
దక్షిణాఫ్రికా ఎన్నికల్లో ఏఎన్‌సీ ఘనవిజయం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఏఎన్‌సీ) ఘన విజయం సాధించింది. అయితే అవినీతి ఆరోపణలు, ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, నిరుద్యోగం వంటి అంశాల కారణంగా ఆ పార్టీ మెజారిటీ గతంతో పోలిస్తే ఈసారి కాస్త తగ్గింది.శుక్రవారం కడపటి వార్తలు అందేసరికి 99 శాతం ఫలితాలు వెలువడగా.. ఏఎన్‌సీ 62.2 శాతం ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ 66 శాతం ఓట్లు సాధించగా..
ఈసారి ఆధిక్యం సుమారు 4 శాతం తగ్గింది. ఏఎన్‌సీ విజయంతో దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడిగా 72 ఏళ్ల జాకబ్ జుమా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు ప్రతిపక్ష డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి 22.2 శాతం ఓట్లు దక్కించుకుంది. దక్షిణాఫ్రికా మాజీ దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణానంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవే.