకున్నది సాధించుకోగలిగి, తమకు రూరల్ సీటు ఇస్తే టీడీపీకీ, తమ పార్టీకీ పెద్దగా పట్టులేని ఆ నియోజకవర్గంలో ఓటమి తప్పదని బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. దీంతో సిటీ సీటు వదులుకోకూడదని భావిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ నేతలతో ఈ మేరకు సంప్రదింపులు సాగిస్తున్నట్టు తెలిసింది. మొత్తమ్మీద సిటీ పీటముడి చివరికి ఎవరికి అనుకూలంగా విడుతుందో వేచి చూడాల్సిందే.
Advertisement