
'దేశం' కోటకు బీటలు
బీజేపీతో పొత్తుపెట్టుకోవడం.. వలస నాయకుల చేరిక.. టిక్కెట్ల వ్యవహారం.. అనంతపురం జిల్లా టీడీపీలో ముసలం ఏర్పడింది.
అనంతపురం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉండేది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హిందూపురం నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఆ జిల్లాపై ఎక్కవ ప్రభావం చూపింది. కానీ చంద్రబాబు జమానాలో టీడీపీ పట్టు క్రమంగా సడలడం మొదలైంది. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా పరిణామాల నేపథ్యంలో దేశం కంచుకోటకు బీటలు బారుతున్నాయి.
బీజేపీతో పొత్తుపెట్టుకోవడం.. వలస నాయకుల చేరిక.. టిక్కెట్ల వ్యవహారం.. అనంత టీడీపీలో ముసలం ఏర్పడింది. అనంతపురం అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నాయకుడు ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు వద్దంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులుకు సీటు కేటాయించడంపై రాయదుర్గం టీడీపీ ఇంచార్జి దీపక్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ప్రభాకర్ చౌదరి, దీపక్ రెడ్డి పార్టీని వీడే యోచనలో ఉన్నారు. రాయదుర్గం, అనంతపురం నియోజకవర్గాలు రెండూ వైసీపీకి బలమైన నియోజకవర్గాలు. ఉప ఎన్నికల్లో ఈ రెండు చోట్లా వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం.
ఇటీవల టీడీపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డిది మరో సంకట పరిస్థతి. (చదవండి: ఓడిపోయేదానికి నేనెందుకు పోటీ చేయాలి?) జేసీ రాకను జిల్లాకు చెందిన చాలామంది దేశం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. జేసీ సోదరులు ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారని, హంతకులంటూ గతంలో విమర్శించారు. చంద్రబాబు, దివాకర్ రెడ్డి ఒకర్నొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అయితే దివాకర్ రెడ్డి ఇటీవల సైకిలెక్కేశారు. చంద్రబాబు జేసీని తన పంచన చేర్చుకున్నా కార్యకర్తలు మద్దతిస్తారా అన్నది సందేహమే. దీనికి తోడు అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారని తెలుసుకున్న జేసీ రగిలిపోతున్నారు. ‘బీజేపీ వాళ్లకు కదిరి ఇమ్మని చెబితే అనంతపురం ఇస్తారా? పార్లమెంటుకు నేనెట్లా గెలవాలి? ఓడిపోయే దానికి నేనెందుకు పోటీచేయాలి' అంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అనంతపురం జిల్లాలో తాజా పరిణామాలు తెలుగుదేశంకు ప్రతికూలంగా మారాయి.