పిచ్చి ప్రేలాపనలు ఆపండి! | stop Mad rave Whoa! | Sakshi
Sakshi News home page

పిచ్చి ప్రేలాపనలు ఆపండి!

Published Sat, Apr 12 2014 3:33 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

పిచ్చి ప్రేలాపనలు ఆపండి! - Sakshi

పిచ్చి ప్రేలాపనలు ఆపండి!

టీడీపీపై ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ
 
‘టైటానియం’పై డొంక తిరుగుడు  కథనాలెందుకు?
‘సాక్షి’ విసిరిన సవాలును స్వీకరించండి
దమ్ముంటే విజయమ్మ పిటిషన్‌పై విచారణకు రండి
చంద్రబాబుపై సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడంలేదు

 
 హైదరాబాద్: టైటానియం ఖనిజం కేసులో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఈ కేసుకు సంబంధించి తోక పత్రికల్లో డొంక తిరుగుడు కథనాలు రావడం, వెంటనే టీడీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఈ కేసుతో తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సాక్షి పత్రిక బహిరంగ సవాలు విసిరింది. ఈనాడుకు తమ పత్రికను ధారాదత్తం చేస్తామని, నిరూపించకపోతే ఈనాడును వదిలేస్తారా? అని సవాల్ విసిరినా మౌనంగా ఉండిపోయారు.

సవాల్‌కు స్పందించకుండా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరించారు. నిస్సిగ్గుగా మళ్లీ అనేక కథనాలు రాస్తున్నారు. ఆ కథనాలు పట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌కు కళ్లులేవా అని చెబుతున్న టీడీపీ నేత సోమిరెడ్డికి కళ్లు మూసుకుపోయాయని ధ్వజమెత్తారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నోరకాలుగా కుట్రపన్నుతున్నారు. 16 నెలలు జైల్లో పెట్టించినా.. మేం ఓపికతో ఉన్నాం.. చట్టాన్ని గౌరవించాం. కాబట్టే గత ఉప ఎన్నికల్లో ప్రజలు మావైపే నిలిచారు. ఇప్పుడు మీరు, మీ తోక పత్రికలు పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే ఊరుకునేది లేదు. ప్రజలు అంతా గమనిస్తున్నారు’’ అని పద్మ హెచ్చరించారు.

 కాంగ్రెస్ పార్టీతో బాబుకు డీల్ కుదరబట్టే..

చంద్రబాబునాయుడిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడంలేదని పద్మ ప్రశ్నించారు. ఐఎంజీ భూముల వ్యవహారంతోపాటు పలు అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిటిషన్ వేస్తే ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకోబట్టే విచారణ విషయం పక్కకుపోయిందన్నారు. దమ్ముంటే విజయమ్మ వేసిన పిటిషన్‌పై నిలబడాలని, సీబీఐ విచారణను ఆహ్వానించాలని సవాలు విసిరారు. కోర్టుల్ని అడ్డం పెట్టుకుని కారుకూతలు కూస్తున్నారన్నారు.

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన, పదేళ్ల ప్రధాన ప్రతిపక్ష నేతగా పోషించిన సమయంలో ఆయన ఎక్కడెక్కడకు వెళ్లారో విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాస్‌పోర్ట్‌లు పరిశీలిస్తే బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు తన అవినీతి చరిత్ర బయటపడకుండా కాపాడుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని పద్మ ఎద్దేవా చేశారు. ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేమని తెలిసే ఇలాంటి చౌకబారు విద్యలు ప్రదర్శిస్తున్నారన్నారని ఆమె విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement