Interactive Voice Response System
-
లోకేషా... తమాషా!
'పార్టీలో గాని, ప్రభుత్వంలోగాని ఎటువంటి పదవి ఆశించడం లేదు. ముందుగా నా పనితీరును అంచనా వేయండి'- ఇటీవల ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్య ఇది. లోకేష్ అస్పష్ట వైఖరికి ఈ వ్యాఖ్య అద్దం పడుతోంది. తన తండ్రి చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన పయనిస్తున్నట్టు కనబడుతోంది. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు చివరివరకు రెండు కళ్ల సిద్ధాంతం అవలంభిస్తూ వచ్చారు. విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో ఏదీ తేల్చి చెప్పకుండా ప్రజలను తికమక పెట్టారు. లోకేష్ కూడా తండ్రి దారిలోనే నడుస్తున్నట్టు కనబడుతోంది. తన తండ్రితో కలిసి రాష్ట్ర విభజనలో లోకేష్ భాగస్వామి అయ్యారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో లోకేష్ తన వంతు పాత్ర పోషించారు. ఇందుకు ఎల్లోమీడియా కూడా సహకారం అందించింది. ఈ విషయాలపై లోకేష్ ఎందుకు మాట్లాడరు. తన కంటే సీనియర్ నాయకులు ఉండగా పార్టీ పదవులు చేపట్టేందుకు ఆయన ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పెద్ద కొడుకు హోదాలో వారసత్వంగా పదవి కోరుకుంటున్నారా. పార్టీకి సేవలందించినందుకు మెచ్చి పీఠమెక్కిస్తారా. లోకేష్ కంటే ఎక్కువగా పార్టీకి సేవలందించిన వారికి ఆయనతో సమానంగా గౌరవం ఎందుకు దక్కలేదు. వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీలపై విరుచుకుపడే ఎల్లో మీడియా ఈ విషయంలో మౌనంగా ఎందుకుంది. కుమారుడిని అందలం ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసిన ఆరు లక్షల మంది టీడీపీ కార్యకర్తలను ఏవిధంగా గౌరవిస్తారు. వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తారా. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఐవీఆర్ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ఎంపిక చంద్రబాబు తన సొంత కుమారుడికి పార్టీ పదవి అప్పగించే విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారా. రాష్ట్రం కలిసుండాలా, వద్దా అనే దానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలను అభిప్రాయాలను చంద్రబాబు ఎందుకు తీసుకోలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మార్గాల గురించి ఆయన పట్టించుకోలేదు. కాంగ్రెస్ నుంచి వలసవచ్చిన నాయకులకు స్వాగతం చెప్పడంపైనే దృష్టి పెట్టారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక తిట్టిన నోటితోనే నరేంద్ర మోడీని స్తుతించి బీజేపీతో జట్టు కట్టారు. ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక రాజకీయ సన్యాసం తప్పదని భావించిన బాబు బీజేపీని బలవంతంగా దోస్తీకి ఒప్పించారు. చివరకు 1.9 ఓట్ల శాతంతో అధికారాన్ని దక్కించుకున్నారు. తండ్రీ, కొడుకుల అబద్దపు వాగ్దానాలను నమ్మి ప్రజలు టీడీపీకి ఓటు వేశారు. ఇదంతా తన కుమారుడి ఘనతే అన్నట్టుగా మీడియాలో ఎనలేని ప్రచారం కల్పించారు చంద్రబాబు. నిజంగా లోకేష్ సత్తా ఎంటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎల్లోమీడియా అండతో నారా లోకేష్ ఆయన అనుచరగణం ఎన్ని కుతంత్రాలు చేసినా వారికి దక్కింది రెండు శాతం ఓట్ల విజయం మాత్రమే. -వెంకట్ రాజు(అమెరికా) ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. సాక్షి డాట్ కామ్ కు ఎటువంటి సంబంధం లేదు. -
‘దేశం’ దొంగాట
సాక్షి ప్రతినిధి, గుంటూరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వినూత్నమంటూ చేపట్టిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ఆ పార్టీ నాయకులే అనుమానిస్తున్నారు. నిన్నటి వరకు టికెట్ తనకే వస్తుందని ఆశించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి పేర్లు ఇందులో లేకపోవడంతో నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి తెరలేపింది. తొలి నుంచి పార్టీకోసం పనిచేస్తున్న వారికి కాకుండా వలసవాదులకు, పారిశ్రామిక వేత్తలకు టికెట్లు కేటాయించేందుకు ఐవీఆర్ఎస్ను ఒక సాధనంగా టీడీపీ అధినాయకత్వం ఉపయోగించుకుంటుదన్న అనుమానాలు ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి తొలి నుంచి టికెట్లు ఆశిస్తున్న కోవెలమూడి నాని, పశ్చిమ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న యాగంటి దుర్గారావు పేర్లు సైతం లేవు. అలాగే కొత్తగా పారిశ్రామికవేత్త తులసి ప్రభుకు టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన పేరు సైతం ఇందులో లేదు. ఆప్షన్లలో 1. మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, 3. వసంత కృష్ణ ప్రసాద్‌ల పేర్లు ఉన్నాయి. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మంగళగిరి టికెట్ ఆశిస్తున్నారు. ఇక వసంత కృష్ణప్రసాద్ ఇప్పటి వరకు పార్టీలోనే చేరలేదు. కేవలం రెండు, మూడు రోజుల నుంచి మాత్రమే ఆయన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అలాంటప్పుడు ముందుగానే ఐవీఆర్ఎస్లో వసంత పేరు ఎలా వస్తుందని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు కోటరీగా వ్యవహరిస్తున్న ముఖ్యుల ద్వారా తన పేరును ఐవీఆర్ఎస్లో ఉండేలా చూసుకుంటున్నారని వారు అనుమానిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో గ్రంధి కాంతారావు, సినీనటుడు ఆలీ, మిట్టపల్లి ఉమామహేశ్వరరావు, దేవరశెట్టి సుబ్బారావుల పేర్లు ఐవీఆర్ఎస్ లో వస్తున్నాయి. ఇక్కడ కూడా అంతా ఒక పథకం ప్రకారమే ఆ పేర్లు వస్తున్నాయని విమర్శలు లేకపోలేదు. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు గ్రంధి కాంతారావు ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న ఎం.ఏ హకీమ్, అల్తాఫ్, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ల పేర్లు ఇందులో లేవు. ముందుగా టికెట్ కేటాయించిన వారి పేర్లే ఇందులో చేర్చుతున్నారు. అంటే తొలి నుంచి పార్టీకోసం పనిచేసిన వారిమీద అధినాయకత్వానికి నమ్మకం లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రలతో పాటు తెనాలిలో ఆలపాటి, నరసరావుపేట స్థానం కోడెలకు ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఐవీఆర్ఎస్లో సత్తెనపల్లి అభ్యర్థిగా కోడెల, వైవీ ఆంజనేయులు పేర్లు వస్తుండగా నియోజకవర్గం ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ పేరు లేదు. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్, దేవినేని మల్లిఖార్జునరావుల పేర్లు వస్తున్నాయి. వాస్తవానికి అనగాని పేరు ఖరారైనట్లు ప్రచారం చేసినా కొత్తగా పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దేవినేని పేరు రావడం పార్టీ వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. అనగానికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వారు ముందుగానే ఊహిస్తున్నారు. బాపట్లలో చీరాల గోవర్ధనరెడ్డి, అన్నె సతీష్‌ల పేర్లు ఉన్నాయి. మాచర్ల, గురజాల, మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో సైతం ఇదే తరహాగా ఉంది. ముందే మ్యాచ్ ఫిక్సింగ్... చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్ఎస్ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్‌ను తలపిస్తుందంటూ ఆ పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులను నేరుగా ప్రకటించినా తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రజాభి ప్రాయం అంటూ వారికి ఇష్టమొచ్చిన పేర్లు ముందుగానే చేర్చి వారిపేర్లు చెప్పే వారికే ఫోన్లు వచ్చేలా సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పార్టీలోకి పారిశ్రామికవేత్తలను, వలసవాదులను ఆహ్వానించేందుకు దీన్ని రాజమార్గంగా పార్టీ ఎంచుకుందనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. -
‘దేశం’లో ఐవీఆర్ఎస్ ముసలం
సాక్షి,సిటీబ్యూరో/న్యూస్‌లైన్ కుత్బుల్లాపూర్: ‘మీకు నచ్చినోడే.. మా అభ్యర్థి’ అంటూ, అందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ప్రజాభీష్టాన్ని తెలుసుకుంటామన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిజంగానే ప్రజాభిప్రాయం ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారా? లేక తనకు నచ్చినవారినే అభ్యర్థిగా నిలిపేందుకు వేసిన కొత్త ఎత్తుగడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘గ్రేటర్’లోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లోని కొందరికి సోమవారం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఫోన్ వచ్చింది. దాని ద్వారా తమ అభిప్రాయం తెలియజేయాలనుకున్నవారు తెల్ల మొహం వేయాల్సి వచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి దిగువవారిలో ఎవరు మీ అభ్యర్థి అయితే బాగుంటుందని ఆరా తీశారు. అందులో కేపీ వివేకానంద్‌గౌడ్, కూన వెంకటేశ్‌గౌడ్, అరవింద్‌కుమార్‌గౌడ్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఎవరి పేరుకైనా ఆమోదం తెలపాలం టే.. సంబంధిత నెంబరు నొక్కాలి. ఎవరూ నచ్చకపోయి నా ఆ అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. తమకు నచ్చినవారి పేరు చెప్పవచ్చు. కాగా, వీరిలో కూన వెంకటేశ్‌గౌడ్, అరవింద్‌కుమార్‌గౌడ్ తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని స్థానికులెవరూ ఊహించలేదు. అందుకు కార ణం వారు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాదు. ఈ పరిస్థితుల్లో వారి పేర్లు విన్న వారు బిత్తరపోయారు. ఇది ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కేపీ వివేకానందగౌడ్‌ను 2010లో షాపూర్లో జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు తాను ఇచ్చిన మాటను తానే వెనక్కు తీసుకుంటున్నారా? లేక ఐవీఆర్ఎస్ సాకుతో ఇష్టంలేని వారిని అసెంబ్లీ బరి నుంచి తొలగించనున్నారా? అన్న సందేహాలు టీడీపీ కార్యకర్తల నుంచి వ్యక్తమయ్యాయి. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే ఆశతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాలు చేస్తున్న కొందరు టీడీపీ నేతలు సైతం తాజా తీరుతో ఆందోళనలో మునిగారు. తమకే టిక్కెట్టు వస్తుందని ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామ ని, ఇప్పుడు ఐవీఆర్ఎస్ పేరుతో తమను కాదంటే పరిస్థితేమిటని వారు అయోమయంలో పడ్డారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జులుగా ఉన్నవారికే సంబంధిత నియోజకవర్గ టిక్కెట్ వస్తుందనే నమ్మకం ఇప్పటి దాకా ఉంది. తాజా పరిణామాలతో గ్రేటర్‌లోని పలువురు ఇన్‌ఛార్జులు సైతం ఒక్కసారిగా కంగు తిన్నారు. ఐవీఆర్ఎస్ పేరిట టిక్కెట్ ఇవ్వకుండా కొంప ముంచుతారా అని వారు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికేతరుల కోసమా? కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు ఒక్క పేరుపైనే ఆరా తీశారని, ఫోన్ అందుకున్న వారు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీకి మరో అభ్యర్థే కరువయ్యారా లేక ఆయన పేరుకు ప్రజాస్పందన లేదనే సాకుతో స్థానికేతరులను తెస్తారా? అనే ఊహాగానాలూ సాగుతున్నాయి. -
‘చంద్ర’ డ్రామా
సాక్షి, ఒంగోలు : ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా కార్యకర్తలు, పార్టీ నాయకుల ఫోన్ నంబర్లకు వాయిస్ మెయిల్ చేసి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు అభిప్రాయాలు సేకరించడం మాటున దాగున్న అంతరార్థం తమకు ఎరుకేనంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇన్నాళ్లూ కష్టపడిన వారిని పక్కకు తప్పించి.. ఇప్పటికిప్పుడు పార్టీకి భారీగా ఫండ్నిచ్చే వారికి సీట్లు కట్టబెట్టేందుకు బాబు అభిప్రాయసేకరణ పేరిట డ్రామా ఆడుతున్నారని చెబుతున్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా, ఏఒక్క చోటా అసెంబ్లీ అభ్యర్థి పేరును ఖరారు చేసి ప్రచారం చేసుకోవాల్సిందిగా అధినేత హామీనివ్వకపోవడంతో.... పార్టీ సీనియర్లు, ఆశావహులు డైలామాలో ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని గతంలోనే పలికిన చంద్రబాబు నేడు, ప్రయోగాల ప్రణాళిక అమలు చేస్తాననడంపై పార్టీ సీనియర్లు మదనపడుతున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయం లేక ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరి మరింత ఇబ్బందికరంగా మారుతుందనే భయం తలెత్తుతోంది. పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు.. ‘మీ ఊరు, మీ అభివృద్ధి, మీకు నచ్చిన వ్యక్తే.. నాకూ నచ్చుతాడు..’ అని చెబుతూ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణతోనే తమ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ఎంపికచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు మాటల్ని నేత బీర చందమేనంటున్నాయి ఆపార్టీ వర్గాలు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పటికీ తేలని అంశమైంది. బాపట్ల లోక్‌సభను ఆశించి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి దేవానంద్ విషయంలో బాబు ఏనిర్ణయం తీసుకోలేదు. ఒంగోలు అసెంబ్లీ స్థానానికి కిందటి ఎన్నికల్లో పోటీచేసి ఓడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోమారు టికెట్ ఆశిస్తుండగా, అక్కడ అతని ప్రాధాన్యతను తగ్గించే వ్యూహాలు నడుస్తున్నాయి. ఈవిషయంలో దామచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కరణం బలరాంను చంద్రబాబు ప్రోత్సహిస్తూనే.. అతనికీ అద్దంకి సీటును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. కనిగిరిలో కూడా తాజాగా మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు టీడీపీలోకి రావడంతో.. అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న కదిరి బాబురావును ఏవిధంగా పక్కకు తప్పించాలనే ప్రణాళిక నడుస్తోందని తెలిసింది. గిద్దలూరుకు సాయికల్పనారెడ్డి పేరును కాదని, ఆమె కొడుకు అభిషేక్‌రెడ్డికి సీటు కేటాయింపుపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. తల్లీకొడుకులకు చెరోవిధంగా చెబుతూనే... అక్కడ్నే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు చంద్రబాబు మదిలో ఉందని సమాచారం. దర్శిలో శిద్దా రాఘవరావుదీ అదే పరిస్థితిగా ఉంది. అతనికీ చివరి వరకు సీటు ఖరారవుతుందా..? లేదా..? అనేది చెప్పలేమని పార్టీ వర్గాల అభిప్రాయం. చీరాలలో పోతుల సునీత మినహా సంతనూతలపాడు, యర్రగొండపాలెం, పర్చూరు స్థానాల్లో తామే అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారికి చంద్రబాబు ఆఖరున చెంపచెళ్లమనిపించే ప్రమాదం పొంచి ఉందనేది పార్టీ సీనియర్ల అభిప్రాయం. పర్చూరు విషయంలో ఏలూరు సాంబశివరావు దగ్గర్నుంచి పార్టీకి భారీగా ఫండ్ తీసుకున్నట్లు.. ఆయన నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరికి బినామీగా ఉన్నందున సీటు విషయంలో గట్టెక్కవచ్చనేది ‘ఏలూరి’ అనుచరుల వాదన. ప్రయోగాలతో తప్పని పతనం: ఎన్నికలొచ్చిన ప్రతీసారీ ఏదోరకంగా ప్రయోగాల పేరిట పార్టీ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి.. భారీగా డబ్బు ఖర్చుపెట్టించడం.. ఆఖరికి సీటు లేదనడం ఆనవాయితీగా వస్తున్నదేనని జిల్లా పార్టీశ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. గడచిన ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, రాజ్యసభ సీట్ల కేటాయింపు తీరు.. తాజాగా చంద్రబాబు ప్రకటించిన అభిప్రాయసేకరణ ప్రయోగంతో పోల్చుకుంటూ పార్టీవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పొలిట్‌బ్యూరో సభ్యుల్ని విడివిడిగా పిలిచి మాట్లాడేక్రమంలో.. చంద్రబాబు తన మదిలోని మాటను ఇతరుల అభిప్రాయంగా వినిపించి.. ఏకాభిప్రాయానికి తేవడం అందరికీ తెలిసిందే. సీఎం రమేష్, సుజనాచౌదరి తదితరులు పార్టీని ఆర్థికంగా ఆదుకుంటున్నారని బాబు జిల్లా నేతలకు సందర్భానుసారం చెబుతూనే ఉన్నారు. వారందర్నీ రాజ్యసభకు పంపిన తీరుపై అప్పట్లో నేతల రాద్ధాంతాన్ని జిల్లా శ్రేణులు గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. నియోజకవర్గాల్లో నమ్మకం కోల్పోయిన టీడీపీ తాజాగా ప్రయోగాల పేరుతో మరింత పతనం దిశగా అడుగులేస్తుందని.. రానున్న ఎన్నికల్లో ఆపార్టీ ఘోరపరాభవం చవిచూస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.