సాక్షి, ముంబై: విదర్భలోని పది లోక్‌సభ నియోజకవర్గాల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇన్ని రోజులు రాజకీయ నేతల ప్రసంగాలను విన్న ఓటర్లు నేడు తమ ఓటుతో అభ్యర్థుల తలరాతలు రాసేందుకు సిద్ధమయ్యారు. 19,184 పొలింగ్ కేంద్రాల్లో 1.5 కోట్లకుపైగా ఉన్న ప్రజలు తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్ ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మొహరించింది.
భద్రత దృషి కోణంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి మద్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది. మిగతాప్రాంతాల్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘాతోపాటు ఏదైన సంఘటన జరిగితే వెంటనే స్పందించేందుకు రెండు హెలిక్యాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచింది. అలాగే పొలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందే చేసిపెట్టింది. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ఎండలో వచ్చి ఓటువేసే వారికి పొలింగ్ కేంద్రం వద్ద మంచినీరు అందుబాటులో ఉంచింది.
వృద్ధులు, వికలాంగులకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన వారిలో కనబడుతోంది. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్‌తోపాటు ముఖుల్ వాస్నిక్, నితిన్ గడ్కారి, విలాస్ ముత్తెంవార్ మొదలగు దిగ్గజ నాయకులకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. విదర్భలోని 1.5 కోట్లకుపైగా ఉన్న ఓటర్లు మంగళవారం 201 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో భద్రపరచనున్నారు.
ఎన్నికలు జరిగే నియోజకవర్గాలివే...
బుల్డానా, అకోలా, అమరావతి, వర్ధా, రాంటెక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం.
ప్రముఖ అభ్యర్థులు...
నితిన్ గడ్కారీ, ప్రఫుల్ పటేల్, విలాస్ ముత్తెంవార్, ముఖుల్ వాస్నిక్, అంజలి దమానియా, శివాజీరావ్ మోఘే, సంజయ్ దేవతలే, నామదేవ్ ఉసెండి, సాగర్ మోఘే, ఆనంద్ అడ్సూల్, భావనా గావ్లీ, ప్రతాప్ జాధవ్, సంజయ్ ధోత్రే, రామ్‌దాస్ తడస్, హంసరాజ్ ఆహీర్, అశోక్ నేతే, నవనీత్ కౌర్, ప్రకాష్ అంబేద్కర్
ముఖ్యమైన వివరాలు..
10 లోకసభ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్యః 1,66,39,267
పోలింగ్ కేంద్రాల సంఖ్యః 19,184
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుః 556
ఈవీఎంల సంఖ్యః 41,661
ఎన్నికల సిబ్బంది సంఖ్యః 1,43,880
నేడే పోలింగ్
Published Wed, Apr 9 2014 10:31 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement