► 40 సీట్ల తేడాతో సీమాంధ్రలోని 9 జిల్లాల్లో వెనకబడ్డ వైఎస్సార్ సీపీ
► ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఫ్యాన్ హవా
► రాత్రి ఒంటి గంటకు 534 స్థానాల్లో ఫలితాల వెల్లడి.. టీడీపీకి 281; వైసీపీకి 249; ఇతరులకు రెండు
► దాదాపు 120 స్థానాల్లో ఇంకా వెల్లడికాని ఫలితం
► రెండు పార్టీల మధ్య సీట్లలో తేడా కేవలం 4 శాతం.. ఎంపీటీసీల్లోనూ ఇదే తరహా ఫలితాలు
► టీడీపీకి 4,650; వైఎస్సార్ కాంగ్రెస్‌కు 3,897
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లపై ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటూ జరిగిన పోరాటంలో చివరకు తెలుగుదేశం పైచేయి సాధించింది. 13 జిల్లాల్లోని 653 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు (జెడ్పీటీసీ), 10,092 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు జరిగిన ఎన్నికల పోరులో కేవలం 30-40 సీట్ల తేడాతో 9 జిల్లాల్లో టీడీపీ కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనకబడింది. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ పైచేయి సాధించింది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో హోరాహోరీ పోరు సాగించి వెనకబడ్డ వైఎస్సార్ కాంగ్రెస్... కర్నూలు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలను భారీ మెజారిటీతో సొంతం చేసుకుంది. ఈ నాలుగు జిల్లా పరిషత్‌లతో పాటు ఈ జిల్లాల్లోని ఎంపీటీసీల్లోనూ స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 56 జెడ్పీటీసీలుండగా 32 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది.
కడప జిల్లాలో 50 స్థానాలకు గాను మెజారిటీ సీట్లను వైఎస్సార్ సీపీయే గెలుచుకుంది. ఇక నెల్లూరులో 46 స్థానాలకు గాను అధిక స్థానాల్లో విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండగా... మంగళవారం రాత్రి 1 గంట సమయానికి అందిన సమాచారం మేరకు సీమాంధ్రలో 281 జెడ్పీటీసీలను తెలుగుదేశం సొంతం చేసుకోగా... 249 జెడ్పీటీసీలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయ భేరి మోగించింది. కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రె డ్డి నేతృత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీ తలా ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఫలితాలు వెల్లడైన సీట్లను మొత్తం జెడ్పీటీసీ సీట్లతో పోల్చినపుడు టీడీపీ- వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య తేడా 4 నుంచి 5 శాతం మధ్య మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ ఫలితాల ప్రకారం టీడీపీ 43.03 శాతం సీట్లను, వైఎస్సార్ సీపీ 38.13 శాతం సీట్లను గెలుచుకున్నాయి.
ఎంపీటీసీల విషయానికొస్తే కడపటి వార్తలందేసరికి దాదాపు 750 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకన్నా అధికంగా గెలుచుకుని టీడీపీ ముందంజలో ఉంది. రాత్రి 1.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం... 4,650 ఎంపీటీసీల్లో తెలుగుదేశం విజయభేరి మోగించగా... 3,897 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 118 ఎంపీటీసీల్ని, ఇతరులు 405 స్థానాల్ని గెలుచుకున్నారు. మొత్తం సీట్లతో ఫలితాలు వెల్లడైన స్థానాలను పోల్చిచూసినపుడు వైఎస్సార్ సీపీ కన్నా తెలుగుదేశానికి 7 శాతం సీట్లు అధికంగా దక్కాయి. ఈ ఫలితాల ప్రకారం టీడీపీకి 46 శాతం సీట్లు దక్కగా, వైఎస్సార్ సీపీ 38.61 శాతం సీట్లను సొంతం చేసుకుంది.
ఉదయం నుంచి ఉత్కంఠ...
ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో ఏ పార్టీకి ఆధిక్యత లభిస్తుంది? ఏయే జిల్లా పరిషత్‌లను ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంల) ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినందున కౌంటింగ్ ఆరంభించడానికి చాలా సమయం పట్టింది. ముందుగా బ్యాలెట్ బాక్సులు విప్పి బ్యాలెట్లను 25 చొప్పున కట్టలు కట్టిన తర్వాత కౌంటింగ్ ఆరంభించారు.
దీంతో చాలాచోట్ల కౌంటింగ్ ఆరంభించడానికి మధ్యాహ్నం 12 గంటల వరకూ సమయం పట్టింది. కొన్ని జిల్లాల్లో బ్యాలెట్ బాక్సుల్లోకి వర్షపు నీరు రావడంతో బ్యాలెట్లను ఆరబెట్టిన తర్వాత కౌంటింగ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత కూడా ఓట్ల లెక్కింపు కొనసాగింది. తొలుత ఎంపీటీసీ స్థానాల లెక్కింపు ప్రారంభం కావడంతో అర్థరాత్రి దాటిన తర్వాత ఎంపీటీసీ ఫలితాలు దాదాపు పూర్తయ్యాయి. జడ్‌పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభం కావడం, ఓట్ల సంఖ్య ఎక్కువ కావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు.
జెడ్పీల్లో హోరాహోరీ.. దేశం ముందంజ
Published Wed, May 14 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement