తొలిపోరులో టీడీపీ విజయం
సాక్షి, ఏలూరు : పురపాలక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతోపాటు 6 మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ టీడీపీ పరమయ్యాయి. నరసాపురంలో 31 వార్డులు ఉండగా, 3 వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ చెరో 14 వార్డుల చొప్పున గెలుచుకోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. అన్ని మునిసిపాలిటీల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్ధులు స్వల్ప ఓట్లతో తేడాతోనే ఓటమి చవిచూసినప్పటికీ ప్రజల్లో ఆ పార్టీకి అమితమైన అభిమానం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కేవలం ధన ప్రవాహం కారణంగానే టీడీపీకి ఈ విజయం లభించిందనేది విశ్లేషకుల అభిప్రాయం. తీవ్ర ప్రలోభాలతో ఓట్లను కొనుగోలు చేసి ఆ పార్టీ నేతలు పురపాలికలను సొంతం చేసుకున్నారు. మరోవైపు పట్టణాల్లో సంస్థాగత నిర్మాణం పూర్తిగా లేకపోవడం.. అనుకోకుండా ఎన్నికలు రావ డం.. అన్నిచోట్లా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పూర్తిగా జరగకపోవడం లాంటి అంశాలు ఉన్నప్పటికీ ఓట్లను రాబట్టుకోవడంలో వైఎస్సార్ సీపీ మెరుగైన ఫలితం పొందిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.