పాలమూరులో ‘దేశం’ కనుమరుగు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ రాజకీయ ముఖ చిత్రం నుంచి టీడీపీ క్రమంగా కనుమరుగవుతోంది. ముఖ్యనేతలు, క్రియాశీల కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటంతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. పోటీలో ఉన్నా చాలా చోట్ల ఉనికి కోసమే నామినేషన్లు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎల్కొటి ఎల్లారెడ్డి (నారాయణపేట), జైపాల్ యాదవ్ (కల్వకుర్తి) పార్టీని వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా ద్వితీయశ్రేణి నాయకత్వం మూకుమ్మడిగా ఇతర పార్టీల్లో చేరింది. షాద్‌నగర్, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, ఆలంపూర్, మహబూబ్‌నగర్‌లో కనీసస్థాయి నాయకత్వం కూడా లేకుండా పోయింది. కల్వకుర్తి నగర పంచాయతీలో కేవలం ఒక వార్డులో మాత్రమే పార్టీ అభ్యర్థి బరిలో ఉండడం తెలుగుదేశం పరిస్థితికి అద్దం పడుతోంది. బీజేపీతో ఎన్నికల అవగాహన ఉంటుందనే వార్తలతో.. ఇక ఈ పార్టీలో ఉన్నా భవిష్యత్ లేదనే భావన పార్టీ కేడర్‌లో కనిపిస్తోంది.
* షాద్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఉన్నా నాయకులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. 2009లో ఎన్నికల అవగాహనలో భాగంగా టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు కుదిరితే టీడీపీ పోటీలో ఉండే అవకాశం లేదు. ఒక వేళ టీడీపీ పోటీ చేస్తే తమకే టికెట్ ఇవ్వాలని బీసీ నేతలు పట్టుపడుతున్నారు.
* నారాయణపేటలో ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి ఇటీవలే పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని రాజేందర్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నా పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.
* మక్తల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి ఉన్నా ఆయన రాజకీయ భవిష్యత్‌పై కేడర్‌లో అయోమయం నెలకొంది. ఎమ్మెల్యే ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ నుంచి మక్తల్‌లో పోటీ చేస్తారనే వార్తలతో టీడీపీ నుంచి ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి.
* జడ్చర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీ కేడర్‌ను పట్టించుకోవడం లేదు. దీంతో మూకుమ్మడిగా టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో మెజారిటీ శాతం టీడీపీ నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం.
* ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఒకవేళ మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే యోచనలో వున్నారు.
* కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీని వీడటంతో పార్టీ తరపున అటు మున్సిపల్, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యారు. కల్వకుర్తి నగర పంచాయతీలో 20 వార్డులకు గాను ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు నామమాత్రంగా పోటీ ఇచ్చే అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేశారు.
* నాగర్‌కర్నూల్‌లో సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, ఉపఎన్నికలో పోటీ చేసిన మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీని వీడటంతో చెప్పుకోదగిన నాయకత్వం లేదు.
* అచ్చంపేటలో ఎమ్మెల్యే రాములు పార్టీని వీడుతున్నారనే ప్రచారం పార్టీ శ్రేణులపై ప్రభావం చూపుతోంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాములు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
* కొల్లాపూర్‌లో డాక్టర్ శ్రీనివాస్ పార్టీ బాధ్యతలు చూస్తున్నా కింది స్థాయిలో పటిష్టంగా లేకపోవడంతో సాధారణ ఎన్నికల్లో నామమాత్ర పోటీకి పరిమితమయ్యే అవకాశం వుంది.
* వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి తెలంగాణ మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు అప్పగించారు. ఈసారి తాను ఎన్నికల బరి నుంచి తపుకుని ద్వితీయ శ్రేణి నాయకుడిని ఒకరికి ఎమ్మెల్యే టికెట్ అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
* అలంపూర్‌లో పార్టీ ఇంచార్జి ఆంజనేయులు ఉన్నా ఆర్ధికంగా లేకపోవడంతో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నామమాత్ర పోటీకే పరిమితమవుతోంది.
* దేవరకద్రలో ఎమ్మెల్యే సీతమ్మ పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి వలస వెళ్లింది.
* గద్వాలలో మాజీ మంత్రి డీకే సమర సింహారెడ్డి తన రాజకీ య అనుభవంతో పార్టీని నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
* మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజేశ్వర్‌గౌడ్ టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల్లో అభ్యర్థులను నిలిపేందుకు పార్టీ నేతలు తంటాలు పడి అక్కడక్కడా అభ్యర్థులను బరిలోకి దింపారు.