పీలేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఘన విజయం వెనుక మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కీలకమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ సీఎం కిరణ్‌ను పీలేరులో ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెద్దిరెడ్డి పావులు కదిపారు.
ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. దీంతో చింతల 15,250 ఓట్ల ఆధిక్యతతో జేఎస్పీ అభ్యర్థి నల్లారి కిషన్‌కుమార్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు.
నల్లారి కుటుంబానికి గుర్రంకొండ మండలంలో అత్యంత విధేయుడు, మైనారిటీల్లో బలమైన నేత అయిన జమీర్‌ఆలీఖాన్‌ను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవడంతో గుర్రంకొండలో ఆధిక్యతను చాటారు. అలాగే కేవీపల్లె మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎం.వెంకట్రమణారెడ్డి మాజీ సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు, మండలంలో ప్రజా బలం ఉన్న నేత. ఆయన్ను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో కిరణ్ కోటకు బీటలు వారాయి.
అంతటితో ఆగని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కిరణ్‌కు అత్యంత సన్నిహితుడైన గుడిబండ రవికుమార్‌రెడ్డిని సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారు. పీలేరు మండలంలో మాజీ ఎంపీపీ ఎం.వెంకట్రమణారెడ్డితోపాటు జాండ్ల, వేపులబైలు సర్పం చ్‌లు శ్రీనివాసులు, ఆదినారాయణలను పార్టీలో చేర్చుకున్నారు. వేపులబైలు పంచాయతీలో కీలకమైన వ్యక్తి అయిన భవనం వెంకట్రామిరెడ్డి మరికొంతమంది ప్రముఖలను పార్టీలో చేర్చుకోవడం గమనార్హం.
పీలేరు పట్టణంలో అత్యంత ప్రజాదరణ కల్గివున్న మాజీ సర్పంచ్ ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి సూచనలు, ఆదేశాల మేరకు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి పార్టీ బలోపేతం కోసం పట్టణంలో శక్తివంచనలేకుండా కృషి చేశారు. మూడన్నరేళ్లు అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మాజీ సీఎం కిరణ్ విఫలమయ్యారని పెద్దఎత్తున ప్రజలకు వివరించి అత్యధికంగా ఓట్లు రాబట్టడంలో సఫలీకృతులయ్యారు.
మరోవైపు నియోజకవర్గ పరిధిలోని కలికిరి మినహా ఐదు మండలాల్లో బలమైన పార్టీ కేడర్ ఉండడం గెలుపునకు ప్రధాన కారణమైంది. ఇటీవల వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంతోపాటు జెడ్పీటీసీల్లో పీలేరు, కేవీపల్లె, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో విజేతలుగా నిలిచారు. మాజీ సీఎం కిరణ్ తన సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా పెద్దిరెడ్డి ఎత్తుల ముందు చిత్తుకాక తప్పలేదు. అలాగే టీడీపీ మూడో స్థానానికే పరిమితం కావడం, కాంగ్రెస్ గల్లంతు కావడంతో చింతల గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేకపోయింది.
పీలేరు గెలుపులో పెద్దిరెడ్డి కీలకపాత్ర
Published Sat, May 17 2014 4:35 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement