‘దేశం’ దొంగాట
సాక్షి ప్రతినిధి, గుంటూరు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వినూత్నమంటూ చేపట్టిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) ఆ పార్టీ నాయకులే అనుమానిస్తున్నారు. నిన్నటి వరకు టికెట్ తనకే వస్తుందని ఆశించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి పేర్లు ఇందులో లేకపోవడంతో నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి తెరలేపింది. తొలి నుంచి పార్టీకోసం పనిచేస్తున్న వారికి కాకుండా వలసవాదులకు, పారిశ్రామిక వేత్తలకు టికెట్లు కేటాయించేందుకు ఐవీఆర్‌ఎస్‌ను ఒక సాధనంగా టీడీపీ అధినాయకత్వం ఉపయోగించుకుంటుదన్న అనుమానాలు ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి తొలి నుంచి టికెట్లు ఆశిస్తున్న కోవెలమూడి నాని, పశ్చిమ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న యాగంటి దుర్గారావు పేర్లు సైతం లేవు. అలాగే కొత్తగా పారిశ్రామికవేత్త తులసి ప్రభుకు టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన పేరు సైతం ఇందులో లేదు.
ఆప్షన్లలో 1. మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, 3. వసంత కృష్ణ ప్రసాద్‌ల పేర్లు ఉన్నాయి.
బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మంగళగిరి టికెట్ ఆశిస్తున్నారు. ఇక వసంత కృష్ణప్రసాద్ ఇప్పటి వరకు పార్టీలోనే చేరలేదు. కేవలం రెండు, మూడు రోజుల నుంచి మాత్రమే ఆయన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అలాంటప్పుడు ముందుగానే ఐవీఆర్‌ఎస్‌లో వసంత పేరు ఎలా వస్తుందని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీలో చంద్రబాబు కోటరీగా వ్యవహరిస్తున్న ముఖ్యుల ద్వారా తన పేరును ఐవీఆర్‌ఎస్‌లో ఉండేలా చూసుకుంటున్నారని వారు అనుమానిస్తున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో గ్రంధి కాంతారావు, సినీనటుడు ఆలీ, మిట్టపల్లి ఉమామహేశ్వరరావు, దేవరశెట్టి సుబ్బారావుల పేర్లు ఐవీఆర్‌ఎస్ లో వస్తున్నాయి. ఇక్కడ కూడా అంతా ఒక పథకం ప్రకారమే ఆ పేర్లు వస్తున్నాయని విమర్శలు లేకపోలేదు.
టీడీపీ తరఫున పోటీ చేసేందుకు గ్రంధి కాంతారావు ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న ఎం.ఏ హకీమ్, అల్తాఫ్, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్‌ల పేర్లు ఇందులో లేవు.
ముందుగా టికెట్ కేటాయించిన వారి పేర్లే ఇందులో చేర్చుతున్నారు. అంటే తొలి నుంచి పార్టీకోసం పనిచేసిన వారిమీద అధినాయకత్వానికి నమ్మకం లేకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రలతో పాటు తెనాలిలో ఆలపాటి, నరసరావుపేట స్థానం కోడెలకు ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరిగింది.
అయితే ఐవీఆర్‌ఎస్‌లో సత్తెనపల్లి అభ్యర్థిగా కోడెల, వైవీ ఆంజనేయులు పేర్లు వస్తుండగా నియోజకవర్గం ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ పేరు లేదు.
రేపల్లెలో అనగాని సత్యప్రసాద్, దేవినేని మల్లిఖార్జునరావుల పేర్లు వస్తున్నాయి. వాస్తవానికి అనగాని పేరు ఖరారైనట్లు ప్రచారం చేసినా కొత్తగా పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దేవినేని పేరు రావడం పార్టీ వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి.
అనగానికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వారు ముందుగానే ఊహిస్తున్నారు.
బాపట్లలో చీరాల గోవర్ధనరెడ్డి, అన్నె సతీష్‌ల పేర్లు ఉన్నాయి.
మాచర్ల, గురజాల, మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో సైతం ఇదే తరహాగా ఉంది.
ముందే మ్యాచ్ ఫిక్సింగ్... చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్‌ఎస్ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్‌ను తలపిస్తుందంటూ ఆ పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థులను నేరుగా ప్రకటించినా తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రజాభి ప్రాయం అంటూ వారికి ఇష్టమొచ్చిన పేర్లు ముందుగానే చేర్చి వారిపేర్లు చెప్పే వారికే ఫోన్లు వచ్చేలా సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పార్టీలోకి పారిశ్రామికవేత్తలను, వలసవాదులను ఆహ్వానించేందుకు దీన్ని రాజమార్గంగా పార్టీ ఎంచుకుందనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.