కమలంలో ముళ్లు.. తెలంగాణ నేతల పోరుబాట
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయస్థాయిలో బీజేపీ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధం అవుతుండగా, ఇక్కడ తెలంగాణలో మాత్రం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటుకు నాయకులు కత్తులు నూరుతున్నారు. తెలంగాణలో వచ్చే ఫలితాలు ఎటూ ఊహించినవే కాబట్టి.. ఇక్కడ ఎదురు తిరగాలనే వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో టీడీపీతో పొత్తు కుదిరినప్పటి నుంచి అభ్యర్ధులకు బీ ఫారాలు ఇచ్చేవరకు జరిగిన తతంగం వెనుక చాలా విషయాల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తెలంగాణ నాయకులు తీవ్రంగా మధన పడుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కనీసం సమీక్ష కూడా చేసే స్థితిలో పార్టీ లేకపోవడం ఏంటని నాయకులను నిలదీయడానికి కార్యకర్తలు సిద్ధవుతున్నారు. పార్టీ గెలవాలని పోటీ చేస్తోందా లేక ఇతర పార్టీలను బతికించడానికి పోటీ చేస్తోందా అని కూడా ప్రశ్నించనున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీరును కూడా ప్రశ్నిస్తామంటూ బీజేపీ నాయకులు మీడియా వద్ద తమ ప్రైవేటు సంభాషణల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పోరుయాత్రతో పాటు, తెలంగాణ ఉద్యమాల్లో తీవ్రంగా కష్టపడ్డ తమను, టిక్కెట్ల కేటాయింపు విషయంలో కనీసం సంప్రదించకుండా కిషన్ రెడ్డి వ్యవహరించారని నిన్న మొన్నటి వరకు ఆయనకు గట్టి మద్దతుగా ఉన్నవాళ్లే వాపోతున్నారు. తెలంగాణలో పార్టీ బాగుపడాలంటే పార్టీ అధ్యక్షుడితో సహా పార్టీ సీనియర్ నాయకులందరినీ మార్చాలని, ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ లీడర్లకు కాకుండా గ్రామీణ నేపథ్యం ఉన్న నాయకుల చేతికి పార్టీని అప్పగించాలని జిల్లాల నాయకులు డిమాండ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ ఎటు తిరిగి ఎటు వెళ్తాయోనని పార్టీ అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోంది.