ఫలితాల మేళా
- 12న మున్సిపల్ ఫలితాలు
- మరుసటిరోజే స్థానిక సంస్థల వంతు
- 16న తేలనున్న సార్వత్రిక విజేతలు
- ఆ తర్వాత పదో తరగతి పరీక్షల ఫలితాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒకటి.. రెండు... మూడు... ఏడు... హమ్మయ్యా...! సీమాంధ్రాలో ఎన్నిక సంగ్రామం ముగిసింది. ఎనిమిదో తేదీ కూడా వచ్చేసింది.. ఈ రాత్రికి కళ్లు మూసుకుంటే తొమ్మిది... ఇంకో రెండు రోజులు గడిస్తే... ఫలితాల జాతరే జాతర. వార్డు కౌన్సిలర్ మొదలుకుని పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈ నెలలోనే తేలనుంది. దీంతో మే నేల ఫలితాల మేళాగా మారింది. మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు, పదో తరగతి, డిగ్రీ పరీక్షల ఫలితాలు కూడా మే నెలలోనే వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడగా... పదో తరగతి, డిగ్రీ విద్యార్థులు ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజకీయ నాయకులైతే తమ భవితవ్యం తెలిపే ఫలితాలకోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
ఫలితాల జాతర...
జిల్లాలోని నాలుగు మున్సిపాలీటీలు, రెండు నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్ 2న ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఆరోజే ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల ప్రకటిస్తే వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు ఫలితాల విడుదలపై స్టే ఇచ్చింది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మే 12వ తేదీన ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. దీంతో అభ్యర్థులు 76 రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇక జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకు, 664 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మొదటి విడత కింద 24 మండలాల్లో ఏప్రిల్ 6న, మిగిలిన మండలాల్లో రెండవ విడత కింద ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. మే 13న ఓట్లు లెక్కించి అదేరోజు స్థానిక సంస్థల ఫలితాలను ప్రకటించాలని కోర్టు చెప్పడంతో దాదాపు 35 రోజుల నుంచి అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు.
16 కోసం నిరీక్షణ...
ఇక జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 16వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదే రోజు విజేతలను ప్రకటిస్తారు.
త్వరలోనే ‘పది’ ఫలితాలు..
జిల్లాలో 47 వేల మంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలు రాశారు. మార్చి మాసంలో ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 6 వరకు కొనసాగాయి. పరీక్ష పేపర్లు మూల్యాంకనం కూడా ముగిసింది. ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకటి, రెండు రోజుల తర్వాత పదో తరగతి పరీక్ష ఫలితాలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.