రాయదుర్గం, న్యూస్‌లైన్ : ‘రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న నీకు ఘోర పరాజయం తప్పదు. అప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జేసీకి సవాల్ విసిరారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని పదవులూ అనుభవించిన జేసీ దివాకర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయకుడినే ఓడించి టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా మిగలరని, నేనొక్కడినే కాంగ్రెస్‌లో ఉంటానని గొప్పలు చెప్పిన జేసీ.. అందరికన్నా ముందే పార్టీని ఎందుకు వీడారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
రాయదుర్గం నియోజకవర్గంలో అల్లుడికి టికెట్ కోసం నీచరాజకీయాలు చేసింది నీవు కాదా?
గతంలో చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టిన నీవు.. అదే నోటితో బాబును పొగడడం నీ అవకాశవాదానికి నిదర్శం కాదా?
సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో జగన్‌ను పొగిడిన జేసీ.. వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో జగన్‌ను తిట్టడం మొదలు పెట్టారు. చంద్రబాబుకు కన్యాశుల్కంలా ముడుపులు అప్పజెప్పి టీడీపీలో చేరి నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
తన కారు డ్రైవర్, వంట మనిషి పేర్ల మీద వేల ఎకరాల గనుల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకున్న మాట వాస్తవం కాదా అన్న విషయాన్ని ప్రజలకు తెలపాలి.
తాడిపత్రిలోని సిమెంట్ ఫ్యాక్టరీల్లో షేర్లు, బినామీ పేర్ల మీద భాగాలు పెట్టుకున్న విషయం గురించి ఏం చెబుతారు?
గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని విలువైన భూములను కబ్జాచేసి, లబ్ధిపొంది.. నేడు అతడిపై కేసులు నమోదు చేయించిన నీచ సంస్కృతి ఎవరిది? రాయదుర్గంలో కూడా అలాంటి పరిస్థితిని కల్పించడానికి వస్తున్నారన్న విషయాన్ని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకున్నారు.
150 మంది హత్యలకు జేసీ కారకుడని సీనియర్ టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు విమర్శిస్తే ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదో జేసీ ప్రజలకు వివరణ ఇవ్వాలి.
రాయదుర్గం నియోకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీ అల్లుడు దీపక్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు, ఆదాయానికి పొంతన లేని విషయం ప్రజలకు తెలుసు. ఆ ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలి.
నీచ రాజకీయాలు చేస్తూ సత్యహరిశ్చంద్రుడి మనవడిలా జేసీ మాట్లాడడం సిగ్గుచేటు. మీ ధన దాహం, దౌర్జన్యాలు, రక్తదాహం, భూ దాహం ఎప్పుడు తీరుతుందో చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. నీలా నీచ రాజకీయాలు చేయడం మా వల్ల కాదు. జేసీ లాంటి వ్యక్తులను ఎన్నికల్లో ఘోరంగా ఓడించడానికి ప్రజలంతా నడుం బిగించి సిద్ధంగా ఉన్నారు.
రాజకీయ సన్యాసానికి సిద్ధమా?
Published Sun, Apr 6 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
Advertisement
Advertisement