ఈ దూకుడు.. సాటెవ్వరూ..
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థుల హవా
ప్రచారంతోపాటు అన్ని అంశాల్లోనూ ముందంజ
ఆందోళనలో టీడీపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థులు
కమలం, సైకిల్‌కు బ్రేకులు ఖాయం !
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు పెరుగుతోంది. జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు దుమ్మురేపుతున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతోపాటు అన్ని విషయల్లోనూ ముందుంటూ పైచేయి సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన తెలుగుదేశం అభ్యర్థికి అందనంత స్పీడులో వెళుతున్నారు. ఇక నరసాపురం ఎంపీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ ఆలస్యంగా వచ్చినా పట్టు బిగించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు టీడీపీ నేతలను దారికి తెచ్చుకునే పనిలో ఉండగానే రవీంద్రనాథ్ దూసుకు వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల్లో నైరాశ్యం అలముకుంది. గెలుపుపై మొన్నటి వరకూ ధీమా వ్యక్తం చేసిన టీడీపీ, భాజపాల ఎంపీ అభ్యర్థుల స్వరంలో మార్పు వచ్చింది. దీంతో ఏలూరు, నరసాపురంలో వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. వారి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు ఇంటింటా విస్తృతంగా పర్యటించి తాము గెలిస్తే ఏంచేస్తామో ఓటర్లకు వివరిస్తూ తోట చంద్రశేఖర్, వంక రవీంద్ర నాథ్ ప్రచారం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీలను ఏమాత్రం నమ్మేస్థితిలో లేని ఓటర్లు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మాటలను విశ్వసించడం లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.
కుదరని పొత్తులు..
మొదట్లో తామే విజయం సాధిస్తామంటూ బీరాలు పలికిన టీడీపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థులు చివరకు డీలా పడిపోయారు. టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు, బీజేపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు అసలు జనాల్లోకే వెళ్లలేదు. టీడీపీ, బీజేపీ జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగటం ఎంతవరకూ లాభిస్తుందో తెలుగు తమ్ముళ్లకే అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. నరసాపురం ఎంపీ బరిలో నిలిచేందుకు చివరివరకూ ప్రయత్నించి విఫలమైన రఘురామకృష్ణంరాజు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కనీసం ఒక్కసారి కూడా బీజేపీ తరఫున ప్రచారం చేయకపోవడం, టీడీపీ నేతలు సైతం నరసాపురం సీటుపై పెద్దగా దృష్టి సారించకపోవటం బీజేపీ నేతలను కలవరపెడుతున్నాయి. ఇక ఏలూరు లో మాగంటి బాబు దాదాపు కాడి వదిలేసినట్టే కనిపిస్తోంది. ఏలూరు పార్లమెంటరీ ని యోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు మాగంటి తీరుపై ఆందోళన చెందుతున్నా రు. బీజేపీతో పొత్తుపెట్టుకోవటం ద్వారా తమకు లాభం లేకపోగా సంప్రదాయ ఓటర్లను నష్టపోతున్నామనే భావన టీడీపీ నేతల్లో నెలకొంది. టీడీపీకి పట్టున్న అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తోటకు అనుకూల పవనాలు వీస్తున్నాయి.
తోట, వంక విస్తృత ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు అభ్యర్థి తోట చంద్రశేఖర్, నరసాపురం అభ్యర్థి వంక రవీంద్రనాథ్ తమదైన శైలిలో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించారు. తోట చంద్రశేఖర్ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో అమలు చేస్తానంటూ హామీ ఇవ్వటంతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. అదేస్థాయిలో వంక రవీంద్రనాథ్ కూడా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి సమస్యపై పూర్తి అవగాహనతో వాటిని ఎలా పరిష్కరిస్తామో.. ఎలా అభివృద్ధి చేస్తామో వివరించి ముం దుకు సాగారు. ప్రధానంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తిచేయటం, డెల్టా ఆధునికీకరణ, నరసాపురం-విజయవాడ-నిడదవోలు రైల్వే లైను డబ్లింగ్ పనులు చేపట్టడం, కొత్తగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటింగ్‌పాటు సామాజికవర్గాల సమీకరణలు వీరికి కలిసిరానున్నాయి.