తుది దశ ప్రచారానికి తెర
3 రాష్ట్రాల్లో 41 స్థానాలకు రేపు పోలింగ్
న్యూఢిల్లీ: నేతల మాటల యుద్ధాలు, కోడ్ ఉల్లంఘనలు, ఈసీ నోటీసులు, మందలింపులు, పలువురు అభ్యర్థుల అరెస్టులు, ఎన్నికల కమిషన్‌పైనే పలు పార్టీల ధిక్కార స్వరాల మధ్య దాదాపు నెలన్నరపాటు హోరాహోరీగా సాగిన 16వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో చివరి, తొమ్మిదో దశ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంట లకు తెరపడింది. మూడు రాష్ట్రాల్లోని 41 స్థానాలకు (ఉత్తరప్రదేశ్‌లో 18 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 17 స్థానాలు, బీహార్‌లో 6 సీట్లు) సోమవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 606 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. 12న పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలపై నిషేధం తొలగనుంది. 16న ఫలితాలు వెలువడనున్నాయి. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ, కేజ్రీవాల్ తలపడుతున్న వారణాసి స్థానం యావ త్ దేశం దృష్టిని ఆకర్షించడం తో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ. ఆప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.
బరిలోని ప్రముఖులు వీరే: చివరి దశ ఎన్నికల బరిలో ప్రముఖుల్లో నరేంద్ర మోడీ, కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాద వ్ (ఆజంగఢ్ ), కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన జగదాంబికాపాల్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ కుమార్, భోజ్‌పురి నటుడు రవి కిషన్, బీజేపీ నేత కల్‌రాజ్ మిశ్రా, పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ నేతలు దినేశ్ త్రివేదీ ఉన్నారు.
వారణాసిలో హోరాహోరీగా ర్యాలీలు
వారణాసి:వారణాసిలో శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. చివరిరోజు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం హోరాహోరీగా ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. మే 12న పోలింగ్ జరగనున్న వారణాసి నుంచి తలపడుతున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మధ్య ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొనగా, ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు చిన్నా చితకా పార్టీలు సైతం తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని వారణాసి నుంచి 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా చివరి మూడు రోజులు వారణాసిలో హోరాహోరీ ప్రచారం సాగింది. చివరి రోజు తమ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ తరఫున కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 12 కిలోమీటర్ల పొడవున సాగించిన రోడ్‌షో నాలుగు గంటల సేపు సాగింది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కైలాస్ చౌరాసియా తరఫున యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రోడ్ షో నిర్వహించగా, ‘ఆప్’ నేత కేజ్రీవాల్ తరఫున అమేథీ నుంచి రాహుల్‌పై పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ రోడ్‌షో నిర్వహించారు. మిగిలిన వారితో పోలిస్తే, రాహుల్ రోడ్‌షోకు భారీగా జనం హాజరయ్యారు. వారణాసి సమీపంలోని చందౌలిలో కూడా రాహుల్ ప్రచార సభలో ప్రసంగించారు.