
పచ్చనోట్ల పెళపెళ
అమలాపురం, న్యూస్‌లైన్ :ఎన్నికల్లో గెలవాలంటే పార్టీలకు అనుకూలంగా గాలి వీయాలి. లేదా పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత ప్రతిష్టతో గెలిచే సమర్థవంతమైన నాయకుడై ఉండాలి. మరీ ఈ రెండూ లేని వారు ఏమి చేయాలి? డబ్బును నమ్ముకోవాలి. విచ్చలవిడిగా వెదజల్లాలి. వర్గాల వారీగా చిన్నా చితకా నాయకుల్ని చేరదీయాలి. వారి సాయంతో ఓటర్లను ప్రలోభపెట్టాలి. ఇది ఎంతోకొంత ఫలితమిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే దీన్నే ఫాలో అవుతున్నారు తెలుగుదేశం అభ్యర్థులు.
ఆయన టీడీపీ తరఫున అమలాపురం పార్లమెంట్ బరిలో నిలిచారు. అదే పార్టీ తరఫున ఒక డబ్బున్న నాయకుడు అసెంబ్లీకి పోటీపడుతున్నారు. పదవన్నది తమ వారసత్వంగా భావించి కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో దిగారు మరో యువరాజా వారు. వీరి పార్టీలకు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదు. వీరికి వ్యక్తిగతంగా గుర్తింపు లేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గెలుస్తామనే నమ్మకం అసలే లేదు. దీంతో వీరు డబ్బు పంపకంపైనే ఆశ పెట్టుకున్నారు. పోలింగ్‌కు రెండురోజుల ముందు ఓటర్లను పెద్దఎత్తున కొనుగోలు చేయాలని సదరు అభ్యర్థులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ప్రచారానికి పెద్దగా నిధులు ఖర్చుపెట్టకుండా ఓట్లు కొల్లగొట్టాలని వ్యూహ రచనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి గ్రామాల్లో ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అలాగే కుల సంఘాల పెద్దలను, యువజన సంఘాలను బృందాలుగా కొనుగోలు చేస్తున్నారు.
పార్లమెంట్ అభ్యర్థి ప్రచారాన్ని పక్కనబెట్టి నాయకుల కొనుగోలుపైనే దృష్టి సారిస్తున్నాడు. ద్వితీయశ్రేణి నేతలనే కాకుండా కోనసీమలో ఒక రిజర్వ్ నియోజకవర్గం నుంచి స్వతంత్రునిగా పోటీచేస్తున్న బలమైన అభ్యర్థిని సైతం ఇదేరీతిలో కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక పోలింగ్‌కు ముందు పెద్ద ఎత్తున ఓటర్లను కొనుగోలు చేసేందుకు భారీగా నిధులు అందుబాటులో ఉంచారు. పార్లమెంట్ పరిధిలో పోటీలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల ద్వారా ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల చొప్పున వెచ్చించి కొనుగోలు చేయనున్నట్టు తాజా సమాచారం. ఇదే పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో ఉన్న తీర ప్రాంత అసెంబ్లీ అభ్యర్థి సైతం ఇదే పద్దతి అవలంబిస్తున్నారు.
తన నియోజకవర్గంలో ప్రధాన సామాజికవర్గం ఓట్ల కొనుగోలుకు ఆ వర్గంలో పెద్దలను తమ వైపు తిప్పుకున్నారు. తొలుత గెలుస్తామనుకున్న స్థానంలో వ్యతిరేక పవనాలు వీస్తుండడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పుంజుకోవడంతో సదరు అభ్యర్థి డబ్బును వెదజల్లుతున్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి నాయకునికి రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.700 వరకు ఇవ్వాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. తీర ప్రాంతంలో అత్యధిక శాతం ఉన్న మత్స్యకార ఓట్ల కొనుగోలుకు పెత్తందార్లను సిద్ధం చేసుకుంటున్నారు. మహిళా సంఘాలు, పీఎంపీలు, ఆర్‌ఎంపీలు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రా సంఘాల యానిమేటర్లలో కొంతమందిని కొనుగోలు చేయడం పూర్తి చేశారు. వీరి ద్వారా ఆయా సంఘాల్లో సభ్యుల ఓటర్లను ఆకర్షించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో సుమారు 25 వేల ఓట్లను గుర్తించి ఓటుకు రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేయనున్నట్టు సమాచారం.
కొత్తగా వచ్చిన పార్టీ నుంచి కోనసీమలో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న యువరాజు సైతం డబ్బునే నమ్ముకుని రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. తొలుత యువజన, కుల సంఘాలపై దృష్టి పెట్టాడు. మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్నవారికి కూడా ఖర్చులకు ఉంచండంటూ రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తున్నారు. ఒక మోస్తరు నాయకుడైతే తనకు మద్దతు ఇస్తే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తున్నారు. ఎన్నికల్లో తాను గెలవకున్నా తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఒక్కొక్క ఓటరుకు రూ.500ల వరకు పంచి ఓట్లలో చీలిక తీసుకురావాలని భావిస్తున్నారు. ఇలా వీరంతా ప్రజాబలం కాన్న.. ధనబలాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయడం ద్వారా విమర్శల పాలవుతున్నారు. ఓట్ల పండగను కాస్తా నోట్ల పండగగా మార్చివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.