‘చంద్ర’ డ్రామా | Sakshi
Sakshi News home page

‘చంద్ర’ డ్రామా

Published Tue, Mar 18 2014 1:36 AM

irregularities in candidate selection

సాక్షి, ఒంగోలు : ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా   కార్యకర్తలు, పార్టీ నాయకుల ఫోన్ నంబర్లకు వాయిస్ మెయిల్ చేసి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు అభిప్రాయాలు సేకరించడం మాటున దాగున్న అంతరార్థం తమకు  ఎరుకేనంటున్నారు ఆ పార్టీ నేతలు.  ఇన్నాళ్లూ కష్టపడిన వారిని పక్కకు తప్పించి.. ఇప్పటికిప్పుడు పార్టీకి భారీగా ఫండ్‌నిచ్చే వారికి సీట్లు కట్టబెట్టేందుకు బాబు అభిప్రాయసేకరణ పేరిట డ్రామా ఆడుతున్నారని చెబుతున్నారు.

 జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా, ఏఒక్క చోటా అసెంబ్లీ అభ్యర్థి పేరును ఖరారు చేసి ప్రచారం చేసుకోవాల్సిందిగా అధినేత హామీనివ్వకపోవడంతో.... పార్టీ సీనియర్లు, ఆశావహులు డైలామాలో ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని గతంలోనే పలికిన చంద్రబాబు నేడు, ప్రయోగాల ప్రణాళిక అమలు చేస్తాననడంపై పార్టీ సీనియర్లు మదనపడుతున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయం లేక ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరి మరింత ఇబ్బందికరంగా మారుతుందనే భయం తలెత్తుతోంది.

 పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు..
 ‘మీ ఊరు, మీ అభివృద్ధి, మీకు నచ్చిన వ్యక్తే.. నాకూ నచ్చుతాడు..’ అని చెబుతూ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణతోనే తమ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ఎంపికచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు మాటల్ని నేత బీర చందమేనంటున్నాయి ఆపార్టీ వర్గాలు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పటికీ తేలని అంశమైంది. బాపట్ల లోక్‌సభను ఆశించి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి దేవానంద్ విషయంలో బాబు ఏనిర్ణయం తీసుకోలేదు.

ఒంగోలు అసెంబ్లీ స్థానానికి కిందటి ఎన్నికల్లో పోటీచేసి ఓడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోమారు టికెట్ ఆశిస్తుండగా, అక్కడ అతని ప్రాధాన్యతను తగ్గించే వ్యూహాలు నడుస్తున్నాయి. ఈవిషయంలో దామచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కరణం బలరాంను చంద్రబాబు ప్రోత్సహిస్తూనే.. అతనికీ అద్దంకి సీటును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. కనిగిరిలో కూడా తాజాగా మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు టీడీపీలోకి రావడంతో.. అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న కదిరి బాబురావును ఏవిధంగా పక్కకు తప్పించాలనే ప్రణాళిక నడుస్తోందని తెలిసింది. గిద్దలూరుకు సాయికల్పనారెడ్డి పేరును కాదని, ఆమె కొడుకు అభిషేక్‌రెడ్డికి సీటు కేటాయింపుపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు.

 తల్లీకొడుకులకు చెరోవిధంగా చెబుతూనే... అక్కడ్నే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు చంద్రబాబు మదిలో ఉందని సమాచారం. దర్శిలో శిద్దా రాఘవరావుదీ అదే పరిస్థితిగా ఉంది. అతనికీ చివరి వరకు సీటు ఖరారవుతుందా..? లేదా..? అనేది చెప్పలేమని పార్టీ వర్గాల అభిప్రాయం. చీరాలలో పోతుల సునీత మినహా సంతనూతలపాడు, యర్రగొండపాలెం, పర్చూరు స్థానాల్లో తామే అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారికి చంద్రబాబు ఆఖరున చెంపచెళ్లమనిపించే ప్రమాదం పొంచి ఉందనేది పార్టీ సీనియర్ల అభిప్రాయం. పర్చూరు విషయంలో ఏలూరు సాంబశివరావు దగ్గర్నుంచి పార్టీకి భారీగా ఫండ్ తీసుకున్నట్లు.. ఆయన నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరికి బినామీగా ఉన్నందున సీటు విషయంలో గట్టెక్కవచ్చనేది ‘ఏలూరి’ అనుచరుల వాదన.  

 ప్రయోగాలతో తప్పని పతనం: ఎన్నికలొచ్చిన ప్రతీసారీ ఏదోరకంగా ప్రయోగాల పేరిట పార్టీ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి.. భారీగా డబ్బు ఖర్చుపెట్టించడం.. ఆఖరికి సీటు లేదనడం ఆనవాయితీగా వస్తున్నదేనని జిల్లా పార్టీశ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. గడచిన ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, రాజ్యసభ సీట్ల కేటాయింపు తీరు.. తాజాగా చంద్రబాబు ప్రకటించిన అభిప్రాయసేకరణ ప్రయోగంతో పోల్చుకుంటూ పార్టీవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.

పొలిట్‌బ్యూరో సభ్యుల్ని విడివిడిగా పిలిచి మాట్లాడేక్రమంలో.. చంద్రబాబు తన మదిలోని మాటను ఇతరుల అభిప్రాయంగా వినిపించి.. ఏకాభిప్రాయానికి తేవడం అందరికీ తెలిసిందే. సీఎం రమేష్, సుజనాచౌదరి తదితరులు పార్టీని ఆర్థికంగా ఆదుకుంటున్నారని బాబు జిల్లా నేతలకు సందర్భానుసారం చెబుతూనే ఉన్నారు. వారందర్నీ రాజ్యసభకు పంపిన తీరుపై అప్పట్లో నేతల రాద్ధాంతాన్ని జిల్లా శ్రేణులు గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. నియోజకవర్గాల్లో నమ్మకం కోల్పోయిన టీడీపీ తాజాగా ప్రయోగాల పేరుతో మరింత పతనం దిశగా అడుగులేస్తుందని.. రానున్న ఎన్నికల్లో ఆపార్టీ ఘోరపరాభవం చవిచూస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement